పుట:Konangi by Adavi Bapiraju.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలమీద ఉపన్యాసాలు, అంగన్యాస, కరన్యాస, నాశికన్యాస, లోచనన్యాస పూర్వకంగా కుంభవృష్టి కురిపించేవాడు. వారి సంభాషణాలు ఎక్కువగా సినీమాలమీద విరుచుకుపడేవి. విరుచుకుపడడం అంటే పెళ్ళున విరుచు పడడమే.

కోనంగి: అబ్బ! ఏమిటమ్మా ఆ పిగ్మీలియాను, ఏమిచిత్రమండి!

సారా: ఏమిటయ్యా అందులో ఉండే అందం!

కోనంగి: ఓ వెట్టి అమ్మాయి! ఏమి నంగనాచిలా మాట్లాడుతున్నావే!

సారా: ఏమిటి నా నంగనాచితనం? ఆ అమ్మాయి వేషం వేసినతార, ఇదివరకే అతి తెలివిగల తార! అందుకని ఆ బొమ్మలో నిజమైన భావంలేదు.

కోనంగి: లేకపోతే నిజమైన చేపలబజారు మనిషిని తీసుకవచ్చి, మహారాణిలా తయారు చేయమన్నావా సినీమా కంపెనీవాణ్ణి? దివాలాతీసి ఊరుకుంటాడు.

సారా: ఆ అమ్మాయిని, ఆ ప్రసిద్ద విద్యావేత్త ఆరునెలలలో నాగరిక బాలిక క్రింద తయారుచేస్తానన్నాడా లేదా?

కోనంగి: అవును. నేనయితే ఆరురోజులలో తయారుచేస్తానందును!

సారా: తయారు చేయగలిగి ఉందువా?

కోనంగి: ఓ! నిన్ను మాంచి తెలుగు అమ్మాయిగా తయారుచేసి ఉందును.

సారా: ఎన్నేళ్ళకు?

కోనంగి: పదిహేనేళ్ళకు.

సారా: ఆరురోజు లన్నావే!

కోనంగి: పదిహేనేళ్ళ బంగారు బొమ్మని అని నా ఉద్దేశం.

సారా: పది హేనేళ్ళ బంగారు బొమ్మని, వెండిబొమ్మగానా, వజ్రపు బొమ్మగానా?

కోనంగి: ప్లాటినంబొమ్మగా!

సారా: ఆ పిల్ల నిన్ను మోహించి ఊరుకుంటుంది.

కోనంగి: నేను ఒప్పుకొని ఊరుకుంటాను.

సారా: అయితే నన్ను తయారుచేయి!

కోనంగి: మా భాషలో సారా అంటే మత్తురసం. నిన్ను సారా నల్లా ద్రాక్షసారాగా చేయగలను.

సారా: ఏదీ, చేయి పందెం వేద్దాము!

కోనంగి: ఆమ్మో! సారా తాగేవాళ్ళకి మత్తువచ్చినట్టు, నిన్ను తయారుచేస్తుంటే నేను మత్తువచ్చి పడిపోతే!

సారా: బెర్నార్డుషా ఓడినట్లే!

కోనంగి సారా ఇంట్లో టీ త్రాగి తన నెల్లూరి హెూటలుకు చేరాడు.

ఓ లక్ష్మివారం కాసినోలో మంచి ఆంగ్ల నాట్యచిత్రం వచ్చింది. డాన్ ఆమెచీ, కార్మెన్ మిరాండాలు నటిస్తున్నారు. బుధవారంరోజు సాయంకాలం కోనంగిని తనతో ఆ చిత్రం చూడడనికి రమ్మని సారాకన్య కోరింది. రాత్రి 9-30 గంటల ప్రదర్శనానికి వెడదామంది. జార్జిటౌనులో ఉన్న తనింటికి తొమ్మిదింటికి వస్తే ఇద్దరూ కలిసి కాసినోకు రావడం అని నిర్ణయించు కున్నారు.