పుట:Konangi by Adavi Bapiraju.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జయ: నిద్రలేకపోవడమేమిటి? అందుకనే నేను కంగారుపడుతున్నాను. డాక్టరుగారికి కబురుపంపనా?

అనం: నా కేమీ జబ్బులేదు. నిన్నరాత్రి గేటు దగ్గిర కనబడ్డ ఆ అబ్బాయి ఎవరై ఉంటాడు అమ్మా?

జయ: ఎవరైతే మనకెందుకే! ఎవడో ఒక రౌడీ! లేకపోతే అల్లామాట్లాడుతాడా! ఉద్యోగానికి దురఖాస్తు పట్టుకువచ్చాట్ట! ఆడవాళ్ళ ఇల్లు, మనకు ఏమీ సంరక్షణ లేదనుకున్నాడు. మన మన్నారుగుడి వస్తాదులు మన ఆవరణలో వాళ్ళ కుటుంబాలతో కాపురంవున్నారనీ, అ గేటుకాపలా మనిషి ఆందులో ఒకడని ఆ పై త్తకారికి తెలిస్తేనా?

అనం: అమ్మా! ఏమిటా మాటలు? ఆ అబ్బాయి రౌడీ ఆ! నువ్వు అతని మొహం అన్నా చూడలేదు. కాని ఆ అబ్బాయి మొహంలో నిర్వచింపలేని ఉత్తమలక్షణాలు ఎన్నో ఉన్నాయి.

జయ: చాలులే! మన కామధ్య నిన్ను గురించి వచ్చిన ఉత్తరాలు నాకు మధ్యవర్తుల ద్వారా వచ్చిన రాయబారాలు, బెదిరింపులు అన్నీ మరచి పోయావా?

అనం: వాటికీ, ఈ అబ్బాయికీ సంబంధం ఏమిటి అమ్మా? మన వినాయగం పిళ్ళే గేటుదగ్గిర ఉన్నాట్ట, ఆ అబ్బాయి బస్సు ఆగేచోట నిలుచుండి నిలుచుండి నిలువలేక బద్దకించి మన ఇంటి గేటు దగ్గరకు వచ్చి గేటు ఏనుగుతలమీద కూర్చున్నాట్ట. ఎవరో పెద్దమనిషిలా ఉన్నాడని వినాయగంచూచి ఊరుకున్నాట్ట. ఇంతట్లో మనం సినిమానుంచి వచ్చాము.

జయ: నీకెలా తెలిశాయి యివన్నీ?

అనం: పొద్దున్నే తోటలోకి పువ్వులకు వెళ్ళి, వినాయగాన్ని అడిగి తెలుసుకున్నా.

జయ: పెద్దమనిషి అయితే కావచ్చును మనకెందు కా గొడవ?

అనం: ఆ ఆబ్బాయి కలలోకి కూడా వచ్చాడు.

జయ: కలలోకీ వస్తాడు, తలలోకీ వస్తాడు బుద్ది లేకపోతే సరి. త్వరగా నీళ్ళు పోసుకొని, తలదువ్వుకో, భోజనం చెయ్యాలి.

అనంతలక్ష్మి “సరేలే అమ్మా!” అంటూ లోపలికి పరుగెత్తిపోయింది.

స్నానంచేస్తూ, తలదువ్వుకొంటూ, బట్టలు ధరిస్తూ, భోజనం చేస్తూ ఆ కన్నాటుపురం బాలునే తలుచుకొంటూ తనలో తానే చిరునవ్వు నవ్వుకుంటూ, కాలేజీకి కారుమీద బయలుదేరింది.

క్వీన్ మేరీ కళాశాల సముద్రతీరంలో ఉంది. బాలికలు తరగతిలో కూచోడం ఒక యజ్ఞం. ఆచార్యా తరగతిలోకి రావటంతోటే ఘుమఘుమలాడుతూ, జలజల లాడుతూ, కలకలలాడుతూ, బిలబిలమంటూ, పలపలమంటూ బాలికలంతా లేస్తారు.

ఒక బాలిక ఎందుకో “హిహి” అంటుంది. అక్కడినుంచి తక్కిన బాలికలంతా “హీహీ అనీ, హినీ! హినీ హినీ, హిహీహ్! హీహినీ” అని నవ్వుతారు. ఆచార్యాణి తలెత్తి తరగతిని పరికించి చూస్తుంది. అంతా నిశ్శబ్బం.

పురుషుల కళాశాలలో చదివే బాలికలు, వంచినతల ఎత్తకుండా వస్తారు. చూస్తూ ఉన్నా చూడరు. పలుకరించినా చెవిటివారు. నవ్వితే ఎవ్వ డీ ఇకిలింపుల పెగూపోనీ అని అనుకుంటారు.