పుట:Konangi by Adavi Bapiraju.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈలా సాగించాడు కోనంగి, ఇతరులను తిట్టకుండా, ఒకరికీ మనస్సు నొవ్వకుండా, ఆంధ్రరాష్ట్ర సంపాదన విషయంలో ప్రతి ఆంధ్రుడూ ఒక్కనిమిషమూ ఏమరుపాటున ఉండకూడదని అతని వాదన.

మొత్తంమీద “నవజ్యోతి' ఆంధ్రదేశం అంతటా ఒక్కసారిగా గడబిడ చేయటం సాగింది.

అవతల సరోజినీదేవి స్త్రీలకు జరిగే అన్యాయాలు, స్త్రీల హక్కులు, శాసనసభలు చేయవలసిన మార్పులు, ప్రజాసంస్థలు చేయవలసిన కర్తవ్యాలు వరుసగా వ్రాయ నారంభించింది.

హిందూ ధర్మం ప్రకారం స్త్రీలకు పురుషులకు విడాకులు ఉండాలా, లేదా? అన్న విషయం ఆవిడ చర్చకు నింపింది. ఓట్లు తీసుకుంది. ఓట్లు అక్కరలేదు అన్నవి ఎక్కువ వచ్చాయి, మహిళల దగ్గిరనుంచే.

ఇదంతా మొగవాళ్ళ కృత్రిమం అని ఒక సంస్కర్తి వ్రాసింది. అందుకు జవాబుగా ఒక మధ్యవాదిని అలాంటి ఆరోపణలు స్త్రీల గౌరవానికి భంగకరం అని వ్రాసింది.

ప్రసిద్ద దేశ నాయకురాండ్రు ఎప్పుడూ స్త్రీలపుటలో పెద్ద పెద్ద వ్యాసాలు వ్రాస్తున్నారు. భారతీయ మహిళామణులు ఎవరు మదరాసు వచ్చినా సరోజినీదేవీ, అనంతలక్ష్మీదేవి వారి అభిప్రాయాలు కనుగొనడానికి సిద్ధం.

అనంతలక్ష్మి ఒక చక్కని చిన్న ఛాయాగ్రహణయంత్రం కొంది. చాలా విలువగల యంత్రమది. వెలుగుయంత్రమూ కొంది. ఏ ప్రసిద్ధ నారీమణి వచ్చినా వీరిద్దరూ కారుమీద వెళ్ళడం, వారి చిత్రం గ్రహించడం, తమ పత్రికలో ఆ రోజే వేయించడం, లేకపోతే మర్నాడు వేయించడం, ఆంధ్ర మహిళలు ఇది మా పత్రిక అన్నారు.

కోనంగి అనంతలక్ష్మిని చూచి "అనంతం! కొన్నాళ్ళకు ఈ దినపత్రిక పూర్తిగా మళయాళం చేస్తావా?” అని అడిగాడు.

“మీకు కావలసినన్ని మొగపఠాలం పత్రికలు లేవా ఏమిటి?” అన్నది.

4

కోనంగి: వచ్చే ప్రతివార్తా ఉప సంపాదకులు తర్జుమాచేస్తూ ఉంటారు. దానికి శీర్షికలిస్తూ ఉంటారు. పూర్వకాలపు భావాలుగల పత్రిక అయితే శీర్షికలు చిన్నవి. ఒక కాలం మాత్రమే ఇస్తారు. ఎంత గొప్పవారయినా అంతే!

డాక్టరు: ఈనాటి పత్రికలు!

కోనంగి: ఈనాటి పత్రికలు వార్త యొక్క ముఖ్యతనుబట్టి ఎన్నికాలంలో నిర్ణయించాలి డాక్టరూ! కాలంలే కాదు, ఆ శీర్షిక అక్షరాల సైజూ నిర్ణయించాలి.

డాక్టరు: ఆ విషయాలన్నీ ఈనాటి పత్రికలన్నింటిలోనూ చూస్తూనే ఉన్నాము ఇక తామేమిటి, కొంటె కోనంగేశ్వరరాయ బహదూర్ వారూ సెలవిచ్చేది? తమ అద్భుతమయిన, అతి నవీనమయిన -

కోనంగి: అతివిచిత్ర, చిత్ర, పరమ మాధుర్య, అశనిపాతయిక, గంభీరాతి గంభీర, అనర్గళ, హృదయబాంబు సంఘాత విధానం ఏదీ? అని అనబోతున్నావు!

డాక్టరు: నేనలా అనబోలేదు! నేను -

కోనంగి: అలాంటి అర్థం ఇచ్చే మాటలే అనబోయావు!