పుట:Konangi by Adavi Bapiraju.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనంతం వదిన ఆరోగ్యంగా వుంది. మరేమీ కంగారులు రాలేదు. మొదటి పురుడయినా ఎంత సులభంగా నీళ్ళాడింది! మొదటిరోజునే లేచి కూర్చుంది. బిడ్డను అందించాము. తన బిడ్డను తాను ఎత్తుకొనడానికి సిగ్గు పడింది. పక్కలో పడుకోబెట్టాము. అలా ఇద్దరూ పడుకొంటే ఎంత అందంగా ఉంది ఆ దృశ్యం!

“అన్నా! మామూలు దక్షిణాది వారివిగాని, మనవిగాని పిచ్చి ఆచారాలు ఏమీలేకుండా డాక్టరు రెడ్డిగారు పురుడుపోశారు. రెడ్డి అన్నగారే మొదటి నుంచి ఎంత జాగ్రత్తగా ఉన్నారనుకున్నావు!

“ఇంక చౌధు తానే నర్సయింది. నర్సింగు పనిని కాబోయే భర్త దగ్గరే నేర్చుకుంటున్నది.

“ఇంక చౌధురాణీగారి విషయం! రెడ్డి, రాణీ ఇద్దరూ మామూలుగా వుండేవారు. ప్రేమికులులా కనబడేవారుకాదు. కాని ఇద్దరూ అతి దగ్గరగా వచ్చేవారు. నువ్వు వచ్చిందాకా పెళ్ళిచేసుకోమని అన్నారని అనంతం వదిన తన ఉత్తరాలలో ఇదివరకే వ్రాసి ఉంటుంది.

“నీ కొడుకు రెడీ అవుతాడులే! అంత పెద్దకళ్ళయినా బుగ్గలు మింగేస్తున్నాయి. ఆ కళ్ళను నా వైపు త్రిప్పి గుప్పిళ్ళు ముడుచుకొని చూస్తూ ఉంటే “మానాన్న ఏడీ?” అని ప్రశ్నించుచున్నట్లుగా కనబడతాడు. కాళ్ళు, చేతులు తెగఎగరవేస్తాడు. సంగీతం కూడా పాడతాడయ్యా!

“చౌధురాణీ వాడిమీద జోలపాటలు వ్రాయాలంటుంది. కమల నయన “ఓయి. కుర్రవాడా నువ్వు త్వరగా వెళ్ళి మీ నాన్నను జైలు నుంచి కొట్టుకు రారా!” అంటుంది. నిద్దల్లో అలా నవ్వుతాడే! ఈ రెండోరోజునే అందరూ క్షేమం. అనంతం నిన్ను మరీమరీ అడగమంది. ఓపిక రాగానే తానే ఉత్తరం వ్రాస్తుందట.

“ఇంక మీ అత్తగారి ఆనందం చెప్పడానికి వీలులేదు. కళ్ళు తన భర్తకళ్ళేనట. తన భర్త పేరుతోనే పిలుస్తున్నది. ‘రంగా' అంటుంది. ఆ పేరు వింది చౌధు. ఈ రాత్రే తానో పాట పాడింది.

రంగరంగా కావేటి రంగరంగా

కస్తూరి రంగరంగా

ఏలోకమున నుంటివీ నా తండ్రి

ఈ లోక మెట్లున్నదీ ఓ తండ్రి

నీ లీలలను చూపరా-చిన్నయ్య

మాలోన ఒకటవ్వరా!'

అన్నది. అందరికీ ఎంత ఆనందమయినదనుకున్నావు?”-మీ చెల్లి సరోజ.

ఈ ఉత్తరం చూచుకొన్నాడు, తన బాలుని రూపం ఊహించుకొన్నాడు. తన భార్య అనంతం బాలుణ్ణి అందిస్తూ ఉంటే తాను చూడడం కలలు కన్నాడు. తాను కుమారుని ఎత్తుకొని ఆడించడం ఊహించుకొన్నాడు.

ఆ చిట్టితండ్రి తన్ను 'నానా!' అని పిలుస్తాడా, 'బాబా!' అని అంటాడా, 'అప్పా!' అని సంబోధిస్తాడా? 'డాడీ' అంటాడా? ఏమని పిలుస్తే బాగుంటుంది?

ఎప్పుడు తనకీ జైలు నుండి విముక్తి?