పుట:Konangi by Adavi Bapiraju.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేరకుండా ఏవాడ పడుతుంది అని అనుకుంటూ చెట్టియార్ గారు తన కారులో అంత మొగం చేసుకొని, రెండు చెవులవరకు నోరు సాగనవ్వుతూ కారు ఆపి, లోనికివచ్చి “మామియర్! (అత్తా) మామియర్!” అని పిలిచాడు.

జయలక్ష్మి పరుగెత్తుకొని వచ్చింది. “ఓ మరుమగనువా!” (అల్లుడవా) అని అంటూ “మళ్ళీ వచ్చారేమి?” అని ప్రశ్నించింది.

చెట్టి: మామియర్, నాకు చాలా పెద్దపని! ఆ పని మనకు, మీకూ నిండా మంచిది. అదిదా నెగ్గుతానో, నెగ్గనో అని భయందా పడితిని మామియర్! మీ అదురుట్టం నా అదురుట్టం పండిందిదా! అది అయింది. ఆ విషయం మీతోదా సెప్పాలి అని వచ్చాను.

జయ: సంతోషం! చెప్పు.

చెట్టి: ఇప్పుడు ఇంటికిపోను: మీ దగ్గిరదా భోజనం.

జయ: అంతకన్న సంతోషం ఎన్న?

జయలక్ష్మి త్వరత్వరగా లోనికిపోయి భోజనం ఏర్పాటులన్నీ చేస్తూంది. చెట్టియారు పిల్లిఅడుగులువేస్తూ అనంతలక్ష్మి గదులలోనికిపోయి చూచాడు. ఆమె అక్కడలేదు. సరే! తల్లిగదులలో ఉండవచ్చును అనుకున్నాడు.

జయలక్ష్మి వంటవారిచేత అన్ని ఏర్పాట్లు చేసి వచ్చి చెట్టియారుగారి దగ్గర కూచుంది.

చెట్టి: మామియర్, యుద్ధంసాగుతోంది. ప్రభుత్వానికి మనం సహాయము చేయాలి.

జయ: ప్రభుత్వానికి మనం ఎందుకు? ప్రభుత్వంకన్న భాగ్యవంతులయినవారు ఎవరు?

చెట్టి: ప్రభుత్వం అంటే మనమేగా?

జయ: ఏమి మరుమగన్?, అట్లదా మాట్లాడుదువు? మనం ప్రభుత్వం ఎట్లు అవుదుము?

చెట్టి: మన మంత్రులుకదా రాజ్యం చేస్తున్నది?

జయ: అయితే రాజ్యం చేయించేది తెల్లవాండ్లు కాదా?

చెట్టి: అబ్బేబ్బె! ఏమిమాటదా సెపుతావు? అది ఇరవైఏండ్లమాట. మన జస్టిసుపార్టీవారు వచ్చిందే, అప్పుడుదా పెజలే రాజ్యం.

జయ: మరుమగన్! మీరు అన్నీ గమ్మత్తుగా అందురు. ఎందరు మంత్రులు వచ్చినా రాజ్యం తెల్లవాండ్లదిదా! జస్టిస్ పార్టీవారు, ఉద్యోగాల పార్టీవారు. బ్రాహ్మణ ద్వేషం మీదదా బతికారు. ఇంతలో కాంగ్రెసు వచ్చింది. ఏమయిపోయినారు జస్టిస్! వీరేం హైకోర్టు జస్టిసా!

చెట్టి: కాదు మామియర్! బామ్మలు తమ రాజ్యందా స్థాపించిరి. మనందరం వాండ్లకు బుద్ది చెప్పినాము.

జయ: నేను బ్రాహ్మణ స్త్రీని, అయ్యంగారి అమ్మాయిని, అయ్యంగారి భార్యను.

చెట్టి: ఆమ! ఆమ! ఆయినా లా ప్రకారం మీరుదా నాన్ బామ్మలు!

జయ: లావో, గీవో? అయితే కాంగ్రెసువాండ్లు ఎవరు?

చెట్టి: వాండ్లు బామ్మలు!

జయ: పటేల్, రాజేంద్రబాబు, సుభాష్, ఆజాద్, గపూర్ ఖాన్, అసలు కాంగ్రెసుకు మహా నాయకుడు గాంధీజీ బ్రాహ్మణులుకాదే?

చెట్టి: వాండ్లంతా బామ్మల బానిసలు.

జయ: అయితే కాంగ్రెసు ఎందుకు నెగ్గింది? జస్టిస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయిందిదా?