పుట:Konangi by Adavi Bapiraju.pdf/265

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

చౌధు: డాక్టరుగారూ, అవసరమైనప్పుడు మీరు కత్తి ఉపయోగిస్తారు కదా; అలాగే భారత జాతీయత అనే మహావైద్యుడు జాతీయ వీరుల రక్తపాతం అనే శస్త్రవైద్యం భారతమాత రోగ నివృత్తికై చేస్తున్నాడని అనుకోరాదూ? డాక్టర్: మీ ఉపమ మంచిదేకాని వీళ్ళంతా అలా జైలుకు వెళ్ళడం, ప్రాణాలు పోగొట్టుకోవడం నాకేమీ నచ్చలేదు సుమండీ! అనంత: అలా అంటే ఎల్లాగండీ! భారతదేశంకోసం ఎంతైనా ఆహుతి చేయవలసిందే! డాక్టర్: అలా మీరంతా అంటారు. నువ్వు జైలుకు వెళ్ళడానికి సిద్ధమా? అనంత: ఆఁ.. డాక్టర్: మీ ఆయన వెళ్ళడానికి సిద్ధమా? అనంత: ఆం. డాక్టర్: చౌధురాణీగారు వెళ్ళడానికి సిద్ధమా? చౌధు: ఆఁ. డాక్టర్: మీరండీ సరోజినిగారూ? సరోజిని: ఆం. డాక్టర్: సరోజినిగారూ! మీరు మీ భర్తను జైలుకు వెళ్ళడానికి అనుమతిస్తారా? సరోజిని: అంతకన్న అదృష్టం నాకేమి కలుగుతుంది! డాక్టర్: నేనే సరోజినిగార్నయితే మధుసూదనుగారికి నా అనుమతి ఇవ్వనే ఇవ్వను. అనంతం: ఎందువల్ల యివ్వరు. ఒకవేళ మీరే సరోజినీ అక్క అయి, మీరు అనుమతి యివ్వకపోతే మధుసూదను బావగారితో, నువ్వు జైలుకు వెళ్ళవయ్యా అని సలహా ఇచ్చి ఉందును. డాక్టర్: నువ్వు చెప్తావు. నీ భర్తకు అనుమతి ఇస్తావా? అనంత: తప్పకుండా, క్రిందటిసారి వారు జయిలుకు వెడితే నేనేమన్నా గడబిడ చేశానా? డాక్టర్: ఎవరన్నా ధర్మాలు వందల కొలది చెప్పవచ్చును; ఆచరణలోనికి ఆ ధర్మాలను తీసుకుని వచ్చేప్పటికి మన బడాయిలన్నీ బయలు పడతాయి. అనంత: డాక్టర్గారూ, మీరు ఎన్ని అన్నా నాకు భయంలేదు కాని, మీ మగవాళ్ళు గాజులు తొడిగించుకొని ఇంటి దగ్గర కూర్చుంటున్నారు. మేమంతా ముందుకు దూకదలచుకొన్నాము. డాక్టర్: ఏమో, నీకు అలాంటి దీక్ష ఉండవచ్చును కానీ, భర్త నిజంగా జయిలుకు వెడితే క్రిందటిసారి జరిగినంత గడబిడ జరుగుతుందేమో? అనంత: జరగదండీ! (కొంచెం వైవర్ణం పొందుతుంది మోము.) సరోజిని: మగవాళ్ళందరూ ముందర వెళ్ళుతారా? వెళ్ళేటట్లే మాట్లాడుతున్నారు డాక్టరుగారూ! డాక్టర్: నాకు నమ్మకంలేదు. నేను వెళ్ళను. కానీ మీమీ సంగతి వివరణ చేస్తున్నా. చౌధురాణీ: ఆడవాళ్ళం మేం ముందర వెడతాము.. మధుసూదనుడు పత్రికా కార్యాలయానికి ఇంతకు అరగంటకు ముందే వెళ్ళిపోయాడు. చౌధురాణీ: ఇంతకూ మా అన్నయ్య జయిలుకు వెడతానంటున్నారా? అనంత: మా గురువుగారూనా? డాక్టర్: ఇద్దరూ వెడితే పత్రిక మాట? కోనంగి (నవల) 255