పుట:Konangi by Adavi Bapiraju.pdf/238

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మధుసూదనుని రెండవ చెల్లెలు కమలనయనా, ఆమె అక్క చౌధురాణీ 1942 జూలై నెల్లో మదరాసు వచ్చినారు. ఇంటరు మొదటితరగతిలో నెగ్గి రాయపురం స్టాన్లీ మెడికల్ కాలేజిలో చేరడానికి వచ్చింది కమల. అతని చెల్లెలు చౌధురాణీ పత్రికలో పనిచేయడానికి వచ్చింది. ఆతని తమ్మునికోసం బందరులోనే ఉండిపోయింది మధుసూదనుని తల్లి.

కమలనయనకు పందొమ్మిదేళ్ళు. చౌధురాణికి ఇరవై రెండేళ్ళున్నాయి. కమలనయనకన్న చిన్నవాడు మధుసూదనుని తమ్ముడు. అతని పేరు రమేశుదత్తు. ఈ పేళ్ళన్నీ వారి తండ్రి బ్రహ్మసమాజంవాడవడంచేత బంగాళీ బ్రహ్మసమాజంవారి పెద్దల పేర్లు పెట్టుకున్నారు.

చౌధురాణీ అంతకుముందు సంవత్సరమే బి.ఏ. ప్యాసయి ఉంది. ఆమెకు ఏమీ ఉద్యోగంలేక శ్రీ ముట్నూరి కృష్ణారావుగారు, పట్టాభిగారు మొదలగు పెద్దల సహాయంచేత ఒక బాలికా పాఠశాలలో తాత్కాలికంగా నలభై రూపాయలకు చేరింది.

ఇప్పుడు కోనంగీ, డాక్టరూ ఆలోచించి అనంతలక్ష్మీ, జయలక్ష్ముల సంప్రదింపులతో చౌధురాణీకి నూరురూపాయల జీతంపై ఉపసంపాదకురాలినిగా తీసుకున్నారు.

కమలనయన వైద్యకళాశాలలో చేరింది. మధుసూదనుని కుటుంబం అంతా అనంతలక్ష్మి ఇంటికి అనతిదూరంలో ఆలివర్ వీధిలో ఒక చిన్న మేడ అద్దెకు తీసుకున్నారు. కమలనయన కాలేజీ హాస్టలులో బాలికా భాగంలో చేరింది.

చౌధురాణీ, కమలనయన వచ్చేరోజున రైలు దగ్గరకు కార్లమీద కోనంగీ, అనంతలక్ష్మీ, మధుసూదనరావూ, ఆతని భార్య సరోజనీదేవీ, డాక్టరు రెడ్డి వెళ్ళారు. వారిరువురూ ఆడవాళ్ళ ఇంటరు బండిలోంచి దిగారు. చౌధురాణీ మోము శిల్పశాష్ట్రం ప్రకారం సౌందర్యాంగ సమన్వితం అని చెప్పలేము. కాని, ఆమె మోములో సౌందర్య కాంతులూ ఏవో మధుర విషాదకాంతులూ కలయిక పొంది ఆమెకు కృష్ణశాస్త్రి కవిత్వ మనోహరత్వం సమకూర్చాయి. అతి సున్నితమయిన ఆరోగ్యం, అతి బక్కపలచని బాలిక, ఆమె నడుస్తూ ఉంటే వీణ తీగమీద ఏదో రాగం సంచరించినట్లే ఉంటుంది.

రెడ్డి ఆ బాలికను చూచాడు అలాగే నిరాంతపోయి నిలుచున్నాడు. ఈమెకు కురిషిద్ గడ్డమూ, మెహతాబ్ పెదవీ, నసీమ్ కరుణపూరిత నయనాలూ ఉన్నాయి అనుకున్నాడు. కమలనయన మగవీరుడు. ఆమె అచ్చంగా స్నేహప్రభలా ఉంటుంది.

“హల్లో డాక్టర్, మీకు ప్రత్యర్థిగా రానులెండి. మీరు బెంగపెట్టు కోకండి?” అని రెడ్డిగారిని ఒకసారి పలకరించి కరగ్రహణ లాంఛనం జరిపింది. చౌధురాణి డాక్టరు రెడ్డిగారికి నమస్కారం మాత్రం చేసింది.

వచ్చిన వేనుక మూడురోజులు గడచినప్పటి నుంచీ చౌధురాణి. నవజ్యోతి ఉప సంపాదకవర్గంలో చేరింది. ఆమె చేరిన వారం రోజుల నుంచి రెడ్డిగారు ఎక్కువ శ్రద్దగా పత్రికా కార్యాలయానికి రావడం సాగించారు.

డాక్టరు రెడ్డి ఎక్కువగా మధుసూదనరావు విషయం కనుక్కుంటూ అతన్ని హుషారుపరుస్తూ తనింటి కాతన్ని ఎక్కువగా తీసుకుపోసాగినాడు.

ఆవులించకుండానే ప్రేవులు లెక్కపెట్టగల కోనంగి డాక్టరుని వెంటనే అర్థం చేసుకున్నాడు. ఇన్నాళ్ళ నుంచీ మన్మథుడు డాక్టరు దగ్గరకు వెళ్ళడం అంటే భయపడేవాడు. ఈనాడు ఆ పంచాస్రుడు గురి తప్పకుండా జుంజుం అని డాక్టరు గుండె మధ్య నుంచి తన బాణం గాటంగా పెద్దతూటు పడేటట్లు వేయగలిగాడయ్యా అని అనుకున్నాడు కోనంగి.