పుట:Konangi by Adavi Bapiraju.pdf/50

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఇతర సినిమా కంపెనీలలో వాటాదారుడుగా ఉన్నాడు. “మదరాసు అఖిల కళామండలి” అనే సభ ఒకటి ఏర్పాటుచేసి, దానికి చక్కని భవనం ఒకటి మౌంటురోడ్డులో అద్దెకు పుచ్చుకున్నాడు. అక్కడే ఒక చిన్న రంగస్థలం అమరించాడు. ఒక చిన్న సినిమా ప్రదర్శక యంత్రంపెట్టి, ఆ ప్రదర్శనాలు ఏర్పాట్లు చేశాడు.

సినిమా కంపెనీలో తారల మధ్య తాను చంద్రుడు, కళామండలిలో కళాపూర్ణుడు.

అనేక రకాల స్త్రీలు అనేక రకాల పిండి వంటలు. ఒకరి పెదవి మాధుర్యం మామిడిపండులా ఉంటే, ఇంకో అప్సరస పెదవి ద్రాక్ష. మరో మధురాధరి అధరం రసగుల్లా, ఒక కలువకంటి వాతెర చాంపేను సారా అయితే ఇంకో విలాసిని వదనము బాదామికీర్.

అందుకని మన చెట్టి వ్యాపారంలో ఎంత ఘట్టిగా ధనం సంపాదిస్తాడో అంత వదులుగా మదగజయానలకై వెచ్చంచేసి, పద్దులో ప్రయివేటు ఖర్చు అని రాసుకుంటాడు.

అలాంటి చంచల విటకావతంసునికి అతని 'వాటర్లూ యుద్ధం అనంతలక్ష్మి ఆవరణలోనూ ఇంటిలోనూ రోజూ జరుగుతోంది.

అనంతలక్ష్మి ఒకనాడు కాలేజీకి వెడుతోంటే, బర్మా మలయాది దేశ విజ్ఞానరహిత వివిధ మానవుల కష్టార్జితమైన విత్తం గుంజుకొనే ఈ చెట్టియారుగారు అవర్గళ్ చూచాడు. హంసతూలికాతల్ప సహస్రాలకన్న మెత్తగా ఉన్న తన రోలురాయిస్ కారు వెనకసీటులో ఒక వెయ్యోవంతు సెకండు నిశ్చేష్టుడై పడిపోయాడు. ఆ కోడెకాడయిన అనంగుడు అలరుటంబులు వేసి చెట్టిగారి హృదయాన్ని ఛిన్నాభిన్నంచేసి వదిలాడు.

అప్పుడు చెట్టిగారికి తెలియకుండానే, ఆయన మనస్సు “ఓ కుందరదనా! ముమ్మొన వాలుచూపులదానా! నా చెట్టియారు హతాశుడు.” అని వాపోయింది.

ఆ బాలిక కారు వెనకే తన కారు పోనిచ్చి, ఆమె క్వీన్ మేరీ కళాశాలకు వెళ్ళడం చూచి, సాయంకాలం మాటేసి, ఆమె ఇల్లు కనిపెట్టి, సమాచారం సమస్తమూ తెలిసికొని జయలక్ష్మి హృదయదుర్గం ఓడిస్తేనే కాని, ఆమె కొమరిత తనకు వశ్యంకాదని ప్రయత్న పరంపర ప్రారంభించాడు.

కాని జయలక్ష్మి హృదయ దుర్గంలోకి ఇతరులు రావడానికి వీలు లేదు. తర్వాత ఏమయినా, ముందర వారి ఇంటిలో అడుగుపెడితే అంతే చాలునని తాను అనంతలక్ష్మి స్వయంవరానికి ఒక దరఖాస్తుదారునిగా మనవి చేసుకున్నాడు.

కోటీశ్వరుడు, ముప్పదిఏళ్ళ బాలాకుమారుడు. ఇంతకన్న పద్దెనిమిదేళ్ళ తన బాలికకు మంచి సంబంధం వేరొకటి ఉండదనుకొని, తన కొమరిత హృదయం కైవసం చేసుకోవడానికి జయలక్ష్మి ఆజ్ఞ జారీచేసింది. ఆ పూట చెట్టియారుగారు వెంటనే ఇంటికిపోయి శైవుడవడంచేత కపాలేశ్వరస్వామికి నారికేళజలాభిషేకం, కందస్వామికి అన్నాభిషేకం, పిళ్ళయారుకి కుడుముల అభిషేకమూ చేయించాడు.

భగవంతుడు తనకు అనుకూలించి, విజయం చేకూర్చితీరుతాడనీ, తక్కిన పని తన అంతులేని ఐశ్వర్యమే సమకూరుస్తుందని చెట్టియారుగారు దృఢనమ్మకంతో అనంతలక్ష్మి హృదయ దుర్గానికి ముట్టడి ప్రారంభించాడు. తన విలాస పురుషత్వశక్తి అంటే చెట్టియారుగారికి నిరవధికమైన గౌరవం తన ధనానికి ఆశించి తన కౌగిలింతలలో కరిగినారు. వివిధ విలాసవతులు, అన్న భావము