పుట:Konangi by Adavi Bapiraju.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“నువ్వు ఆమెను ప్రేమిస్తునావు గనకనూ!”

“అందుకనే అడిగానయ్యా స్వామీ!”

“నిన్ను ప్రేమిస్తోంటే ఆ అమ్మాయి నీ మాట తీసుకువస్తుందికదా అనా!”

“ఆమ, ఆమా!”

“డమ! డమా!”

“చెప్పవయ్యా!”

“ఆ అమ్మాయి ఏదో మాటవరసను నీ మాట ఎత్తినమాట నిజము!”

“ఏమిటా మాటలవరస?”

“ఈ డాక్టరుకు మతిపోయిందా? అని నన్నడిగింది.”

“ఛా!”

“ఆ! ఈ పేపరుకు ఇంతడబ్బు పెట్టాడు. ఆయనకు మతిపోయిందా?” అని అడిగింది.

“ఇంకా?”

“ఇంకా, ఏమిటి? ఇదేమన్నా ఇడ్లీలోకి సాంబారు వడ్డించడంటయ్యా?"

“చెప్పుదు స్వామీ!”

“చెప్పుతాన్, సామీ!”

“ఆడవాళ్ళ మనస్సులు అతి విచిత్రాలూ, సినీమా చిత్రాలూను. ఆమె మనస్సులో ఏమి ఉందో?”

“సరేలే! మనుష్యుల్ని ఏడిపించడమంటే, మనకు చాలా సరదాదా!”

“ఏడవడమెందుకూ, నవ్వమంటూంటే!”

“ఏది చూచి నవ్వడం?”

“ఆ అమ్మాయిని చూచి!”

“ఆ అమ్మాయి హృదయం తెలియందే!”

“నేను మూడు నాలుగు రోజులలో నీకు ఏ విషయమూ చెప్తానుగాదా!”

“నాలుగురోజులా!”

“ఆగు! ఆ మాత్రం నిరీక్షణ చేయలేవా? ప్రేమ కాలాతీతం తొందరపడి దాన్ని గడియలలోకి లాక్కొస్తానంటావేమిటి?”

రెడ్డి నిట్టూర్పు విడుస్తూ వెళ్ళిపోయాడు. ఆ రాత్రి కోనంగి చౌధురాణితో ఏదో లోకాభిరామాయణంవేసి కూర్చున్నాడు.

“చౌధు! ఎల్లా వుంది పత్రికా ఉపసంపాదకత్వం?”

“అదో గమ్మత్తుగా ఉంది చిన్నన్నయ్యా!”

“నీకు విసుగురావడంలేదుగదా!”

“మొదట కొంచెం విసుగుగా ఉండేది. తర్వాత తర్వాత ఉసిరి కాయలు తిన్నట్టే!”

“అబ్బా చాలా బాగుంది. మా డాక్టరూ, మా అత్తగారూ ఈ పత్రిక ఆరంభించడం నాకు కోటివేల సహాయం అయింది.”

“నీకేమిటి, అన్నకో?”

“అన్న కృతజ్ఞత వర్ణించలేను. డాక్టరు అన్నకూ, నాకూ ఎంత ఉపకారం చేస్తున్నాడు?”