పుట:Konangi by Adavi Bapiraju.pdf/221

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

“ముచికుంభత అంటే సీరియసనెస్ తెలిసిందా? మా తంజావూరు ప్రాంతంలోనూ, రాయలసీమలోనూ ఇది విరివిగా వాడతారే. మీ కృష్ణా గోదావరీ వాళ్ళకు తెలుగు రాదేమిటండీ?”

“ఎంతదెబ్బ కొట్టావు జ్యోత్స్నాదేవీ!”

“ఈలా చూడండి! మీ ప్రేమ ఇంత పరమాద్బుతమై నన్ను ముంచెత్తుతోంది, చివరకు నా స్వాతంత్ర్యం లేకుండా నన్ను వట్టి బానిసనుగా చేసుకుందామనా? అప్పుడే సగం బానిసనయిపోయాను స్వామీ!”

“నేను నీకు బానిసను, మరీ బానిసను, ఏ మాత్రమూ వంపూసోంపూ లేని బానిసనయిపోయాను.”

“మనిద్దరికీ ఇక స్వాతంత్ర్యం లేదా?”

“లేదు! లేదు! ముమ్మాటికీ లేదు!”

9

కోనంగి: డాక్టరూ! హిట్లరు మాస్కోను ముట్టడించాడు. మాస్కో పని ఏమవుతుంది? డాక్టరు: లెనిన్గ్రాడును పట్టుకోగలిగాడా? కోనంగి: లేదుకాని, రష్యావారిని ఓడించగలడా?

డాక్టరు: వారు తలక్రిందులయ్యేది, ఓడించలేడు. ఎందుకంటావా? రష్యా ప్రజలతో, వారి భావాలతో, ఆశయాలతో, హృదయంతో వీరు దెబ్బలాడాలి. జర్మనీవాళ్ళు అతి మిలిటరీవాళ్ళు. అతి మిలిటరీతనం మొదట విజయం సమకూర్చినా, చివరకు నాశన మయిపోతుంది. అదేగాదు, రష్యా ప్రజలతోనేగాక ఆ నాజీగాడు రష్యాతోనే యుద్ధము చేయాలి. అంటే, దేశం శత్రువు. యుద్ధయాత్ర చేయడానికి అనువయిన దేశంకాదు. దేశం పెద్దది, అనంతమైనది. దేశంలో ఏకాలం వచ్చినా, అత్యంతమయిన మార్పుతో వస్తుంది. జర్మనీ చుట్టూ కొండలు ఉండడంవల్ల జర్మనీవాళ్ళు భయంకరమైన శీతాకాలాలు ఎరుగరు. రష్యా శీతాకాలం రష్యావాళ్ళకు స్నేహితుడు. వాళ్ళకు ముఖ్య సేనాపతి.

కోనంగి: ఏమో బాబూ! నీ మాట నిజమయితే లోకానికి కళ్యాణం, నాకు అంతకన్న. అంతకన్న 'మహాత్మునివాదమే జగద్రక్షకరము' అన్నభావము నిశ్చయమయి ప్రత్యక్ష మౌతోంది. అందుకని హింసాత్మక తరగతిలో ఫస్టుమానిటర్ అయిన జర్మనీ సంపూర్ణముగా ఓడిపోతే, ఇకనేముంది! లోకంలో రెండవపాఠం నేర్పబడిందన్నమాటేగా!

డాక్టర్: ఒకవైపు అహింస అంటావు. ఒకవైపు రష్యా జర్మనీని నెగ్గాలంటావు. నీకు మతిపోతోందా?

కోనంగి: మాటల వెనకాల ఉన్న భావధ్వని తెలుసుకోలేని నీమెదడు మెత్తబడిందేమో నాయనా! కాస్త ధారా వైద్యం చేయించుకో.

డాక్టర్: ఏమిటా పిచ్చిధ్వని?

కోనంగి: లోకానికి ఎప్పటికన్నా ఉత్తమమార్గం అహింసా, సత్యాలే. ఈలోగా హింసామార్గం అవలంబించిన రెండుదేశాల విషయం ఆలోచిస్తే, ధర్మం ఎవరిపక్షం ఉందో వాళ్ళవైపు మొగ్గుతుందని నాబోటి వాళ్ళ హృదయం!

డాక్టర్: నీబోటివాళ్ళ హృదయాల విశిష్టత ఏమిటి నాయనా?