పుట:Konangi by Adavi Bapiraju.pdf/33

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


“లేదే!”

“రేపు అందుతుందో, మీరు ఇంటికి వెళ్ళగానే అందుతుందో!”

“కృతజ్ఞుణ్ణి”

“ఈ ఉద్యోగం మీకు ఇష్టమేనా?”

“నాకా, ఈ ఉద్యోగమా? ఏ ఉద్యోగమైనా నాకు ఇష్టమే!”

“ప్రయివేటు చెప్పుతామన్నారు? నాకు తెలుగు చెప్పాలండి.”

“తెలుగా? ఓ! తెలుగులో నేను రాయప్రోలు సుబ్బారావుగారి అంతవాణ్ణి.”

“అందుకనే మిమ్ముల్ని కోరుతూ వుంటా! నెలకు ఏభై రూపాయలిస్తాము. ఆ సంగతే కార్డులో రాశాను.”

“సాయంకాలం రావచ్చునా?”

“సాయంకాలంకన్న రాత్రి మంచిది.”

“రాత్రిళ్ళు నాకు బస్సు అందదు. అదీ భయం.”

“నా కారు వుందిగా?”

“సరేలెండి.”

“కృతజ్ఞురాలిని.”

5

అనంతలక్ష్మి ఇంటికి ఆ మరునాడు ఉదయం తొమ్మిది గంటలకు ఒక పెద్దకారు వచ్చింది. ఆ కారు రూపంలోనూ పెద్ద, గుణంలోనూ పెద్ద! దాని పేరు “రోలురాయిస్” ఇంగ్లీషులో ఆ కారుమీద పచ్చయప్ప కళాశాల, ఆంధ్ర విద్యార్థి ఒకడు అందమైన పాట చేశాడు.

“విత్ దౌ నాయిస్

ఇట్ రోల్స్

ఎమాంగ్ హెూల్స్

అండ్ షోల్స్

ది రోల్స్ రాయిస్”

ఈ పాట ముఖ్యంగా ఉపయోగింపబడింది ఈ రోలురాయిస్ని గూర్చే. ఈ రోలురాయిస్ కారు శివసంబంధ సుబరీమన్న గణేశమీనాచ్చి చెట్టియారుగారిది. బాగా అర్థం చేసుకునేందుకు ఎస్. ఎస్. ఎస్.జి. మీనాచ్చి చెట్టియార్ అంటారు.

ఆ చెట్టియార్ కు సినిమా కంపెనీలంటే మహాఇష్టం: సినిమా చిత్రాలంటే అంత ఇష్టంలేదు. అసలు సినిమా చిత్రం చూచి ఆనంద కందళిత స్పందిత మందహాస, అరవింద, తుందిల, బృందారక సుందోపసుందుడవుదా మనికాదు.

అసలు సెట్టియారుగారు ఆశయవాది. స్వప్నానందవాది: ఎస్కేప్టిస్టుకాదు. అసలయిన సిసలయిన నిఖార్సయిన, ప్రత్యక్షవాది, వాస్తవికవాది. “చూచి తెలుసుకో రుచి చూచి తెలుసుకో” అంతేగాని, ఏదో మాయలు, మర్మాలు, ఛాయలు అతనికి పనికిరావు. అతడు సినిమాకు వెళ్ళితే ఏదో అర్థం మాత్రం లేకుండా వెళ్ళడు. వట్టి భావకవిత్వ హృదయం కాదాయనిది: అహంభావవాస్తవికతా హృదయం.