పుట:Konangi by Adavi Bapiraju.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని పాడుకుంటూ నడిచాడు, నడిచాడు. రెండు బస్సుస్టాండు లయ్యాయి: ఎక్కడా బస్సు దొరకలేదు. ప్రతిబస్సు ఆగేస్థలం దగ్గిరా పదిహేను నిముషాలకు తక్కువ కాకుండా నిలిచాడు, కోనంగి. బస్సు రాకపోవడం, అతడు నడుద్దాము, రెండు అణాల డబ్బులు మిగుల్తాయి అని బయలుదేరడం, దారిలో ఈతన్ని ఓ బస్సు దాటిపోవడం జరుగుతూ వచ్చింది. చివరకు ఈ మూడవస్థలం దగ్గిర, అంటే లజ్లో, మొదటిదాని దగ్గర ఆగిపోయినాడు.

ఇక్కడైనా తాను బస్సుతో దెబ్బలాడి విజయం పొందాలి. ఈలా ఈ యుద్ధం రోజుల్లో ఈ 1939 సంవత్సరంలో ఒక నవయువకుణ్ణి - బస్సులు అన్యాయం చేయడం తగనిపని అనుకుంటూ అక్కడ ఉన్న ఒక పెద్ద బంగాళా ముందు ఉన్న గేటుకుముందు అలంకారానికి కట్టిన ఏనుగుపైన అధివసించి, నేను ఇంద్రుణ్ణి కావచ్చు, పట్టపుటేనుగ ఎక్కి ఊరేగే మహారాజును కావచ్చు, టార్జాన్ ను కావచ్చు, లేదా వట్టి మావటివాణ్ణి కావచ్చును, అనుకుంటూ ఉండగా కారులైట్లు తనమీద పడ్డాయి.

బస్సు కాదని నిర్ధారణ చేసుకొని కాస్త వయ్యారంగా ఆవరణగోడకు అనుకొని, కాలు ఒకటి వేసివున్న గేటు తలుపునకు, ఒకటి ఏనుగు తొండానికి ఆనించి ఏవరిదో ఈ అందాలమేడ అని ప్రశ్నించుకొన్నాడు. ఇది ఒక హైకోర్టు జడ్జిది కావచ్చు. మదరాసు జిల్లా కలెక్టరుగారిది కావచ్చు. ఆడ్వొకేటుది కావచ్చు. ఒక వర్తకునిది కావచ్చు. ఒక సినిమాస్టారుది కావచ్చు. గేటుదగ్గిర చప్రాసీలేడు, జడ్జిదికాదు, కలెక్టరుది కాదు. పార్టీలు నడయాడుటలేదు, అడ్వొకేటుది కాదు. మూర్కావాడు కాపలాలేడు, సినీమాతారదికాదు. అయితే వర్తకునిదో లేక ఖాళీగా ఉందో, ఖాళీగా వుంటే లోపల జనం అలికిడి ఉంది, అన్న ఆలోచనలలో కళ్ళుమూసుకొని కలలు కంటున్న అతని కంటి మీద నుంచి కాంతి గలిగిన వెలుగు పడడం, బుర్రుమని గుండెలదిరేటంత చప్పుడవ్వడం ఒక్కమాటుగా జరిగింది.

ఉలిక్కిపడి, అదిరిపడి ఒక్కగంతున ఉరికి లేచాడు కోనంగేశ్వరరావు.

“ఎవరయ్యా! దారికడ్డంలే, నాటుపురం మనిషిలా ఉంటివే!” అన్న కిన్నెరస్వనము.

“నేను నాటుపురంవాళ్లే! నాటుపురమేకాదు కన్నాటుపురం కూడా నాది!”

“కన్నాటు అంటే!"

“కళ్ళుమూసుకు కలలు కంటున్న నాటుపురంవాణ్ణి. అందుకని కన్నాటు పురంవాణ్ణి.”

కిలకిల, వీణపంచమతీగెను పంచమం మీటితే వచ్చిన కాకలీనిస్వనపు నవ్వు కారులోంచి వినపడింది.

ఈ మాటలకు ముందే గేటు తెరవడం, బస్సురావడం బర్రుమని వెళ్ళిపోవడమూ జరిగినవి.

"అయ్యో! మీ కారువల్ల నా బస్సు తప్పిందండీ!” అంటూ కారు ముందు నుంచి కోనంగిరావు కారు డ్రైవరు వైపుకు వచ్చాడు. కారుడ్రైవరు ఒక బాలిక. వీధి దీపాల వెలుతురు మాత్రం ఆధారం. అందులో వెలుగు లోంచి వచ్చాడు. డ్రైవరు ఘుమఘుమ మంటే, కళ్ళు చిట్లించుకొంటూ కోనంగి డ్రైవరువైపు పారకించి చూస్తే, ఆ డ్రైవరుగారు అస్పష్టంగా కనబడే ఒక చక్కని బాలికలా కనబడింది!