పుట:Konangi by Adavi Bapiraju.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“ఎవరీ డాక్టరు అన్నా?

“నాకు ప్రాణ స్నేహితుడు.”

“ఎన్నాళ్ళ నుంచీ మీ ఇద్దరి స్నేహం?”

“ఇక్కడకు వచ్చినప్పటి నుంచీ.”

“ఏమిటీ, ఇక్కడకు వచ్చిన తరువాతనే!”

“అమదా!”

“ఏమి చేస్తూవుంటాడు?”

“ఏవరీ డాక్టరు అని నీ ప్రశ్న? అతడు అమృతం కలవాళ్ళలో ఒకడు!”

“సరేకాని, చిన్నవదిన ఎంత అందమైంది?”

“నా అదృష్టం. పల్లుతోము పుల్లకు చెట్టు ఎక్కితే, సంజీవకరణి దొరికినట్లయింది.”

“అదుగో వదినే వస్తోంది.”

అనంతలక్ష్మి పరుగున వచ్చి, “రండి, మన బ్రౌన్” మేడమీద నుంచి క్రింద పడింది!” అని వగరుస్తూ చెప్పింది.

7

బ్రౌన్ అనంతలక్ష్మి కుక్క ఐరిష్ స్పానియల్ మేలుజాతికి చెందినది. నేబిలు రంగు, ఎరుపుబొచ్చుతో ఎర్రఎలుగుబంటిలా ఉంటుంది. దాని కంఠంలోని స్వనము మేఘగర్జనమే! బ్రౌను గుణాలన్నీ ఉత్తమ మైనవి. దానికై ఏర్పాటు చేయబడిన కుర్చీలోనే అధివసిస్తుంది. అనంతలక్ష్మి స్నేహితు లెవ్వరు వచ్చినా ఏమీ మాట్లాడదు. కొత్తవారు గుమ్మం ఎక్కడానికి వీలులేదు. పోర్చిలో నిలబడవచ్చును, కారుమీద వస్తే వరండాలోకి వచ్చి అక్కడ ఉన్న కుర్చీలలో కూర్చోనిస్తుంది. తర్వాత హాలులోనికి వెళ్ళి అక్కడ తన ఆసనం అధివసిస్తుంది. క్రింద పడుకోదు. ఎప్పుడూ తనకై కేటాయింపు చేయబడిన కుర్చీలలోనే అధివసిస్తుంది. విశ్రాంతి తీసుకుంటుంది. ప్రకృతి బాధలు తనకై నిర్మాణం చేసిన దొడ్డిలో తీర్చుకుంటుంది. వేళకు తన భోజన ప్రదేశానికిపోయి భోజనం చేస్తుంది. ఎముకను సాయంకాలంలో కొరుక్కునేందుకు తోట వెనుక ఒకచిన్న అరుగు చేరుతుంది.

“ఈ స్పానియల్ కుక్కతోబాటు డాల్మేషియన్ కుక్కను ఒకటి కొనండి గురువుగారూ!” అని అనంతలక్ష్మి భర్తను అడిగింది.

“అనంతం! నాకీ కుక్కల సంగతి పూర్తిగా తెలియదు. ఎందుకు ఈ పెద్దజాతి కుక్కలు? ఆస్థి, ఐశ్వర్యమూ అందరికీ సమానం అయితే కుక్కలే అక్కరలేదు. మన బంగారాలు వగైరాలు కాపాడడానికే ఈ కుక్కలు!”

“కుక్కలు ఒక విధంగా మనుష్యులకు ఆనందం ఇస్తాయి. కొన్ని జాతికుక్కలు మనుష్యులకు ఎంతో సహాయం చేస్తాయికదా?”

“అవును. వేటాడేందుకు, నీళ్ళలో పడిపోయేవారిని రక్షించేందుకు.”

“మీరు నన్ను హేళన చేయనక్కరలేదు. నాకు మంచిజాతి కుక్కల్ని చూస్తే ఆనందం.”

“ఏమిటా మంచిజాతి అనంతం?”

“కుక్కజాతులు మనుష్యజాతులకన్న మంచివి. గ్రేటోడేస్, గ్రేహౌండు, బ్లడ్హౌండ్, వాటర్హౌండ్, హారియల్, టెర్రియల్ జాతులు. అందాల కుక్కలయిన పోమరేనియన్ వగయిరాలు, పెకింగీస్, జపానీస్, గ్రిషాంక్సు వగైరా వగైరాలు.”