పుట:Konangi by Adavi Bapiraju.pdf/45

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ మర్నాడునుంచి కోనంగి వచ్చి పనిలో చేరడం నిశ్చయమైంది. వెంటనే తన నెల్లూరు హెూటలు యజమాని దగ్గరకుపోయి, తనకు పది పదిహేను రోజులు ఇంటి దగ్గర అర్జెంటుపని ఉంది వెళ్ళివస్తానని చెప్పి, ఒక తోలు పెట్టె, రెండుకోట్లు, నాలుగు షర్టులు, రెండు లాగులు, రెండు పంచెలు, రెండు తువ్వాళ్ళు వగైరాలూ, పరుపూ పక్కసర్దుకొని, రాత్రి సామాను పుచ్చుకొని హెూటల్ గుజరాత్ కు చేరుకున్నాడు.

ఆ మర్నాడు ఆ హెూటలు వడ్డనవారల దుస్తులు ధరించి, పెద్ద వడ్డనదారు తనకు బోధించిన విధానాలు మనస్సుకు హత్తించుకొని తన పనిలో చేరాడు.

మొదటే హెూటలు మేనేజరుతో తన కా శనివారం మూడు గంటల నుండి సెలవు కావాలనీ, తన స్వంతపని ఉందనీ చెప్పినాడు. మేనేజరు సరే అని ఒప్పుకున్నాడు.

మూడు గంటలన్నరకు సారా ఇంటికి కోనంగి వెళ్ళినాడు. సారా అతన్ని సగౌరవంగా తీసుకువెళ్ళి తన స్వంత గదిలో కూర్చోబెట్టింది. వాళ్ళ అమ్మా, నాన్నా, చెల్లెళ్ళు, తమ్ముళ్ళూ అందరూ సినీమాకు పోయారు.

అతనికి మంచి కాఫీ తయారుచేసి కేక్, కాఫీలు ఇచ్చింది. కోనంగీ సారా ఇద్దరూ ఉపహారం అయిన తర్వాత సిగరెట్లు తాగుతూ ఇద్దరూ కబుర్లు చెప్పుకోటం ప్రారంభించారు.

సారా: కోన్, నిన్ను చూస్తే ఎందుకో నాకు అపరిమితమైన ప్రేమ కలిగింది. ప్రేమ అంటే, కవులు వర్ణించిన ప్రేమో కాదో నాకు తెలియదు.

కోనంగి: (గుండెల్లో బేజారయ్యాడు.) తప్పకుండా ఏ కవినైనా అడిగి తీరవలసిందే ఆ విషయం. లేకపోతే అయిదారు రకాల కవులను అడగాలి. ఒకరు శ్రీపాద కృష్ణమూర్తిగారు, పూర్వకవుల ఆఖరుకాపు. తర్వాత రాయప్రోలు సుబ్బారావుగారు. నవ్య కవుల ప్రథమ సంతానం. ఆ తర్వాత శ్రీశ్రీ నవ్యకవిత్వంలో వంకరకొమ్మ. ఆ తర్వాత గోపీ చందు, ఎక్కడా విత్తుకు పుట్టని ఆర్చిడ్ కవిత్వం. ఆ తర్వాత విద్వాన్ విశ్వం, అభ్యుదయ పరంపరాభివృద్ధిరస్తే కవి. ఇంకా అదోరకం వాళ్ళలో చిన్ని చిన్ని చిన్నారి వాళ్ళందరినీ జమకడదాం!

సారా: ఏమిటి పిచ్చి సంభాషణ? ఇది విను. నాకూ మన కంపెనీ మేనేజరుకూ అసలైన స్త్రీ పురుష సంబంధం ఉన్నది.

కోనంగి: (తెల్లబోతూ) అదా రహస్యం? మొన్న రాత్రి సినిమా దగ్గర మనిద్దర్నీ చూచాడు.

సారా: అందుకనే మీ ఉద్యోగం పోయింది. కోన్, నువ్వు కంపెనీలో చేరినప్పటినుంచే నువ్వంటే ఏదో ఆపేక్ష కలిగింది. నీ స్నేహం తప్ప వేరే దురుద్దేశం నాకు అప్పటికీ ఇప్పటికీ లేదు.

కోనంగి: ఆంగ్లో ఇండియన్లు భారతీయులంటే ఎక్కువ చనువు తీసుకోరు. అందుకని నువ్వు నాతో స్నేహంగా ఉండడం నాకూ ఆశ్చర్యము కలుగజేసింది, ఎంతో అనందమూ అయింది.

సారా: ఔను కోన్. మా ఆంగ్లో ఇండియన్లు రెంటికీ చెడిన రేవడివంటివారు. భారతీయులమై భారతీయులం కాము అనుకుంటాము. ఇంగ్లీషు వాళ్ళము అవుతామని ఆశించి ఏనాటికీ వాళ్ళం కాలేము.

కోనంగి: మరి నీకు నేనంటే స్నేహం చెయ్యాలని బుద్ధిఎలా కలిగింది? మొదటి నుంచీ మీవాళ్ళు మన జాతీయోద్యమాల్లో ఏమీ పాలు పుచ్చుకోవడంలేదే?

సారా: మొదటి నుంచీ ఏమీ పాలుపోక పాలు పుచ్చుకోలేదు.