పుట:Konangi by Adavi Bapiraju.pdf/208

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అల్లుడూ కలసి సత్యనారాయణవ్రతము చేసుకొనడానికి కావలసిన సరంజాములు చేస్తూ ఉన్నది.

మేడంతా కలకలలాడిపోతూ ఉన్నది. జయలక్ష్మి, అనంతలక్ష్మి గది గుమ్మం దగ్గరకు వచ్చి “అమ్మిణీ! అల్లుడుగారికి స్నానానికి ఏర్పాటయినది” అని తెలియపర్చెను,

సోఫా కుర్చీమీద కూర్చున్న కోనంగీ, అతని ఒడిలో ఒరిగి ఉన్న అనంతలక్ష్మీ ఒకరి కౌగలింతలో ఒకరు కరిగిపోతూ, చుంబన మహాంబుధిలో మునిగిపోయి ఆ ఇద్దరూ ఉలిక్కిపడి లేచినారు. కోనంగి “వస్తున్నాను అత్తగారూ” అని ప్రతివచనంగా కేక వేసి అనంతలక్ష్మిని ఇంకొక సారి దీర్ఘ చుంబనము వరం పొందినాడు. ఇద్దరూ లేచినారు.

స్నానం ఒనర్చి కోనంగి శుభ్రవస్త్రాలు ధరించి హాలులో కూర్చుండి తన్ను చూడడానికి వచ్చిన అయ్యంగారు బావగారితో, ఇతర బందుగులతో కబుర్లు చెప్పుకుంటూ, వీళ్ళింకా త్వరగా వెడితే బాగుండిపోనురా అనుకుంటూ కాలం గడిపాడు.

కోనంగి: అనంతం, నువ్వు నెమ్మదిగా ఆంధ్ర భోజనం అలవాటు చేసుకోవాలి.

అనంతం: మీ ఖారం నేను తినలేను బాబూ!

కోనంగి: నువ్వు తినడానికి కాకపోయినా, నా కక్కరలేదా ఏమిటి?

అనంతం: ఏమిటి? కోనంగి: గోంగూరపచ్చడి?

అనంత: అవునండోయి, నా చిన్నతనంలో, వందేమాతరం బొమ్మ చూచాను. ఆంధ్రుల్ని గోంకూరలు అంటాడు రాజాబహదూరు.

కోనంగి: అరవల్ని మావాళ్ళు సాంబారుగాళ్ళు అన్నట్లు.

జయలక్ష్మి: మేము అరవవాళ్ళము కాము అల్లుడుగారూ!

కోనంగి: కాకపోతే ఏం! అరవదేశంలో ఉండి ఉండి అరవ భోజనం అలవాటు చేసుకున్నారు మీరు.

జయలక్ష్మి: మా యింట్లో అయ్యంగారు వంటాయనకదా మరి?

కోనంగి: అందుకనే అంటున్నాను. మా గోంగూర మా పచ్చళ్ళు, మా పులుసులు, మా ఆవకాయ, మాగాయ, మెంతికాయ, మా కొరివి ఖారం, మా కూరలు రుచి చూస్తే వదులుతారు మీరు! మా పచ్చిపులుసుల మజా మీకేం తెలుసు?

అనంతం: మా కవన్నీ ఎల్లా తెలుస్తాయండీ?

కోనంగి: నాతో బందరు వచ్చే నేర్చుకుందువుగాని!

జయలక్ష్మి: బందరెందుకు స్వామీ?

కోనంగి: కోడలు అత్తగార్ని చూడవద్దా?

జయలక్ష్మి: మా వియ్యపురాలుగారే యిక్కడకు వస్తే బాగుంటుందేమో!

కోనంగి: మొదట మే ఇద్దరం బందరు వెళ్ళి మా అమ్మను లాక్కురావడానికి ప్రయత్నం చేస్తాము.

అనంతం: తప్పకుండా వెడదామండీ గురువుగారూ!

కోనంగి: అవును అనంతం! ఆంధ్రదేశానికి కోడలివి నువ్వు. రాజ రాజనరేంద్రుడు చేసినట్లు నిన్ను మా దేశానికి తీసుకువెళ్ళి చూపిస్తాను.

భోజనాలయ్యాయి. కోనంగీ అనంతం తమ గదిలోనికి పోయినారు. అనంతం భర్త వద్ద కూర్చుండి భర్తకు తాంబూలం ఇస్తూ ఉంది. కోనంగి ఒక్కొక్క ఆకుచిలక ఆమె నోటికి అందిస్తున్నాడు.