పుట:Konangi by Adavi Bapiraju.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయ పథం

అనంతలక్ష్మి

కారు నడుపుకుంటూ అనంతలక్ష్మి లోపలికి పోయింది. కాని ఆ అబ్బాయి విగ్రహం చూపులనుంచి పోదే? ఎవరా యువకుడు? అతని మోములో విచిత్రమయిన శక్తి ఏమిటి? అతని కళ్ళల్లో ముక్తాయించిన శబ్దాలేమిటి? ఎంత చక్కగా మాట్లాడాడు! పాలఘాట్ మణి మృదంగంకన్న తీయగా ఉందామాట. తనకు ఇంకా నవ్వాగలేదు. నాటుపురం కాదట, కన్నాటుపుర మట!

అసలు స్త్రీ పురుష జీవితాలలో ప్రేమ అనేది కుదరదు. ప్రేమ అనేది ఒక కావ్యరస స్వరూపం. కాని జీవితం కావ్యశ్రుతికి రెక్కలు చాపినప్పుడు ఆ దివ్యానుభవ ప్రేమ మనుష్యులకు కూడా ప్రత్యక్షమవుతుంది కాబోలు.

అనంతలక్ష్మి ఆ కావ్యస్థితిలో ఉండే బాలిక. ఆమె రక్తంలో తంజావూరి రఘునాథరాయల ప్రేమ విధానము, మధురవాణి రసికత ప్రవహిస్తున్నవి. ఆ వంశపు ఆమ్మాయే ఆమె. ఆమె ముత్తవ ముత్తవ ముత్తవ ముత్తవ ముత్తవ మధురవాణి కొమరిత అని అనంతలక్ష్మి తల్లి వంశ వృక్షము చూపిస్తుంది.

అనంతలక్ష్మి ఆడవాళ్ళ కళాశాల అయిన క్వీన్ మేరీ కాలేజీలో చదువుకుంటున్నది, ఈ ఏడే ఇంటరుకు వెళ్ళాలి. అనంతలక్ష్మి తల్లి జయలక్ష్మి కొమరితకు ముగ్గురు ఉపాధ్యాయులను పెట్టి చదివిస్తోంది. తానయితే సంస్కృత కావ్యాలు, తెలుగు కావ్యాలు, అరవ కావ్యాలు చదువుకుంది. సంగీతంలో నిధి. నాట్యంలో దాక్షిణాత్య వివాహ రంగస్థలాలు అలంకరించి పండిత పామరుల హృదయములు, ఆదరములు చూఱగొన్న తలమానికమైన నర్తకి.

పొగాకు తాంబూలం వేసినా, జయలక్ష్మి కంచిలో ఉన్న ఒక ధనికుడైన అయ్యంగారి కుద్భవించిన దిట్టమయిన పుట్టుక కలది కాబట్టి, ఎఱ్ఱగాబుఱగా రవ్వల నగలతో, రవ్వల వడ్డాణంతో పదివేల రూపాయల నగలు తల్లి దగ్గర నుండి సంక్రమించుకొన్న నవోడ అయి, ఒక పెద్ద జమీందారుని కన్యరికపు భర్తగా పొందగలిగింది.

అ జమీందారు జయలక్ష్మిని వదులుతేనా? ఆ యువతి నాటుకోటి చెట్టియారుల పెళ్ళిళ్ళిలో, లక్షాధికార మొదలియారుల శుభకార్యములలో, తెలుగు శ్రేష్ఠులు, రెడ్లు, నాయకులు, రాజులు, దాయంగులు, అయ్యరు అయ్యంగార్లు, పిళ్ళేల ఇళ్ళల్లో వివాహాది శుభకార్యాలలో జయలక్ష్మి పట్టులాగు ధరించి, పెద్ద జరీ పూవుల బనారసుచీర ధరించి కుచ్చెళ్ళు పెట్టి అయిదువేల ఖరీదు కలిగిన రవ్వల అడ్డబాస పెట్టి, పద్దెనిమిదివేల రవ్వల వడ్డాణము తన తేనెటీగ నడుంలాంటి నడుముకు బిగించి, విప్పిన అల్లిక విసనకర్రలా కుచ్చెళ్ళు జరీ అంచుతో ముందు జిలుగులాడ, గజ్జెలుకట్టి, గురునకు పాదాభివందనము, మృదంగమునకు వంగి నమస్కారముచేసి, పెద్దలకు దణాలుపెట్టి అలరింపుతో నాట్యం ప్రారంభం చేసిందా, ఆ జమీందారుడు హాజరు.