పుట:Konangi by Adavi Bapiraju.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మా అనంతలక్ష్మి ఆ దినాన నోట్సు తీసుకోదు. ఇరుప్రక్కలనే వసించిన స్నేహితురాండ్రిద్దరూ ఏమిచెప్తున్నా వినిపించుకోలేదు.

మొదటి స్నేహితురాలు: లక్ష్మి! ఎక్కడే ఉంటా నీ మనసూ?

రెండవ స్నేహితురాలు: దారిలో నాగయ్యను, అశోకకుమార్, పృథ్వీరాజుని....

మొదటి: సురేంద్రునీ, మోతీలాలుని....

రెండవ: నజ్మలని....

మొదటి: జాన్స్టూఆర్టుని....

రెండవ: ఫ్రెడ్ మాక్ ముర్రేని...

మూడవ: క్లార్క్ బిల్....

అనంత: (తల యిరువురివైపూ చెరి ఒకమాటు తిప్పుతూ) నీ తలకాయని, నీ బుజ్జికాయనీ, నీ కళ్ళనీ, నీ పళ్ళనీ, నీ చెవినీ, నీ ముక్కునీ, నీ మెడనూ, నీ నుదురినీ, నీ తెలివినీ, నీ తేటనీ చూచి...

మొదటి: మోహించావు....

రెండవ: మూర్చపోయావు....

ఆచార్యాణి: ...ష్! ష్! నిశ్శబ్దము! అనంతలక్ష్మిదేవి! ఏమిటా గుసగుసలు?

అనంత: మూ, మూ, మూర్చపోయింది..

ఆచార్యాణి: (గడబిడగా కుర్చీనుండి లేచి) ఎవరు? ఎవరు?

అనంత: ఎవరూ మూర్చపోలేదండి. ఎవరో మూర్చపోయారని మా స్నేహితురాలు అన్నది.

ఆచా: అసలా మాటలెందుకు రావాలి?

అనంత: దిగాలుగా ఉంటే ఏమిటని క్లాసులోకి వస్తూ అడిగాను. దానికి అప్పుడే జవాబు చెప్పింది. అంచేత ధైర్యంగా ఉండు అని చెప్పినోట్సు తీసుకొంటున్నాను.

ఆచా: సరే, కూర్చో.

3

అనంతలక్ష్మి ఆటలు ఆడుటకు వెళ్ళింది సాయంకాలం. బాట్లింటనూ, బంతిఆటా, టెన్నిస్తూ, వాలీబాల్, రింగుటెన్నిసూ అన్నీ ఆడుతుంది. కాలేజీ విద్యార్థినుల నాటకాలలో ముఖ్యపాత్ర వహిస్తుంది. అటు తమిళ సారస్వత సంఘంలో ముఖ్యురాలు. ఇటు ఆంధ్ర సారస్వతసంఘంలోనూ ముఖ్యపాత్ర. ఇంటరులో 'బి' గ్రూపులో తెలుగు పుచ్చుకుంది. 'సి' గ్రూపులో తమిళం పుచ్చుకుంది.

అనంతలక్ష్మిలో తమిళాంధ్ర సంస్కారాలు ప్రయోగమయ్యాయి. ఈ ప్రయాగ దేవీప్రయాగ.

అనంతలక్ష్మి తళుక్కుమంటూ తన కారుమీద ఇంటికి చక్కా వచ్చింది. ఆమె అలావస్తూ ఉంటే గేటుదగ్గిర నిన్నటి అబ్బాయే తన ద్వారరక్షకుడు వినాయగంపిళ్ళేతో మాట్లాడుతున్నాడు.

అనంతలక్ష్మి కారు ఆపుచేసింది. ఆమె హృదయం టెన్నిస్ బాటు అయి ఉన్నట్టయితే ఒక్కప్రాయంటు తీయలేకపోయి ఉండును.

కారే గనక ఆపు చేయకపోతే, అనంతలక్ష్మి వెళ్ళి కారు బోల్తా కొట్టించి ఉండును.