పుట:Konangi by Adavi Bapiraju.pdf/258

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నవ్వి) ఏదో అంటున్నాను, నాకు తల తిరుగుతోంది... నాకు (ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ తలతిరిగి కూలిపోబోయింది) కోనంగి ఒక్క గంతువేసి అనంతాన్ని పట్టుకొని అనంతం! అనంతం! అని గుండెలదిరిపోయే కేకలు వేశాడు. ఇంతలో సరోజిని పరుగెత్తుకొని అక్కడకు వచ్చి 'ఏమిటి అన్నయ్యా!' అని అంటూ కోనంగి అనంతలక్ష్మిని చిన్నబిడ్డలా ఎత్తుకొని హృదయానికి అదుముకొని ఉండడం, అనంతలక్ష్మి నిశ్చేష్టమై ఉండి, వెనక్కు వేలవేసి ఉండడం చూచింది.

“అయ్యయ్యో! అన్నయ్యా!” అని మధుసూదనుని కేక వేసింది. కోనంగి అలా అనంతలక్ష్మిని ఎత్తుకొని మతిలేని వానిలా ముందు హాలులోనికి తీసుకువచ్చాడు. మధుసూదనుడు పరుగెత్తుకొని కోనంగి దగ్గరకు వచ్చాడు. కోనంగి మోము పిచ్చివాని మోములా అయిపోంది. అది చూచి, 'ఏమిటి కోనండీ!” అని అరిచాడు.

సరోజిని ఆ ప్రక్కనే ఉన్న కూజాలో నీళ్ళు అనంతలక్ష్మి మొగంపై చల్లింది.

అనంతలక్ష్మికి అంతకుముందే మెలకువవచ్చింది. అయినా భర్త తన్ను ఎత్తుకొని ఉండడం గమనించి ఆ నీరసత్వంలోనే ఏదో హాయి అనుభవిస్తూ కదలకుండా కళ్ళు మూసుకునే ఉంది.

చల్లని నీళ్ళు తగలడంతోనే ఆమే పూర్తిగా కళ్ళు తెరచి 'అమ్మా' అని నిట్టూర్పు విడిచింది. భర్త తన్ను విడవలేదు. అతడు ఈ లోకంలో లేడు. ఆమెను ఎత్తుకొని విగ్రహంలా నిలుచుండే ఉన్నాడు. భర్త మోము చూచి, అనంతలక్ష్మి గజగజలాడింది. “నాకు బాగా ఉంది, వదలండి గురువుగారూ!” అని సగం ఏడ్పుగా అంది. ఆ మాట విననట్టుగా కోనంగి భార్యను ఇంకా గట్టిగా హృదయానికి అదుముకున్నాడు.

మధుసూదనం డాక్టర్ రెడ్డికి వెంటనే ఫోను చేసి ఉండెను. మధుసూదనుడు ఫోను కడ నుండి వచ్చి, కోనంగిని పొదివి పట్టుకుని “ఒరే! కోనంగీ!” అని గాథ విషాదపూరిత కంఠంతో అరిచాడు.

కోనంగి ఇంతలో సగం మెలకువ వచ్చి “ఏమిటిది! ఏమిటిది! అంటూ భార్యను అక్కడే ఉన్న సోఫాపై పడుకో పెట్టాడు.

ఇంతలో డాక్టర్ రెడ్డి గబుక్కున వచ్చి, అనంతలక్ష్మిని పరీక్ష చేశాడు.

“అనంతలక్ష్మి! ఎల్లా ఉంది?” అని అడిగాడు.

“నాకు బాగానే ఉంది. వారిని చూడండి, అల్లా ఉన్నారు? వారిస్థితి చూడండి! నాకు భయం వేస్తోందండీ!” అని కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ అడిగింది.

డాక్టరు కోనంగి వైపు చూచాడు. కోనంగి చూపులు వెర్రిగానే ఉన్నాయి.

వెంటనే డాక్టర్ “సరోజినీదేవి అనంతలక్ష్మిని ఇంటికి తీసుకుపో కారుమీద. నేను కోనంగిని నా కారుమీద తీసుకువస్తాను” అన్నాడు.

“కాదండీ, నేనూ వారితోనే వస్తాను!” అని అంటూ లేచి భర్త దగ్గరకు రాబోయింది. సరోజినీ చౌధురాణీ వద్దని వారించారు.

ఈ లోగా డాక్టర్ కోనంగిని నెమ్మదిగా కుర్చీలో కూర్చుండబెట్టి నుదురుపై బలంగా చన్నీళ్ళతో కొట్టినాడు. కోనంగి గబుక్కున కళ్ళుమూసుకొని తలఊపి “ఏమిటి డాక్టర్! ఏమిటీ నీళ్ళు?” అని ప్రశ్నిస్తూ లేచి నుంచున్నాడు.