పుట:Konangi by Adavi Bapiraju.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంక మా కోనంగి తమాషా చూడండి! ఎవరో ఒక పెద్దమనిషి జేబులో పది రూపాయలున్నవాడు వచ్చాడు. టై ఒక్కటి మాత్రం కొనుక్కుందామని ఆయన ఉద్దేశం. అక్కడే ఉన్నాడు కోనంగి.

కోనంగి: దయచేయండి. తమకు...?

పెద్దమనిషి: టైలు కావాలండి.

కోనం: ఇవి పట్టువి: ఈ నారవి చూచారూ! నూలువి తమకు కావాలా? పట్టువి మడతన్నా పడనివి. ఏవీ రంగుపోవు కాని, ఆ రంగు అందంగా కనబడాలంటే సిల్కుమీదే వెయ్యాలండి.

పెద్దమనిషి: సరేలేవయ్యా, నా కామాత్రం తెలుసులే.

కోనం: చిత్తం! ఎరుపురంగు టై శ్యామలవర్ణానికి బాగుంటుంది. నల్లవానికి నారింజరంగు, మీబోటి పసిమిపచ్చని వారికి తెల్లరంగు, ఎత్తయినవానికి నీలంరంగు, మొదలైన ఏ రంగు అయినా అందంగా ఉంటాయి.

పెద్ద: నాకు ఏ రంగు బాగా ఉంటుందో అలాంటి టై ఒకటి ఇవ్వండి.

కోనం: చిత్తం పైగా కోటునుబట్టి కూడా రంగుతేడాలు, పూవుల తేడాలు ఉండాలండి. తమకు ఏఏ రంగుల కోటులున్నాయి?

పెద్ద: ఎనిమిది ఉన్నాయి. రెండు తెల్లవి. రెండు నల్లవి. తక్కిన వానిలో చాక్లెట్ ఒకటి, కాఫీరంగు ఒకటి, నీలం ఒకటి, ఎరుపు బూడిద రంగు..

కోనం: కోటుకొకరకం టై ఉండాలండి. ఆ రకంలోనే రెండు మూడు వివిధమైన పూవులు మొదలయినవానితో నిండివుండడం మరీ బాగా వుంటుంది. మీ యీ కోటుకు ఈ రెండు టైలూ చాలా అందంగా ఉంటాయి.

పెద్ద: టై ఖరీదు?

కోనం: మూడు రూపాయలకు మించవు, ముప్పావులాకు తక్కువ లేవు.

పెద్ద: నేను జెప్పిన కోట్లకీ, నాకూ సరిపోయే టైలు పదిరూపాయలవి ఏరి ఇవ్వండి.

ఆ పెద్దమనిషి పదిరూపాయలు బల్లమీద పెట్టాడు. కోనంగి ఎనిమిది టైలు పొట్లంకట్టి బిల్లుతో యిచ్చాడు.

నవ్వుకొనే హృదయం గలవారిని కోనంగి ఇంకా నవ్విస్తాడు. పొగడ్తల కుబ్బే మనిషిని, తియ్యగా పొగిడి కొనిపిస్తాడు.

“మీకు వానకోట్లు కావాలన్నారు. వానకోటు మనకు ఉపయోగంగానూ ఉండాలి, అందంగానూ ఉండాలి. ఏవంటారు? ఉపయోగంలో సౌందర్యం రంగరిస్తే, వచ్చే ఆనందం వర్ణనాతీతం.”

“అయ్యా! కాలిజోళ్ళా? చిత్తం. ఈలా దయచేయండి. ఆ కుర్చీపైన... నల్లరంగు బ్రౌన్ రంగులలో, మీకు ఈబ్రౌన్ అందం: మీ చక్కని పొడుక్కు ఈ కాలేజీ వైఖరి అందం ఇంతా అంతా కాదండి: ఎంతచక్కగా సరిపోయిందో! ఈ జోడుకు సరిపోయిన చక్కని మేజోళ్ళున్నాయి: ఇవి మళ్ళీ రావండి, యుద్ధం. ఈ అందం మనదేశంలో నేతకువస్తుందా? వచ్చినా ఉన్న మేజోళ్ళ పరిశ్రమగారాలన్నీ ప్రభుత్వం గుత్తకు తీసుకుంటుంది. రెండుజతలా? మీ తాహతకు నాలుగుజత లుండవద్దూ! చెప్పండి.”

మాయా మంత్రాలు చేశాడు. కమ్మని మాటలు చెప్పాడు. ఆ వారం అతని రోజూ అమ్మకం సగటున రెండువందలయాభై తేలింది.

మేనేజరు తన గదిలోకి కోనంగిని పిలిచి ఇంత విచిత్రంగా, మంచి అనుభవం