పుట:Konangi by Adavi Bapiraju.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“అర్థమయింది. చాలా బాగా ఉంది. అయినా పరీక్షకోసం కాకపోయినా నాకు వేసవికాలంలో కావ్యవిమర్శ అంతా మీరు చెప్పాలి”

“నేనే కావ్యవిమర్శ చెప్పడం! నాకేం తెలుసునండీ?”

“నన్ను అండీ అనకండి.”

“క్షమించండి....కాదు క్షమించు అనంతలక్ష్మి!”

“మా గురువుగారిని మేము క్షమించడమే! అమ్మో!”

అనంతలక్ష్మి తలవంచే మాట్లాడుతూంది. ఆ మాటలలో కొంచెం సిగ్గు కొంచెం విచారమూ కూడా మిళితమై ఉన్నాయి.

“అనంతలక్ష్మిదేవి!”

“ఎందుకండి?”

“నన్ను అండి అనవచ్చునా? నేను అండిగినా!”

“గురువులను అండి అనడం మన పూర్వాచారం.”

“గురువులు చదువులకు అండగలంటివారన్నమాట!”

అనంతలక్ష్మి నవ్వుకుంది.

“అనంతలక్ష్మీదేవి! నేను నా ఉద్యోగానికి ఇవాళ నీళ్ళు వదలుకున్నట్లే”

“మీరు ఉద్యోగం మానివేసినట్లయితే తక్షణం మా ఇంటికి వచ్చేయండి.”

8

అనంతలక్ష్మి ఆశతో ఆ మాట అంది. ఆమెను చూచి కోనంగి విచార వదనంతో “అనంతలక్ష్మిదేవి, నేను కటికదరిద్రుణ్ణి. నాకు మా అమ్మ తప్ప ఇంకెవ్వరూ లేరు. బి.ఏ. పరీక్షలో మాత్రం మొదటి తరగతిలో నేగ్గాను. ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్నాను. అందుకని మదరాసు వచ్చాను.వైటువే కంపెనీలో చేరాను. ఆ ఉద్యోగం అయిపోయింది” అని అన్నాడు.

“ఏ ఉద్యోగం చేయాలని మీ ఆశయం?”

“ఏ ఉద్యోగంలోనూ చేరలేను, చేరకుండా వుండలేను.”

“ఇదేమి చిత్రం!”

“అదే నా జీవిత రహస్యం. ఏదో అసంతృప్తి. ఒక్కచోటా ఉండ లేను. ఏ పనీ చేయలేను. చేయబూనుకుంటే మాత్రం ఆద్భుతంగా చేయగలను.”

“మీరు పాఠం చెబుతోంటేనే నాకర్థమయింది.”

“ఏమని?”

“మీరేదో మహత్తరకార్యంకోసం ఉద్భవించారని.”

“ఆ మహత్తరకార్యం ఏమిటో తెలిస్తే బాగుండిపోను. దాన్నిబట్టి నా జీవితవిధానం ఏర్పాటు చేసుకొందును. నా ప్రయత్నాలన్నీ ఆ ఆశయం కోసం చేసి ఉందును.”

“ఏ విధమైన ఉద్యోగం చేద్దామని మీ ఉద్దేశమో తెలియడం మంచిది కాదా అండి?”

“నిజమేనమ్మా. రెవెన్యూ వగైరాది ప్రభుత్వోదోగాలు చేయాలని సరదా పుట్టదు. పోనీ ప్లీడరీ చేద్దామంటేనే అసహ్యం. బుడబుడక్క జోస్యమూ, గాంధోళిగాని హాస్యమూ జ్ఞాపకం వస్తాయి. వర్తకంగాని, వర్తక కంపెనీలో ఉద్యోగంగాని ఆలోచిస్తే ఎలాంటి