పుట:Konangi by Adavi Bapiraju.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆమె ముంగురులు అర్థచంద్ర సుందరమయి ఆమె ఫాలంపై చెదిరి ఉన్నాయి. ఆమెకు మెలకువ రాకుండ నెమ్మదిగా కోనంగి ఆ కురులు సర్దుతున్నాడు.

పయ్యెద నుండి ఓరగా తప్పుకున్న ఒక బంగారు హృదయదేవాలయము పయ్యెద మరుగున ఉన్న గోపురములు ఆమె ఊపిరితో పైకి లేస్తూ దిగుతూ ఉన్నాయి. అతని చూపులా పరమ పవిత్ర ద్వయముపై ప్రసరించినవి. అప్పటి నుండి ఆతని చూపులు ఆమె చుబుకముపై వ్రాలినవి.

ఇంతలో రేడియోలో మద్రాసు నుండి స్పష్టంగా ప్రభాత గీతిక వినిపించ సాగినది. ఆ రాత్రే కోనంగి. ఒక పాట ఆ ప్రభాత గీతిక వరసనే వ్రాసి ఉంచుకున్నాడు. ' ఆది ఆ రేడియో గీతికలో కలిపి పాడసాగినాడు.

“జయమో సుందరి నీకూ

జయలక్ష్మీ తనయా!

జయమ హెూ సుందరి నీకూ!

పల్లవాధరీ! పుల్లసుమానన

హల్లకకుట్మల యుగ్మకుచా!

జయమహో సుందరి నీకూ!

నీదు స్వప్నములు నిర్మలకాంతులు

నన్ను పొదువునవి నిశ్చలప్రేమలు

జయమూ సుందరి నీకూ!”

ద్వాదశ పథం

ఆగస్తు ఎనిమిది

ఆగష్టు ఎనిమిది తారీఖున బొంబాయిలో కాంగ్రెసు మహాసభ సమితి సమావేశమై “బ్రిటిషువారు ఇండియా వదలాలనీ, లేకపోతే ప్రతి భారతీయుడూ సత్యాగ్రహం చేయాలనీ, ఆ సత్యాగ్రహం గాంధీగారు ప్రారంభిస్తారనీ, ఆ సత్యాగ్రహం ప్రారంభించే ముందు మహాత్మాజీ ప్రభుత్వం వారికి తెలియజేసి రాజీకి వ్యవధి ఇస్తారనీ” తీర్మానింపబడింది.

రాత్రికి తీర్మానం అయింది, తెల్లవారకట్ల కార్యవర్గ సభ్యులనందరినీ అరెస్టుచేసి ఎక్కడకో తీసుకుపోయారు. మహాత్మాగాంధీజీని, ఆయన అనుచరవర్గాన్ని తీసుకుపోయి ఆగాఖాన్భవనంలో ఖయిదుచేశారు. ఆగస్టు తొమ్మిది ఉదయించింది.

ఆగస్టు తొమ్మిదిలో ఏదో మహత్తరావేశం పొంగిపోయి అఖండ విద్యుచ్ఛక్తిలా దేశం అంతా ప్రాకిపోయింది.

ప్రతిగ్రామంలో, పురంలో, నగరంలో ప్రజలు ఆందోళనావశులైరి.

ప్రభుత్వంవారు డజన్లకొలదీ ఆర్డినెన్సులు అమలులో పెట్టారు. కాంగ్రెసు మహాసభ, కార్యవర్గము, రాజధానీసభలు, కార్యవర్గాలు, జిల్లాసభలు, కార్యవర్గాలు. గ్రామ జాతీయసంఘాలు నిషేధింపబడినాయి.