పుట:Konangi by Adavi Bapiraju.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డాక్టరు అనంతలక్ష్మికి జ్వరం సంగతి చూచి, నాడి పరీక్ష చేసి ఏమీలేదు కొద్దిగా అజీర్తి చేసిందని ఆయన హాలులోనికి వచ్చి కూర్చున్నాడు. అక్కడకు మధుసూదనుడూ, కోనంగీ కూడా చేరారు.

డాక్టరు: కాంగ్రెసు కార్యవర్గంవారు బ్రిటిషువారిని దేశం వదలి నడవమన్నారు. ప్రభుత్వాన్ని ఈ దేశంనుండి నడపడానికి తీర్మానం చేశారు, అది ఆగష్టు మొదటివారంలో బొంబాయిలో జరిగే అఖిల భారత జాతీయ మహాసభా సమితి ఎదుట పెడ్తారట.

కోనంగి: అవును, పెట్టరా.

డాక్టరు: 'క్విట్ ఇండియా' విధానం లేవదీశాడు గాంధీజీ.

మధు: అదే మహాత్మాజీలోని మహత్తు. దేశం క్రుంగి ఉన్నప్పుడు ఒక్కొక్క క్రొత్త భావం ప్రజలలో విసురుతాడు

డాక్టరు: రాయిలా!

కోనంగి: అమృతఘుటికలా!

డాక్టరు: మీ మహాత్ముడు జపాను యుద్ధాన్నిగూర్చి అలా వ్రాశాడేమిటి?

కోనంగి: ఏమి వ్రాశాడు? తానయితే జపానుకు వెళ్ళి వాళ్ళను తాము చేసే ఈ దురన్యాయపు యుద్దం చెడుగుదని బోధిస్తా నన్నాడు.

డాక్టరు: దానిమీద బ్రిటిషు పత్రికలు ఈ ముసలాయన్ను తిట్టిపారేస్తున్నాయి.

మధు: తిట్టవు మరీ ... ఆయన భావానికి చెయ్యాలని తప్పర్థం చేసి అవాకులు వాగితే సరి.

10

క్రిప్పుగారు కాంగ్రెసును, భారతీయులను నాలుగు తిట్టి చక్కాబోయారు. లండను వెళ్ళి తిట్టినారు. బ్రిటిషు ప్రభుత్వంవారూ నాలుగు తిట్టినారు.

దేశంలో ప్రజలకు బ్రిటిషువారిపై ద్వేషం ఎక్కువై పోతోందని మహాత్మాజీ అఖండ సత్యాగ్రహం ప్రారంభించాలన్నారు. నాయకులు సంపూర్ణ సత్యాగ్రహం జరుగుతుంది, సిద్ధం అంటున్నారు.

పత్రికలన్నీ ప్రభుత్వంవారిని చివాట్లు పెడుతూ కాంగ్రెసుతో రాజీపడండి అని కోరుతున్నాయి.

జపాను నేడో రేపో ఇండియాలో దిగుతుంది అన్న కింవదంతులు ప్రబలిపోయాయి.

విరోధుల రేడియో వార్తలు వినవద్దని ప్రభుత్వంవారు ఆర్డినెన్సు చేసినా ప్రజలలో చాలమంది వింటూనే ఉన్నారు. జర్మనీ నుంచీ, సైగాను నుంచీ, జపాను నుంచీ వార్తలు, ప్రసంగాలు వస్తున్నాయి.

భారతదేశం నుండి ఏ రకంగా మాయమయ్యారో సుబాసబాబు జర్మనీ చేరి అక్కడ భారతీయ సైన్యం ఏర్పాటు చేశాడని రేడియోలో వినబడసాగింది.

ఏమి గడబిడలు జరుగుతాయో అని ప్రభుత్వం ఆర్డినెన్సులూ, అరెస్టులు జరిగే విషయాలన్నీ ఆలోచించుకొని సిద్ధంగా ఉన్నారు.

కమ్యూనిస్టులు కాంగ్రెసువారిని ఇప్పుడిప్పుడే సత్యాగ్రహం పెట్టవద్దనీ, ఫాసిస్టులను నాశనం చేయవలసిన ఈ సమయంలో కాంగ్రెసువారు సత్యాగ్రహం ప్రారంభించడం దేశానర్థదాయకమనీ వ్యాసాలు, ఉపన్యాసాలు మారుమ్రోగిస్తున్నారు.