పుట:Konangi by Adavi Bapiraju.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంతట్లో కోనంగితోపాటు, దుక్కిటెద్దుల సినీమాలో అభినయించిన వారూ, దర్శకుడూ, కళాదర్శకుడూ, సంగీత దర్శకుడూ, ముఖ్యతారా మొదలయినవారు పదిమంది కోనంగిని చూడటానికి వచ్చారు.

కోనంగిరావూ, డాక్టరు రెడ్డి విడుదలయ్యారన్న వార్త ఆ ఉదయం పత్రికలలోనే వచ్చింది!

4

కోనంగి జైలునుంచి వచ్చిన పదిహేనురోజులు అమృతపక్షమే ఆ యవ్వన దంపతులకు! ప్రేమ మహాసముద్రము అంత గంభీరము! అంత ఆనందకల్లోలపూరితము! అంత అవధి రహితము!

కోనంగి బందరు వెళ్ళేందుకు మెయిలుబండిలో మొదటి తరగతి రెండుసీట్ల కంపార్టుమెంటులో ప్రయాణంచేస్తూ, అనంతలక్ష్మిని తన ఒడిలో ఒదిగించుకొని పడమట వైపుకు వాలే పంచమి చంద్రవంకను భార్యకు చూపిస్తూ “అనంతా! నీ జీవితరహస్యం తెలుసుకోవాలంటే, నీ ప్రేమ మాహాత్మ్యభావం అర్థం చేసుకోవాలంటే, ఆ చంద్రవంకను ఉపాసిస్తూ వేయేళ్ళు తపస్సు చేయాలి” అన్నాడు.

“తపస్సు చేస్తే?”

“అర్థం అవుతుంది!”

“ఏది?”

“నీ ప్రేమ!”

“నా ప్రేమ అంత అర్థంకానిదా?”

“అవును!”

“నా జీవిత రహస్య మేమిటి? నా జన్మలో మీకు తెలియని రహస్యాలు లేవే!”

“రహస్యంలేని నీ జన్మ యావత్తూ రహస్యాతీతమైనది.”

“రెండూ ఒకటేనా?”

“రెండూ ఒక టేల్లా అవుతాయి? ఒకటి నీ జీవితమార్గం నిష్కల్మషమయినదనీ, రెండవదాని అర్థం నీ జన్మ ఏదో పరమశ్రుతి నర్థించి వచ్చిందనీ!”

“మీబోటి గురువుగారిని పిల్లి అంటే అర్థం ఏమిటని అడిగినాడట ఒక శిష్యుడు. ఆ గురువుగారు మార్జాలము అని జవాబు చెప్పినాడట. ఆ కుర్రవాడు ఆది విని అదేదో పెద్దజంతువో ఏమిటో అని కళ్ళు పెద్దవి చేసి కూర్చున్నాడట.”

“అనంతలక్ష్మి! నీమీద వ్రాసుకొన్న ఈ మూడుపాటలూ విను! ఇవి పారిపోయే కవిత్వం అయినా నాకు భయంలేదు. వ్యక్త్యానందంలోంచి, ఆ వ్యక్తియొక్క లోకసేవాగాఢరక్తి ఉద్భవిస్తుంది. ప్రేమరహితునకు మానవ సేవాభావమే అర్థంకాదు.”

“పారిపోయే భావం ఏనమిటి?”

“మన ఇద్దరి స్థితి”

“మీ పాటలు పాడరూ! అవి నాకు నచ్చాయా మీకు ఎన్ని ముద్దులన్నా బహుమానం ఇవ్వగలను.”