పుట:Konangi by Adavi Bapiraju.pdf/30

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కాని, పోలండూవారికీ ప్రాణంపోకడ అయిపోయింది. ఒకరోజు రెండు రోజులలో పోలండు నాలుగోవంతు అయింది. వేలటాంకులు జగన్నాథ రథాలకన్నా మహావేగంతో అడ్డంలేని బరువుతో భయంకర శబ్దాలతో పోలండు బాలబాలిక, స్త్రీపురుష వృద్ధులనూ ఎదిరించే మగటిమిగలవారినీ, నాశనంచేస్తూ వెళ్ళిపోయాయి. అకాశంలో రాబందులు గద్దలులా వేలకొలది విమానాలు గుండెలవియజేస్తూ, దేశం నేలమట్టంచేసే ప్రళయవర్షం కురిపిస్తూ ముందుకు సాగిపోయినాయి.

ఇంతట్లో అటునుంచి రష్యావాళ్ళు వచ్చి సగం పోలండు అక్రమించారు. పోలండు లేదు. పలకమీద చిన్న బాలుడు పటంవేసి చెరిపేసినట్టు మాయమైపోయింది.

అనంత ధ్వనిలో ఒకదేశ ప్రజల హాహాకారాలు, అనంత రక్తిమలో మనుష్యరక్తమూ కలిసిపోయింది.

అంతులేని కాంక్ష, రాక్షసత్వమూ, రక్తం చూచిన పెద్దపులుల రక్తభౌజన తృష్ణా, భుగభుగమండే విజయగర్వమూ హిట్లరును భయంకర మూర్తిత్వంలో కలిసి యూరపు ఆవరించుకోవడం సాగించింది.

కాని కోనంగికేమి ఉద్యోగం ఉంది. యుద్ధం ఏలాంటి పరిణామం పొందుతుందో తెలియని కోనంగి కెలా ఉద్యోగం ఇస్తారు.

అటు తెలుగుదేశమూ ఇటు తమిళదేశమూ ప్రవాహాలై వచ్చి ఫెళ్ళున చెన్న పట్టణములో తారసిల్లాయి. తెలుగు ప్రవాహం ఉత్తరం బరంపురం నుండి ప్రవహించాలి. అది వచ్చివచ్చి చెన్నపట్నంచేరే కాలానికి వంద ఏళ్ళకుముందే అరవయ్యర్లూ అయ్యంగార్లూ తండాలుగావచ్చి ఉద్యోగం కోటలు పట్టుకు కూర్చున్నారు.

వాళ్ళవి ఇంజనీరింగు, పోలీసు, హైకోర్టు, ఎం. ఎస్. ఎం. రైల్వే, వైద్య విద్యా వగైరా. తీరా 1939లో కోనంగి మదరాసువస్తే ఈయనకోసం ఉద్యోగాలు సిద్ధంగా ఉంటాయా!

కాంగ్రెసు ప్రభుత్వం వచ్చింది: బాగానే పనిచేస్తూ వుండెను. అయినా ప్రధానామాత్యుడు అయ్యంగారే ఆయెను. ఉన్న కొద్దిరోజుల్లో తమజాతిని బాగుచెయ్యడం తెలుగు మంత్రులకు చేత అయితేనా?

తీరా రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయే రోజుల్లో కోనంగి మదరాసు వచ్చాడు.

కొంచెం కంటిరెప్పలు రెపరెపలాడించేవేళకు కాంగ్రెసు మంత్రి వర్గాలన్నీ రాజీనామాలు ఇచ్చి కూర్చున్నాయి.

4

కోనంగి తీరగ్గా తిరగ్గా వైట్ వే లెయిడ్లా కంపెనీ “అమ్మకం మనిషి” ఉద్యోగం ఇచ్చారు. ఆ కంపెనీకి ఆంగ్ల మేనేజరు. రోజుకు రెండు రూపాయల జీతం. జీతం వారం కాగానే ఇవ్వటం. సరుకు విడుదలచేయడం ప్రధానం.

వైట్ వే లెయిడ్లా మద్రాసు శాఖ మూసివేయడానికి నిశ్చయించింది కంపెనీ, అందుకని సరుకులకు ఖరీదులు తగ్గించారు.

మేనేజరు అమ్మే స్త్రీ పురుషులతో “ఒక వస్తువు కొనడానికి వచ్చినవానిచేత పదివస్తువులు కొనిపించాలి. ఊరికే చూడడానికి వస్తే ఏభై వస్తువులు కొనిపించాలి” అని బోధించాడు.