పుట:Konangi by Adavi Bapiraju.pdf/38

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

యింతలో వడ్డనవాడు వచ్చి భోజనానికి రావచ్చునని చెప్పాడు.

జయలక్ష్మి చిన్ననాటినుంచీ మాంసాహారం ఎరగదు. అన్నం ప్రారంభించినప్పటి నుంచీ తండ్రి అయిన అయ్యంగారు శాకాహారమే అలవాటు చేశాడు. తర్వాత జమీందారుని చెట్టబట్టి నప్పుడూ జయలక్ష్మి మాంసాహారం ఎరగదు. ఇంక రంగయ్యంగారికి భార్య అయిన వెనక అచ్చంగా అయ్యంగారి స్త్రీలా తయారయి ఊరుకుంది. అనంతలక్ష్మి తల్లివలెనే శుద్ద అయ్యంగారి బాలిక, కాని ఎవరి ఇంట్లోనన్నా భోజనం చేస్తుంది.

చెట్టియారుగారు స్నానాల గదిలోనికి పోయి చేయి కడుక్కొని, సబ్బుతో మొగం కడుక్కొని తువాలుపెట్టి తుడుచుకొని, భోజనాల హాలులోనికి పోయాడు.

అక్కడ పీటా, దానిముందు వెండికంచమూ పెట్టివున్నది.

ఒక్కకంచమూ దాని చుట్టూ నాలుగు వెండి ఆకులూ మూడు వెండిగిన్నెలూ ఉన్నాయి. అన్నింటిలోనూ కూరగాయలు, గిన్నెలలో సాంబారు, మోరుకుళంబు, రసం వున్నాయి.

“ఒక్కకంచమే ఉన్నదే రెండవ కంచమేది?” అని చెట్టియారుగారడిగారు.

“ఎవరికి రెండవ కంచం?”

“మీ అమ్మాయి, అనంతలక్ష్మికి?”

“అనంతలక్ష్మి భోజనం ఇక్కడకాదు.”

“ఎక్కడ?”

“జడ్జిగారింట్లో”

“కారుమీద తిరిగి ఇంటికి వచ్చిందే!”

“అబ్బే, తానక్కడ భోజనం చేస్తున్నాననీ, కారు తిరిగి పంప నక్కరలేదనీ, వాళ్ళ కారుమీదనే వస్తాననీ కబురు పంపుతూ వట్టికారు తిరిగి పంపేసింది.”

“ఏమిటీ!” తల తిరిగినంతపని అయింది చెట్టియారుగారికి.


తృతీయ పథం


సందుగొందులు

'

చెన్నపట్నం సందులు వేనకువేలు. పాత చెన్నపట్నమైన జార్జిటౌనుకు పూర్వం పేరు బ్లాక్ టౌను. ఈ జార్జిటౌనులో ఒక వీధి పొరపాటు నన్నా వెడల్పు ఉండదలచుకోలేదు.

ఆ వీధులలోకల్లా మహా వెడల్పయిన వీధీ 'బ్రాడ్వే' బ్రాడ్ వే అంటే వెడల్పుదారి అని అర్థం. ఇక దాని వెడల్పంటారా పదిగజాలు. అలాంటి వీధిలో మేడమీద మేడ, ఇంటిమీద ఇల్లు, బజారుమీద బజారు, షాపుమీద షాపు, హెూటలుమీద హెూటలు, వెత్తలపాకు కొట్టుమీద కొట్టు, ఎప్పుడూ ఒక కుంభమేళాలా ఉంటుంది.

వీధుల పేర్లన్నీ లక్ష్మీదేవి నాట్యంచేసే పేర్లు. ఒకటి టంకశాలవీధి, ఒకటి ముత్యాలవర్తక వీధి, ఒకటి పగడాల బేరగానివీధి, లింగసెట్టి, తంబు సెట్టి, ఎఱ్ఱు బాలసెట్టి వగైరా సెట్టుల వీధులు. గిడ్డంగివీధి, చీనాబజారు, ఆవల ఒకటే ధనపూర్ణాలైనవి.