పుట:Konangi by Adavi Bapiraju.pdf/39

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కాని ఇంతవరకు మదరాసు వర్తకాన్ని రాజ్యంచేసిన ఆంధ్ర శ్రేష్ఠులు నానాటికి తీసికట్టు నాగంభొ ట్టు అయిపోయారు. మారువాడీలు, గుజరాతీ శ్రేష్టులు, బొంబాయి భోజాలు మదరాసు వర్తకం అంతా గుంజు కొన్నారు. ఆంధ్ర చెట్టియార్లు, బంగారు గొలుసు, వజ్రాల తమ్మంట్లు వేసికొని చిన్నచిన్న కాగితాలకోట్లు, గుడ్డలకోట్లు పెట్టుకుంటున్నారు.

కాఫీ హెూటళ్ళలో కూడా అరవయ్యర్ల ప్రభావం తగ్గిపోయింది. ఉడిపివారి సామ్రాజ్యాలు స్థాపితమైపోయాయి. తమలపాకుల దుకాణాలలోంచి పిళ్ళలు, మొదలియార్లు మాయమై, మలబారు నాయర్లు నిండిపోయారు. పండులా ఉంటారు, మెండుగా స్నానం చేస్తారు, దండిగా విభూతిపెట్టారు, నిండా అందంగా ఉంటారు వారూ వారి ఆడవారూ.

ఇవన్నీ మా కోనంగి చూస్తూ మదరాసు ఎన్ప్లనేడు తిరుగుతున్నాడు. అతని అనందం పోదు, ఆశ వదలదు, హాసం మాయమవదు. ఇన్ని చదరపు మైళ్ళ మదరాసులో తనకు ఉద్యోగమే దొరకదా? పోతే వైటువే కంపెనీ ఉద్యోగం పోయిందిగాక. ఆ పోవడమూ ఊరికేపోయిందా? కోనంగిగారి అతి ఉత్సాహమే అతని ఉద్యోగానికి షష్టాష్టకమైంది. తీన్తేరా అయింది, ఆర్ అఠారా అయింది.

వైట్ వే కంపెనీలో ఉద్యోగంచేసే అందరితోనూ కోనంగిరావు అయిదు రోజులలో స్నేహంచేశాడు. కొందర్ని "హల్లో జార్జి” అంటాడు; “ఏమిటి బ్రదర్' అంటాడు. కొందర్ని “ఎన్నా సమచారం స్నేహిదన్" అని అంటాడు: మరికొందర్ని "వెల్ మైడియర్! ఎలా వుంది వ్యాపారము?” అని ఇంగ్లీషులో పలుకరిస్తాడు ఆంగ్లో ఇండియన్ బాలికల్ని అందులో సారా' అనే ద్రాక్షసారాయవంటి అందమయిన బాలిక ఉంది.

కోనంగిరావు ఆ బాలికతో మంచి సహవాసం చేశాడు. ఈ జాతి ఆశయం ఏమిటి? ఈ బాలికల ఆలోచన లేమిటి? వీరికి స్త్రీ పురుష పరమ ధర్మమైన ఆలోచనలుతప్ప ఇంక ఏమీ ఉండవంటారు. నిజమా? అని తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. స్నేహం విషయంలో కోనంగికి అందరూ ఒకటే. అందరూ ప్రాణ స్నేహితులే. మనస్సులో ఏమన్నా దురుద్దేశాలుంటేనా?

సారా చాలా అందంగా ఉంటుంది. కొంచెం పొడుగరే! ఎత్తుమడమల జోడుతో ఒక అంగుళం తగ్గుగా కోనంగితో సమానంగా ఉంటుంది. కోనంగే సమోన్నతం కలవాడు. అంటే అయిదడుగుల ఏడంగుళాలవాడు. పెద్ద బలమైనవాడు కాదు. కండపుష్టి సామాన్యం. కనుముక్కుతీరు సామాన్యం. కాని అతని ఆనందం అతనికి ఏదో అందం నమకూరుస్తుంది.

ఒక పుట్టెడు వ్యక్తిత్వంకల మనిషి. కొత్తలేదు, నదురు బెదురు లేదు, తొణుకు బెణుకు లేదు.

సారాకు మొదటనుంచి కోనంగి అంటే ఎంతో గౌరవం కలిగింది. అపేక్ష పుట్టింది, గాఢస్నేహం చెయ్యాలనీ వాంఛ ఉద్భవించింది. రోజూ ఇద్దరూ మాట్లాడుకుంటూ పోయేవారు. రెండు మూడుసార్లు సారా కోనంగిని తనింటికి పిలిచింది. కోనంగి మాటలకు పకపక నవ్వేది. కోనంగిని భుజాలు పట్టి కదిపివేస్తూ నవ్వేది.

ఎవ్వరితోనూ ఎప్పుడూ మాట్లాడదు. తనమీద తనకు గౌరవమూ, ఒక విధమైన బిడియమూ సారాను ప్రత్యేక భౌతికను ఒనరించాయి. అలాంటి ఆ బాలిక కోనంగి. అంటే ఒక్కసారిగా పుష్పంలా విరిసిపోయింది, అతనితో కంపెనీ పరిసరాలలో ముభావంగా ఉన్నా, అది దాటిన వెంటనే, చెల్లెలుకన్న ఎక్కువగా చనువు చూపించసాగింది. కోనంగి