పుట:Konangi by Adavi Bapiraju.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెల్లవారగట్ల కోనంగి చప్పుడు కాని అడుగులిడుతూ అనంతలక్ష్మి దగ్గరకు రావడం జయలక్ష్మీ చూచి గాఢనిద్ర నభినయించింది. కోనంగి వంగి అనంతలక్ష్మి మూర్ధముపై మూడు ముద్దులిడి తిరిగి వెళ్ళిపోయినాడు.

ఏమిటిది? ఎంత మెత్తని హృదయం అల్లునిది. ఒక్కనిమిషమూ భార్యను వదలలేడు. ఒక్క పరుసపుమాట ఒక్కరిని అనడు. అందరు సేవకులు అతన్ని ప్రేమిస్తారు అనుకొన్నది.

ఈ రహస్యంకోసమా తన భర్త చౌధురాణీతో రహస్యాలూ గుసగుసలూనూ! ఈ విషయం తనతో చెప్పకూడదా? తానే చౌధురాణీతో మాట్లాడి ఉండునుగదా!

ఒకవేళ చౌధురాణీ భర్తను కోరి డాక్టర్ గారితో మాట్లాడమన్నదేమో? తన్ను కోరకూడదా? తానే డాక్టర్ గారితో మాట్లాడి ఉండునే! అది తన విషయంలో తప్పుకాదా? భర్త ఒక పరస్త్రీతో మాట్లాడడం తప్పని భార్య బాధపడితే, భార్య ఒక పరపురుషునితో మాట్లాడడం మంచిదని తాను ఎలా అనుకోగలదు?

తనలో ఏదో నీరసం బయలుదేరింది. అందుకనే ఉత్తమ పురుషుడయిన భర్తనే తాను అనుమానించగలిగింది. కోనంగేశ్వరరావు భర్తకాకపోతే ప్రాణంపోవడం తథ్యం అనుకున్న తాను, భర్త పరమసుందరమూర్తి అనుకున్న తాను, ఈనాడు వట్టి తెలివిహీనమై భర్తను పదిమందిలో అవమానించ సిద్ధమయింది. ఆయన మనస్సు తన మాటలకు ఎంత నొచ్చుకుందో!

అనంతలక్ష్మి వెంటనే లేచి చౌధురాణిని లోనికి తీసుకొనిపోయి, “అక్కా! నిన్ను అనుమానించి ఎంతో ద్రోహం చేశానమ్మా!” అన్నది.

“ఓసి వెర్రిఅక్కా! నువ్వు నన్ను అనుమానించలేదు. గర్భధారణము నరాల్ని తల్లక్రిందులు చేస్తుంది. సున్నితమైన నరాలస్థితిలో ఉన్న నీకు అన్నీ కంగారుగా కనబడతాయి. నీ ప్రేమ అంత ఉత్కృష్టమయినది ఈ జగత్తులోనే లేదని నేనూ, మనవదిన సరోజినీ అనుకున్నాము కూడా!”

“నువ్వు మీ బావగారితో తప్పంతా నాదేననీ, నేను వారిని నిష్కారణంగా అవమానించాననీ, నేను చేసిన తప్పిదానికి క్షమించమని వారిని పాదాలుబట్టి వేడుకొంటున్నాననీ నా తరపున చెప్పు!”

“ఏమిటక్కా ఆ మాటలు? నీ భర్తను లోకాతీతంగా ప్రేమించే నువ్వు, నీకు ఏమీ సంబంధం లేకుండా, నన్ను పంపుతావా క్షమాపణకు?”

“ఏం చేయమన్నావు?”

“నువ్వే వెళ్ళి ఆయనతో నీ హృదయం విప్పి చెప్పితే చాలు!”

“ఏదీ! పొద్దున్నుంచీ ఎక్కడా కనబడలేదు. నౌకర్లు వారు ప్రొద్దున్నే నడిచి చక్కాపోయినారని చెప్పుతున్నారు.”

“ఇంకో విషయం. డాక్టరుగారికి నా విషయమై శుభవార్త పంపించింది మీ ఆయనే!"

“ఏమిటి! వారేనా?”

“ఇంతకూ కోనంగిరావుగారు ఎక్కడికి వెళ్ళారు?”

అనంతలక్ష్మి, చౌధురాణీ ఇద్దరూ అనంతలక్ష్మి చదువుల గదిలో నుండి ఇవతలకు - వచ్చారు. అక్కడ హాలులో కూర్చున్న అందరూ ఏదో ఆలోచిస్తున్నారు. వారందరూ హాలులో తీవ్రాలోచనాధీనులై ఉన్నారు.

“ఏమిటర్రా మీరంతా అంతతీవ్రంగా ఆలోచిస్తున్నారు?” అంది చౌధురాణి.