పుట:Konangi by Adavi Bapiraju.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సహాయమౌతుంది. ప్రజలలో దాగివున్న మూగబాధలను గంభీరకంఠమై, ఒత్తించుకు తిరిగేవ్యక్తుల, సంస్థ, ప్రభుత్వాల నిలిపి నిలిపి వారివారి ధర్మాలు వారికి బోధిస్తుంది.

“పత్రిక ఒక అద్భుతమయిన లలితకళాసంస్థ, శిల్పము, చిత్రలేఖనము, సంగీతము, నాట్యము, కవిత్వము ప్రజలకు అందుబాటు చేస్తుంది. అవి ఉత్తమంగా అనుభవించే విధానం నేర్పుతుంది.

“తానే ఒక లలితకళ అవుతుంది. ఆనందం సమకూరుస్తుంది. ఒక చిత్రమౌతుంది. శిల్పమౌతుంది. ఒకపరమ మాధుర్య గీత మౌతుంది. విచిత్రమూర్చన అవుతుంది. కథానిక అవుతుంది. హృదయాలను కదల్చివేసే నాటిక అవుతుంది.

“ఈ మధ్య జరిగిన పెరల్ హార్బరు ఒక విషాదాంత నాటిక. ఈ నాటికకు సూత్రధారుడెవరు, నాయకుడెవ్వరు, ప్రతినాయకుడెవ్వరు, ఇవన్నీ పత్రికలలో ఎంత హృదయోద్రేకముగ వర్ణించబడ్డాయి! టోజో ప్రతినాయకుడు. రావణునికన్న, హిరణ్య కశ్యపునికన్న, ఇయాగోకన్న దుర్మార్గుడు. ధ్వనిగా, వాచ్యంగా ఈ కావ్యం పత్రికలు వివిధ వ్యక్తిత్వాలుగా ప్రచురించాయి.

“ఇది మా పత్రిక! ఆంధ్రదేశంలో ఈమెను ఒక వ్యక్తిత్వంగల మహత్తర సంస్థగా చేయదలచుకొన్నాము.

“మేము ఏ పార్టీకి చెందము. భారతదేశానికి పదహారణాలూ స్వరాజ్యం కావాలని వాదిస్తాం. అందుకు మేము నడుంకట్టుకొని పోరాడుతాము.

“మేం ఆంధ్రులం. మా పత్రిక సంపూర్ణంగా ఆంధ్రుల బిడ్డ! ఆంధ్రరాష్ట్రం లోటూ పాటూ లేకుండా పూర్తిగా బీహారు, ఒరిస్సా, సింధు, సరిహద్దు, అస్సాంరాష్ట్రాలవలె రావలసిందే. రావడానికి మా సాయశక్తులా ప్రయత్నిస్తాము.

“ఇదిగో ఇదే మా ప్రథమ పత్రికా పుష్పం. ఇది పారిజాతంలా నిత్యయౌవనంతో, నిత్యపుషితయై, వాడని పుష్పాలు దేశానికి అర్పించడానికి అవతరించింది.

“ఆనాటి పారుజాతం, కృష్ణావతారం అవగానే స్వర్గానికి వెళ్ళిందట. మాది ఆంధ్రదేశంలో అనంతంగా ఉండిపోతుంది. ఆంధ్రులకు సేవ చేస్తుంది. ఆంధ్రలోకము మము గాఢప్రేమతో ఆదరిస్తారని మా సంపూర్ణనమ్మకం.

ఇది తన మొదటిరోజు సంపాదకీయాలలో రెండవ సంపాదకీయం. అది మళ్ళీ చదువుకొంటూ, దంచివేశామురా ఆంధ్ర సోదరా అనుకున్నాడు.

దైనందినమూ “ఆంధ్రరాష్ట్రం ఎందుకు కావాలి?” అను శీర్షిక ఒకటి పెట్టి ఆంధ్ర దేశంలోని పెద్దలూ, పిన్నలూ, ఆంధేతరులయిన పెద్దలూ, చిన్నలూ అందరి వ్యాసాలు ప్రచురించడం సాగించాడు. ఆ వ్యాసాలకు వ్యక్తినిబట్టి, వ్యాసం తూనికనుబట్టి పారితోషికాలు పంపించడం సాగించాడు.

“ఆంధ్రులు రాజకీయంగా ప్రత్యేక రాష్ట్రం పొంది తీరాలి” అన్న మొదటి వ్యాసం ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు ఆధ్యక్షులు వ్రాశారు. “ఆంధ్రులు ఆర్థికంగా ఆంధ్రరాష్ట్ర విజయ నిర్వహణ చేయగలరు” అన్నది రెండవరోజు వ్యాసము. మూడవ సంచికలో “ఆంధ్రతేజం” అన్న శీర్షిక క్రింద ఆంధ్ర కవులలో నవ్వులలో పెద్దలూ, పెద్దలలో నవ్వులూ, నవ్వులలో నవ్వులూ, పెద్దలలో పెద్దలూ, పద్యాలూ, పాటలూ వ్రాసినవి ప్రచురించాడు.

“వ్యవసాయంలో ఆంధ్రదేశం భారతదేశానికి శిరస్సు” అని ఉపకార వేతనం పుచ్చుకుంటున్న ఒక పెద్ద ప్రభుత్వ వ్యవసాయోద్యోగి వ్యాసం వ్రాసినాడు.