పుట:Konangi by Adavi Bapiraju.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తన్ను పట్టుకుంది. ఈ రోగం రానేరాదు; వచ్చిందా వదలనే వదలదు. ఇంక తనకు స్వాతంత్ర్యంలేదు. ఇంక మనస్సు ఫ్రీలాన్స్ జర్నలిస్టు (పత్రికా స్వేచ్చా విలేఖరి) లా తిరగడానికి వీలులేదే! అలా అని ఇదివరకు తాను మహా ఆడపిల్లలకోసం దేవుళ్ళాడినట్టు? ప్చు, ప్చు. ఆడపిల్లలంటే హడలి బేజారయ్యే తాను దివాస్వప్నాలలో అందమయిన బాలికను ప్రేమిస్తున్నట్లు ఊహించుకునేవాడు.

తన్ను రాయిస్టులు, “ఎస్కేపిస్టు వయ్యావు నువ్వు! ఎందుకంటే నువ్వు కలలు కనకూడ”దని వాళ్ళ ‘విహారి' పత్రికలో రాయవచ్చుగాక! తనకు పగటికలలు రాకపోతే ఏలా బ్రతుకగలడు తాను?

ఇప్పుడిక ఆ పగటికలలు కనడానికి వీలులేదు. ఎందుకంటే ఈ ప్రేమ నిధానమయిన ఈ ఆందాల మనోహరాల బాలిక- అనంతలక్ష్మి - తన జీవితంలోనికి ఒక పెద్ద గాలివానలా వచ్చి ప్రవేశించింది.

అతడు ముడుచుకొని కూర్చున్నాడు, అనంతలక్ష్మి ముడుచుకు కూర్చున్నది.

కారు మహావేగంతో ముందుకు సాగిపోతోంది. ఆ కారు డ్రైవరుకు ఎక్కడకు వెళ్ళాలో తెలియక, బీచి వెంటా బజారుల వెంట తిరుగుతున్నాడు.

కొంతసేపటికి అనంతలక్ష్మి, కోనంగీ కూడా మోటారుకారు మనిషి తన ఇష్టం వచ్చినట్లు కారు పోనిస్తున్నాడని గ్రహించారు.

ఆ కారుడ్రైవరు మొదట బీచిరోడ్డు వెంట వెళ్ళాడు. అక్కడ నుండి ఎస్ప్లనేడు, అక్కడ నుంచి సెంట్రల్, తర్వాత పూనమల్లి హైరోడ్డు, తర్వాత చెటపట్, త్యాగరాజనగరు, అళ్వారుపేట, అటునుంచి మౌబ్రేస్, తర్వాత రాయపేట అక్కడ నుంచి తిన్నగా మైలాపూర్, ఆ వెనక అడయారు వెళ్ళాడు.

అడయారులో ఎక్కడా ఆగకుండా తిన్నగాపోయి, బీచి దగ్గర ఆగినాడు.

కారుడ్రైవరు అనందంనాయుడికి తన చెల్లెలయిన అనంతలక్ష్మి అంటే కన్నకూతురుకన్న ఎక్కువ ఆపేక్ష. ఆమెమీద ఈగను వాలనీయడు. ఆనందంనాయుడికి కోనంగి అంటే ఎందుకో మంచి అభిప్రాయం కుదిరింది.

ఆ మూడుగంటలవేళ వాళ్ళిద్దరూ కారులోంచి దిగారు. దిగడానికి కారణం ఆనందంనాయుడు కారుదిగడానికని తలుపు తీయడమే!

ఇద్దరూ దిగారు. సముద్రం ఒడ్డున చిన్నతోట, తోట అవతల చిన్న ఇసుకబయలు ఉన్నది. ఆ తర్వాత ఒడ్డు, ఆ తర్వాత సముద్రము ఉన్నాయి.

ఇద్దరూ కలిసే నడిచారు. ఇద్దరూ ఒక చక్కని ఇసుక ప్రదేశంలో తోటలో మామిడిచెట్టు నీడను చతికిలపడ్డారు. ఆలోచించుకొన్నట్లు కారు ఎక్కినది మొదలు ఇంతవరకు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు.

“నేను పురుషుణ్ణి. ఈలా మాట్లాడకుండా ఉండడము వట్టి పిరికితనము, చిన్న మనిషితనము, దద్దమ్మతనము? వెర్రితనము” అని అనుకున్నాడు కోనంగి.

“ఇదేమిటి? నేను చదువుకునే విద్వార్థినిని. నేటికాలపుదాన్ని, ఈలా మాటాడకుండా ఉండడము వట్టి పిరికితనము, దద్దమ్మతనము, అవమానకరము” అని అనంతలక్ష్మి అనుకొన్నది.

కోనంగి గొంతుక సవరించుకొని “పాఠం అంతా మనస్సునకు హత్తింది కాదా అండి?” అని అన్నాడు కొంచెం బొంగురుపోయిన గొంతుకతో.