పుట:Konangi by Adavi Bapiraju.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“ఇనస్పెక్టరుగారూ, మీరు నాతో ఈలాంటి విషయాలు మాటాడకూడదు, నేను వినకూడదు.”

ఆ గూఢచారి ఉద్యోగి “ఆలోచించండి, తొందరపడకండి” అని కోనంగికి సలహానిచ్చి వెళ్ళిపోయాడు.

కోనంగి నవ్వుకొన్నాడు. ప్రపంచం అంతా హాస్యంతో నిండివుంది. హిట్లరు, స్టాలిన్ వంటి ప్రపంచనాయకులు ప్రపంచ స్వరూపాన్నే మార్చడానికి ప్రయత్నిస్తారు. ప్రపంచశక్తి ఒక తిమింగలం ఐతే, దాని ముక్కుకు ఒక సన్నదారం కట్టి ఈ నాయకులు ఆ తిమింగలాన్ని నడపడానికి ప్రయత్నం చేస్తారు. తిమింగలము తన దారిని తానే వెడుతూ ఉంటే, తామే నడుపుతున్నామనుకుంటారు. ఒక్కొక్కప్పుడు ఆ దారపు లాగుళ్ళే హృదయానికి నూత్న స్పందనాలు కలగడానికి కారణాలవుతున్నాయి. ఇంతకన్న హాస్యరసం ప్రపంచంలో ఎక్కడుంది? తను నాయకుడనని తనకే తెలియని పిచ్చివాని మాటలు లోకానికి ఒక్కొక్కప్పుడు పరమాద్భుతమయిన దారి చూపిస్తాయి.

కోనంగికి ఏదో కుంగిపోయినట్లయింది. లోకంలో నవ్వుకు తావు ఉందా? లోకం అంతా బాధాపూర్ణ జీవితాలతో నిండి వున్నప్పుడు నవ్వడం ప్రపంచాన్ని అవమానించినట్లా?

ఈ లోకం అంతా ఒక్కసారి ఆనందపడుతుందా? మహాత్మాజీ జన్మదిన మహెూత్సవం ఇరవై కోట్ల భారతీయులకు ఆనందం ఇస్తే, తక్కినవారికి? హిందూదేశంలోనే అనేకులు పళ్ళు కొరుక్కోవచ్చును. లోకం అంతా ఒక్కసారిగా ఎండకాసి, ఉక్కబోసి, ప్రాణుల్ని మలమల మాడ్చి, ఆ వెంట ఒక మంచి రోజున చల్లనిగాలీ, జల్లున వానా, కురిస్తే కూడా అందరూ ఆనందించరు. కాని ప్రపంచ తత్వమే వెలుగునీడలతోనూ, నవ్వు ఏడుపులతోనూ నిండి ఉండే పథకంలో ఉన్నప్పుడు, నవ్వే ఉండాలని మనుష్యుడు వాంఛించి అది లేదని బాధను పొందడం వెర్రితనమే ఔతుంది.

మనుష్యుడు ఒక్కడూ ఉండడానికి భయపడతాడు. అందుకని కారాగారవాసము మనుష్యునికి బాధ ఐంది. కాని పురుషులలో పురుషశక్తి స్త్రీశక్తి ఇవ్వగలిగిన ఉపశమనం కోరుతుంది. ఒకే శ్రుతిలో నడిచే స్త్రీ పురుషులు ఒకరి కొకరు నవ్వూ, వెలుగూ ఔతారు. అపశ్రుతికల కుటుంబం యమలోకం.

తాను యమలోకంలో ఉన్నా అనంతలక్ష్మి ప్రక్కనే వుంటే యమధర్మరాజుపై ఆభిశంసన తీర్మానం పెట్టగలశక్తి సంపాదించే ఉండును.

అనంతలక్ష్మి అనుమానం పటాపంచలైంది. ఆ ఆలోచన రాగానే కోనంగికి తన్మయత్వము, ఆనందావేశము కలిగినవి. అతడు తండ్రి కాబోతున్నాడు. ఇది కాదా సృష్టి? మనుష్యునికి జీవితంలో దొరకని శ్రుతి స్వప్నలోకంలో దర్శనం అవుతుంది అనుకున్నాడు.

అతడు డాక్టరును ఆపేక్షతో తలపోసుకున్నాడు. డాక్టరుకూ చౌధురాణికీ వివాహం అవడం ఎంతచక్కని శ్రుతి! స్టాలిన్ కు నాడియా వంటి భార్య ఆమె! లోకంమీదున్న అతనికోపం చౌధురాణి హస్తపల్లవ కమస్పర్శ వల్ల నశించి ముడుతలు పడిపోయిన అతనిఫాలము స్నిగ్ధమై కాంతివంతమై పోతుంది.

ఏ అనుభవమైనా సన్నిహితమైనవరకూ ఆ అనుభవం అసంభవమని మనుష్యు డనుకుంటాడు. అ అనుభవము గ్రంథాలలో మాత్రం ఉంది అనుకుంటాడు. గ్రంథాలలో లిఖించినవాళ్ళూ, ఆ అనుభవము వాంఛించో, అనుభవించే వ్రాస్తారుగదా!