పుట:Konangi by Adavi Bapiraju.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3

యుగయుగాలనుండీ మానవులలో తేడాలు. ఆ తేడాలు తీసివేయాలని పెద్దల ప్రయత్నాలు. నీచస్థితిలో ఉన్న మనుష్యులలోనే పైకి పోవాలన్న వాంఛ పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. పంజరంలోని పక్షి రెక్కలు టపటప కొట్టుకున్నా పైకి పోలేనట్లు ఆ నీచమానవులు వృధాగా ఇనుపగోడలు బద్దలుకొట్టుకుందామని చూస్తారు.

ప్రపంచంలో ఏదోమూల అధమస్థితిలో ఉన్న మనుష్య జాతులు ఉండేవారు. ఈనాడు నీగ్రోలు, ఆస్ట్రేలియా, న్యూగినియా, న్యూజిలాండులలో అథమమానవుడు ప్రయత్నించి ఎక్కువగా నాగరికతగల జాతుల విశాలకరాళాలలో బోల్తాలై పడిపోయారు. ఎప్పుడూ ఒకజాతి విజృంభణ వేరొకజాతి నాశనానికే! అన్ని జాతులూ మహాసామరస్యంలో ఎప్పుడయినా పైకి రాలేవా?

ఈ ప్రశ్నవేసుకుంటూ ఆ నవంబరు రాత్రి వాన జోరుగా కురుస్తూండగా రియాసత్ ఆలీ తన ఇంటిముందు ఒక కారు ఆగడం గమనించాడు.

అతడేదో స్వప్నంలో పడిపోయినాడు. కారులు! అందరికీ కారులేవి? అందరికీ కారు లెప్పుడన్నా రాగలవా? జట్కాలే అందరికీ లేవు. ఒక మనుష్యుడు ఇంకొక మనుష్యుని బండి డబ్బుకోసం లాక్కుపోయే రోజులే ఎప్పుడూ ఉంటాయి. ఆ రిక్షాలలో అందరూ ఎక్కరు. ఆ రిక్షాలు అందరూ లాగలేరు. లోకంలో ఎప్పుడూ మనుష్యులను నడుపుకోవాలి. ఒక్కడ్రయివరు కొన్ని వందలమందిని రైలులో నడుపుకొని పోతున్నాడు. ఎడ్లబండయినా మనుష్యుడు తోలవలసిందే!

ఈలా రయిలు మొదలయిన బళ్ళను నడిపే మనుష్యుడు ఏదో మహా స్వప్నాన్ని అల్లుకుంటాడు. ఆ స్వప్నంలో ప్రగతి ఉందని స్వప్న ప్రారంభం జీవితంలోంచి, స్వప్న ప్రాంతం జీవితంలోకి నడక. ఈ స్వప్న రూపమయిన కారును నడిపే డ్రైవరెవడు? ఎవరికి వారే స్వప్న చోదకులయితే మనకు కావలసిన మధుర స్వప్నాలే మనం అల్లుకుంటూ ఉందుము.

వీధిలో కారు భోం థోం అంది. జోరున వానా, భోం థోం థోం అని ఆ కారుహారను అంది.

ఎవరికోసమో ఆ కారు ఎప్పుడూ ఎవరికోసమో బండి వస్తూనే ఉంటుంది. ఎవరూ లేకుండా కారు వెళ్ళిపోయినట్లు జీవితం మనుష్యులు లేకుండా వెళ్ళిపోగలదా? రియాసత్ ఆలీ లేచి నుంచున్నాడు..

ఎదుట రియాసత్గారి భయ్యా నుంచొని, “సర్కార్! మీకోసం ఎవరో పెద్దలు వచ్చి మీ డ్రాయింగురూములో కూర్చున్నారు” అని విన్నవించుకొన్నాడు.

రియాసత్ విసుక్కుంటూ “కూర్చోపెట్టు, వస్తున్నాను” అని ఆజ్ఞ ఇచ్చి మళ్ళీ భంగమయిన స్వప్నాన్ని ఆహ్వానించుకొన్నాడు.

ఏ స్వప్నానికైనా ఆదిదేవత ఉండాలికదా అనుకున్నాడు. తనదేవి తనకు సాక్షాత్కరించిన కోనంగికి స్వప్న మధ్యస్థ ఎవరు ఇంక? అతనికి కలలుంటాయా? తన స్వప్నాధిదేవి ఇక తనకు కాదు. ఎప్పుడూ స్వప్నంలోనే ఉంటుంది. లైలా మజ్నూల గాథే తనగాథానూ, మజ్నూలానిరాశ పొందిన ప్రతి యువక ప్రేమికుడు ఎడారుల వెంట పోవాలి! ఈనాటి ఎడారులే మానవ ప్రయత్నాలా? అని అనుకున్నాడు రియాసత్.