పుట:Konangi by Adavi Bapiraju.pdf/32

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కలిగిన పాతవారెవ్వరూ సరుకును విడుదల చేయలేదనీ అంత చక్కగా పని చేసినందుకు పదిరూపాయ లావారానికి బహుమతి ఇస్తున్నానని ఇరవై నాలుగురూపాయలూ అతనిచేతిలో పెట్టాడు.

కోనంగి నవ్వుకుంటూ వెళ్ళినాడు. నల్లతంబిలో గదిలో చక్కగా అలంకరించు కొన్నాడు. తన కంపెనీలో మూడు షర్టులు రెండు టైలు ఒక కోటు కొనుక్కున్నాడు.

రొండోవారం కోనంగి విజృంభించాడు. అతడు ముఖ్య అమ్మకందారు అయినాడు. ఆడవారూ అతని మాటలకు మురుస్తూ అతని మూలాన ఇంకో పదివస్తువులు కొనుక్కు పోసాగారు. టైలు నాలుగు వందల అయిదు అమ్మివేశాడు. జేబురుమాళ్లు పెట్టెలు పెట్టెలే!

“జేబురుమాలాలేని జేబు చిలుకలేని పంజరము వంటిది. ఇల్లాలులేని గృహం వంటిది. కిల్లీ దుకాణంలేని వీధివంటిది.”

“పాదాలు, ఎనిమిదిరకాలు. పెద్దమడమలు, వెడల్పు పంజాలు, పొడుగువేళ్ళు, ఎత్తుమడాలు, వంకరపాదాలు, లావువేళ్ళు, పెద్దపాదాలు, చిన్నపాదాలు. ఒక్కొక్క పాదానికి ఒక్కొక్కరకంజోడు అందం. ఈడూజోడూ అనే మాటకు అసలయిన అర్థం ఈడుకు తగిన కాలిజోడు ఉండాలని! ప్రేమని కాపాడగలవి, కాలిజోళ్ళండి. ప్రియురాలు పక్కను నడుస్తుంటే, సరియైన కాలిజోడు లేకపోతే, ప్రియునిజోళ్ళు ప్రియురాలి పాదాలను నలక్కొడతాయి.”

ఈలాంటి సంభాషణలు వేయిపేజీల గ్రంథం అవుతుంది.

మేనేజరు కోనంగిని వారాని కోకొత్తశాఖకు అమ్మే మనుష్యునిగా ఏర్పాటు చేసేవాడు. ఇదివరదాకా, మందకొడిగాసాగే అమ్మకం ఇప్పుడు తుపానులా సాగింది. మూడువారాలు కోనంగి విజృంభణముందు హిట్లరు విజృంభణ చీమగంగాయాత్ర అయింది. వారానికి ముఫ్పై అయిదు చేశాడు.

“వచ్చేది వర్షాకాలం, దాచుకోవయ్యా కాస్తధనం” అన్న మూలసూత్రం కోనంగి మరచిపోయాడు.

కొత్తతోలు పెట్టి కొనుక్కున్నాడు. నాలుగు తువాళ్ళు, అరడజను బనీనులు, అన్నీ తన కంపెనీలో కొనుక్కున్నాడు.

ఒక శనివారం ఏవేవో కొనుక్కుందామని అనంతలక్ష్మి కంపెనీ లోనికి వచ్చింది. ఎదురుగుండా కోనంగి అమ్ముతున్నాడు. అనంతలక్ష్మి ఒక్కనిమిషం నమ్మలేకపోయింది. కోనంగి అనంతలక్ష్మిని చూచాడు. అతని మోము జేవురించింది. గుండెకాయ మూడు “లబ్' లు నాలుగు ‘డబ్' లు కొట్టడం తప్పి చక్కాపోయింది.

ఇంత గాలిపీల్చీ, ఛాతీ కొంచెం ముందుకు పోనిచ్చి తీయగా మాట్లాడుతూ తన అమ్మకం సాగించాడు కోనంగి.

అనంతలక్ష్మికి గుండె ఒకసారి ఆగిపోయింది ఒకసారి విమానంలా అల్లరిచేసింది. ఎల్లాగో కోనంగి దగ్గరకు నడిచివెళ్ళి అనంతలక్ష్మి “ఏమండీ, కోనంగిరావుగారూ!” అంది.

“అనంతలక్ష్మిగారూ! ఏంకావాలి మీకు? మంచి స్నోలు, ముఖంపవుడర్లు, చక్కని జేబురుమాళ్ళు, పిన్నులు, కాలిమేజోళ్ళు, ఆడవారి కాలిజోళ్ళు అన్నీ వున్నాయి. రండి! అలా తెల్లబోతారేమి? నేనిక్కడ అమ్మకందార్లలో ఒకణ్ణి!”

“మీకు కార్డు ఒకటి రాశాను అందలేదా?”