పుట:Konangi by Adavi Bapiraju.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“దావాలు గీవాలు వేయకండి. నాకు కోర్టులంటే హడలు. రెండో పాట పాడరూ!”

“ఏ తపస్సు చేసినానో

ఏ అదృష్టము పొందినానో

నీవు దర్శనమిచ్చి నావూ

నిత్యశోభాంగీ!

మధురకంఠీ! మసృణాండీ!

మామకీన విజృప్తజన్మము

నిండు చేసిన నిర్మలాత్మా

నీవటే దేవీ!

చూపవేమే సకలలోకము

చూపవేమే ప్రజాహృదయము

సుప్తి ఎరుగని మానవార్తిని

చూపవే దేవీ!

“నేనో ప్రశ్న అడుగుతాను, భావికవిత్వపు జవాబు చెప్పక నిజం చెబుతారూ!”

“భావికవిత్వం అబద్దమనా?”

“భావికవిత్వం నిజానికి అతీతమని మీరేగా అన్నారు.”

“అంటే ఏమని నీ ఉద్దేశం?”

“ప్రాపంచిక సత్యం, అర్ధసత్యమూ పావుసత్యమూ మాత్రమేకాని భావసత్యము ఆనంత సత్యానికి దగ్గర అని మీరన్నారు.”

“అవును అన్నాను.”

“అయితే అనంత సత్యం ఏమిటి?”

“నీ సత్యం !”

“పోనీ లెద్దురూ! ఉండండి నా సత్యం మీరే!”

“నువ్వు నా సత్యానివి!”

“సరే లెండి చాలా బాగుంది. అనంత సత్యమేమిటో చెప్పండి.”

“అనంత సత్య మేమిటో నాకు తెలియదు. శాస్త్రవేత్తలు సృష్టికి పునాది ఎలక్ట్రానా, ఇంకా ఏమన్నానా తేల్చలేదు ఇంకా! అయినా ప్రాథమిక రూపంలో వస్తువులను ముక్కలు చేస్తే వాటి ఆధారం ప్రోటానుల ఆ ఎలక్ట్రానుల కలయిక అని మాత్రం తెలుసుకున్నారు. అది అంతవరకు సత్యం. అయినా ఈ చిన్న చిన్న సత్యాల వెనుక నిజమయిన సత్యం ఒకటి ఉంది అని వారు గ్రహించారు. అదేమిటో వారికి తెలియదు. అది రావసత్యం. ప్రాపంచికమైన సత్యాలు, ఇంకా ఒక లక్ష ఇతర రకం సత్యాలూ వీని అన్నింటి వెనకా ఏదో ఒక సత్యం ఉంది. అది అనంతసత్యం!”

“మీరు లెక్కలు మాట్లాడుతున్నారే!”

“అయితే లెక్కల ప్రకారం నా కివ్వవలసిన ముద్దుల బాకీ నాకిచ్చేయి.”