పుట:Konangi by Adavi Bapiraju.pdf/210

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

“సిగ్గులేని పిల్లా! రైలు వింటుంది.

ఓసి దివ్యప్రేమమయీ!

ఓసి లోకానంతమూర్తీ!

నిన్ను ప్రేమించి నిజమెరిగినవాడనే

నీలోన వివసించు నఖిలలోకమ్మంచు

ఓసి అమృతమందాకినీ!

ఓసి ఆనందవారాసి!

నిను నే కాంక్షించి, అరిబాధితప్రజా

కాంక్షలన్నీ లోన కరగించుకొన్నాను.

ఓసి వేదనాభరితాత్మ!

ఓసి పరమకరుణార్దితా!

నిన్ను నే పూజించి నిండించుకొన్నాను

మనుజు మనుజుల మధ్య మండేటి ద్వేషమ్ము

ఓసి పూర్ణసౌందర్యాంగి!

ఓసి లావణ్య తేజస్వి!

హృదయాన నిను పొదివి మది తెలుసుకొన్నాను

దేశ దేశప్రేమ దేశాల శాంతియని!”

అతని పాటా ఆ పాటా తాళమూ వేగంగా పోయే రయిలు చక్రనినాదంతో శ్రుతులయ్యాయి. అనంతలక్ష్మి భర్త దగ్గరగా, ఇంకా దగ్గరగా ఒదిగి “నన్నిలా మీరు నానామాటలు అనవచ్చునా? ఈ పాట నామీద వ్రాసినారని లోకం అంతా ప్రచారం ఏమనుకుంటారు?”

“కోనంగి వట్టి పిచ్చివాడని!”

“ప్రజల మొగం చూడడానికి నాకు సిగ్గు అవదండీ గురువుగారూ?”

“ఎందుకూ?”

“అందరూ మీ పాట చదివి, ఆ పాట ఈ అమ్మాయిమీదే వ్రాశాడు కోనంగికవి అని అనుకుంటూ నన్ను తేరిపార చూడరూ!”

వట్టి తేరిపార చూడడమా? ఈమె కోనంగి గీతానాయిక అంటూ తండాలుగా వచ్చి నీ మెళ్ళో ఇన్ని దండలువేసి ఊరంతా ఊరేగించి పెద్ద మీటింగు చేసి, అనేక వినతిపత్రాలు, నవరత్నాలు, తారకామాలలు అర్పించి కృతిసమర్పణలుచేసి, పట్టుచీరెలు, పట్టురెవికలు బహుమతు లివ్వరూ! అప్పుడు నువ్వు నాతో మాట్లాడుతావా ఏమన్నానా?”

“చాటునుండే ఎంకి

సభకు రాజేశావ

పదిమంది నోళ్ళల్లో

పడమంట రాశాడ!”

అని ఎంకెన్నట్లు అల్లా నామీద పాటలు వ్రాస్తారా మీరు? న్యాయమా చెప్పండి?”

“వట్టి అన్యాయం. శుద్ద అన్యాయం. నీ మొగుణ్ణయిన నేను కవి అయిన కోనంగిమీద రామప్పంతులులా డామేజీ దావా పడేసి డొక్కచీలుస్తాను.”