పుట:Konangi by Adavi Bapiraju.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“చాలు ప్రాణేశ్వరీ చాలు! కుక్కశాస్త్ర గ్రంథాలు చాలా చదివినట్లుంది.”

ఆ తర్వాత కోనంగి డాల్మేషియనూ కొనలేదు, కూలీజాతి కుక్కనూ కొనలేదు. కాని బ్రౌనుకూ అతనికీ ఎంతో స్నేహమయింది.

అలాంటి బ్రౌన్ కు ఆపత్తు ఏదో జరిగిందనగానే పరుగెత్తినాడు కోనంగి. బ్రౌన్ కులాసాగానే ఉంది. ఏదో కొంచెం గీచ్కుపోయింది. అంతే!

“నా తల్లి రా! నా తండ్రి రా! దెబ్బ తగిలిందా?” అని కళ్ళనీళ్ళతో అనంతలక్ష్మి బ్రౌనును గట్టిగా హృదయానికి అదుముకుంది.

బ్రౌన్ కులాసాగానే ఆడుకుంటూ ఉన్నది. అందరూ పత్రికా కార్యాలయానికి వెళ్ళినారు.

అనంతం కొంచెం మనసులో ఏదో బాధపడుతూ ఉన్నది. కోనంగి తన భార్య కుక్క విషయం మనస్సులో ఖేదపడిందనుకొని, ఏవో నాలుగు మాటలు ఊరడింపుగా పలికినాడు. అతడు ఆఫీసులో సంపాదకీయంలో పడినాడు.

మహాత్మాగాంధీగారు క్రిప్పుగారి రాయబార షరతులకు “రాబోయే తారీకు వేసిన చెక్కు' అని పేరు పెట్టారు. అంటే అది ఒక ప్రామిసరీ నోటువంటిది అని కోనంగి. అన్నాడు. చిన్నపిల్లవాళ్ళు కోరికకు సమాధానంగా 'లేవు' అని ఇంటిగోడమీద రాయడం వంటిది అని కోనంగి హేళనచేశాడు. 'క్రిప్పు'గారు వట్టి ట్రిక్సు' గారిలా ఉన్నారని నవ్వాడు. చర్చలుగారికి చర్చలు అంటే మహాఇష్టమన్నాడు. కాబట్టి ప్రభుత్వం సంప్రదించి, వారితో కలిసి యుద్ధం కొనసాగించాలన్నారు.

డాక్టరు రెడ్డి వచ్చి కోనంగి గదిలోనే కూర్చొని, “ఏమి చేశావోయి నన్ను గూర్చిన రాయబారాన్ని!” అని అడిగినాడు.

“ఈ రోజే ప్రారంభించాను.”

“ఎంతవరకూ వచ్చింది?”

“ఆమెకు ఒక మైలుదూరంవరకూ వచ్చింది”

“అంతదూరమే?”

“ఏమయ్యా, ఇదివరకు మూడువందలమైళ్ళ దూరంలో ఉన్న రాయబారం మైలు దూరంవరకూ రావడం వాయువేగాన్నంటావా, మనోవేగాన్నంటావా?”

“ఏదో త్వరగా చెప్పునాయనా?”

“ఏమి విరహతాపం! దీనినిబట్టి తమకు కొంచెమన్నా అభిప్రాయాలు మారాయా?”

“ఏ అభిప్రాయాలు?”

“ప్రేమనుగూర్చి!”

“ఏమని?”

“ప్రేమ పారిపోవుతనమన్నావు. ప్రేమకవిత్వం పారిపోవు కవిత్వం అన్నావు”

“నా ప్రేమనుగూర్చి నాకు కవిత్వం వ్రాసుకోవలసిన అవసరం ఎందుకు రావాలి? అది అచ్చు వేయించి అందరిమీదా రుద్దడమెందుకు?”

“రుద్దడమంటావు. కవిత్వం ఆముద మనుకొన్నావా, ఆవు నెయ్యనుకోన్నావా. అమృతాంజనమనుకొన్నావా?”

“అన్నీ అనుకోవాలె. మీ ప్రేమకవిత్వాలు చూస్తే!”