పుట:Konangi by Adavi Bapiraju.pdf/29

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అనం: ఏమిటి పిళ్ళా?

పిళ్ళ: ఈ అయ్యరుకు మీకు పాఠాలు చెప్పేవారు కావాలని ఎవరో చెప్పారుట. అందుకని దరఖాస్తు పెట్టడానికి వచ్చారట.

అనంత: లోపలికి తీసుకురా, మా అమ్మగారితో మాట్లాడవచ్చును.

పిళ్ళ: మీ అమ్మగారితో మాట్లాడటమయిందండి.

అనంత: ఏమన్నారు?

పిళ్ళ: ఖాళీలేమీ లేవన్నారు. ఇంక ముందు కూడా ఖాళీలు రావన్నా రటండి.

అనంత: నీ కెల్లా తెలుసు?

పిళ్ళ: అయనే చెప్పాడమ్మా.

అనంత: అల్లాగా?

పిళ్ళ: నేనడిగితే చెప్పారు.

అనంత: నువ్వెందుకు అడిగావు?

పిళ్ళ: మళ్లీ వస్తే రానివ్వడమో, రానివ్వకపోవడమే తెలియవద్దా అమ్మా?

అనంత: అల్లాగా?

పిళ్ళ: నేను మిమ్ములను కూడా కనుక్కోడం మంచిదని చెప్పు తున్నానండి.

అనంత: వారి ఆడ్రసు తీసుకో. ఏఏ పరీక్షలు ప్యాసయినది వగైరా తబ్సీళ్ళు తీసుకో, కార్డు వ్రాస్తాను అవసరమైతే.

అనంతలక్షి బర్రున కారు నడిపించుకు వెళ్ళిపోయింది.

కోనంగి నిట్టూర్పు విడిచి తలవాల్చాడు.

ఇంతవరకూ అరవంలో సంభాషణ జరిగింది అనంతలక్ష్మికి వినాయగానికీ. ఇప్పుడు వినాయగం కోనంగిని చూచి, తెలుగులో మాట్లాడుతూ 'స్వామీ' మీ నివాసం అడ్రసు ఇవ్వండి. ఏమీ' అని అన్నాడు.

సరేనని ఒక చిన్న కాగితంమీద తన అడ్రసు కోనంగేశ్వరరావు నెల్లూరు ఆంధ్రాహెూటల్, నల్లతంబి, ట్రిప్లికేను అని వారికి వ్రాసియిచ్చి తాను చక్కాపోయినాడు.

తాను వచ్చిన పని విజయవంతంగానే జరిగినది. ఎందుకంటారా, తానా బాలికను పగలు చూడాలని బుద్ధిపుట్టికదా తానీ వంకను వచ్చింది. దిట్టమయిన రౌడీలా ఉన్న ఆ గేటుకీపరు తన్నెంతో మర్యాదచేసి అన్ని విషయాలు మాట్లాడాడు. తనంటే ఆ పిట్టపిడుక్కీ అంత మంచి భావం కలగడానికి కారణం ఏమిటి?

తన్ను లోపలికి తీసుకుపోయి వరండాలో కుర్చీలో కూర్చోబెట్టి లోపలికివెళ్ళి మాట్లాడి వచ్చాడు. తానా బాలికా, తల్లి ఏ సినిమాస్టారులో అని కదా ఈ రోజున తబ్సీళ్ళు కనుక్కుందామని వచ్చింది?

వాళ్ళకూ సినిమాకూ సంబంధమేమీలేదు. తన ఉద్దేశంలో ఏమీ చెడు భావాలులేవు. అందుకు ట్రిప్లికేను ప్రార్థసారథి సాక్షి. మైలాపూరు కపిలేశ్వరుడు సాక్షి, మింటువీధి కందస్వామి సాక్షి.

వాళ్ళు అయ్యంగారు లంటారు. అయ్యంగారులంత వాళ్ళంటాడు, వినాయగం పిళ్ళే! జమీందారులంతటివాళ్ళట! ఇక చాలు తన ఈ చిన్నసాహసకార్యం.

యుద్ధం ప్రారంభమైంది. ఇంగ్లీషువారూ ఫ్రెంచివారూ ఏదో వేళా కోళంగా యుద్ధం చేస్తున్నారు జర్మనీవారితో.