పుట:Konangi by Adavi Bapiraju.pdf/249

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


 రాడికల్ డెమొక్రటిక్ పార్టీవారూ, వారి పెద్ద ఎం. ఎన్. రాయిగారూ కాంగ్రెసును, గాంధీజీని దుమ్మెత్తి పోయసాగారు. కమ్యూనిస్టులకు రహస్యంగానూ, రాడికల్ వారికి బహిరంగంగానూ ప్రభుత్వం డబ్బిస్తోందని దేశంలో మారు మ్రోగుతోంది. ఫార్వర్డుబ్లాకు పార్టీవారి నందరినీ ప్రభుత్వం జయిళ్ళకు పంపించింది. ఫార్వర్టుబ్లాకు పార్టీనే నిషేధించింది.

ఈ గడబిడలో నవజ్యోతి, అటు ప్రభుత్వం కొండకూ, ఇటు కాంగ్రెసు కొండకూ తగలకుండా చక్కని సంపాదకీయాలు అర్పింపసాగింది. డాక్టరు రెడ్డి సామ్యవాది అయినా నవజ్యోతిని సామ్యవాదపు పేపరు చేయదలచుకోలేదు. కోనంగీ, అనంతలక్ష్మీ కాంగ్రెసు వైపే మొగ్గి ఉన్నా నవజ్యోతిని కాంగ్రెసు పేపరు చేయదలచుకోలేదు.

ఈ సందర్భంలోనే అనంతలక్ష్మికి కోపం వచ్చిన సంఘటన జరిగింది. ఆ దినం ఆగస్టు ఒకటవ తారీఖు.

హాలులో డాక్టరు, కోనంగి, మధుసూదనుడూ మాట్లాడిన వెనుక డాక్టరూ మధుసూదనుడూ వెళ్ళడానికి లేచారు.

ఈ లోపుగా చౌధురాణీ, సరోజీనీ, కమలనయనా అనంతలక్ష్మితో ఏవో పిచ్చాపాటీ మాట్లాడుకొని, అనంతలక్ష్మి కులాసాగా ఉండడం చూచివారూ వెళ్ళడానికి హాలులోకి వచ్చారు.

చౌధురాణీని చూడగానే రెడ్డి గుండెలు దడదడ కొట్టినాయి. చౌధురాణీ రెడ్డిగారి వంక చూడనట్లు కనిపించింది. కాని, చూడవలసిన రీతిగా చూడనే చూసింది.

అందరూ వెళ్ళిపోయారు. కోనంగి చాలా పొద్దుపోయినా, హాలులో ఒక సోఫాలో కూర్చొని ఉన్నాడు. అతడు కుంగిపోయి ఆలోచనలులేని ఆలోచనలలో మునిగియున్నాడు. దీపం వెలుగుతూనే ఉంది గుడ్డిగా.

మదరాసులో బ్లాకుఅవుటు అవడంచేత ఇళ్ళలో కూడా దీపాలచుట్టూ నల్లటి బురకాలు పెట్టవలసి వచ్చింది. ఒక గంట అయింది. కోనంగి చటుక్కున లేచి తన పడక గదిలోనికి వెళ్ళినాడు.

అనంతలక్ష్మి పందిరిమంచంమీద కళ్ళు తెరిచే పడుకొని ఉన్నది. కోనంగి నెమ్మదిగా వెళ్ళి మంచంమీద కూర్చుండి "అనంతం! వంట్లో బాగా కులాసాగా ఉందా?” అని అడిగినాడు. అనంతం చేతులు చాచింది. కోనంగి ఆమె హృదయంపై వ్రాలి ఆమెను గాఢంగా తన హృదయానికి అదుముకొన్నాడు.

తెల్లవారి ఏడుగంటలు అయింది. కోనంగి భార్య పక్కనుండి మెల్లగా లేచి ఆ గదిలో వారిద్దరికోసం ఉంచుకొన్న ఒక చక్కని రేడియోను మదరాసు మీటరు తిప్పి మంచం దగ్గరకు వచ్చి నిదురలో సౌందర్యనిధియై పడుకొన్న అనంతలక్ష్మిని చూస్తూ మంచం దగ్గరే నిలుచున్నాడు.

అనంతలక్ష్మి గులాబిమొగ్గల పెదవులు కొంచెం విడివడి ముత్యాల పలువరస కొంచెముగా కనబడుతూ ఉన్నది. ఆమె పెదవులూ, మూతలు పడియున్న కన్నులూ నవ్వుతూ ఉన్నాయి.

“ఈలాటి పరమ కల్యాణమూర్తిని భార్యగాగల ఎవ్వనికి కవిత్వంరాదు!” అని కోనంగి అర్థస్ఫుటంగా అనుకున్నాడు.