పుట:Konangi by Adavi Bapiraju.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముచ్చటించుతూ నిలుచున్నారు. వారితో మాట్లాడుతూనే, డాక్టరు రెడ్డి కోనంగి, ఆనందము; అనంతలక్ష్మి అందరినీ చూస్తూ చిరునవ్వు నవ్వుకొన్నాడు.

కోనంగి రెండడుగుల్లో డాక్టరు రెడ్డి దగ్గరకు వెళ్ళి అక్కడ వుండే వారందరికీ నమస్కారాలు చేసి రెడ్డిని తన వాళ్లున్న చోటికి లాక్కొచ్చాడు.

అనంతలక్ష్మి, జయలక్ష్మి మొదలగు వారందరు డాక్టరు రెడ్డిగారికి నమస్కారాలు చేశారు, జయలక్ష్మి “డాక్టరుగారు! మీరూ కోనంగిరావుగారూ యిద్దరూ చిక్కేరండి ఎలాగైనా జయిలు.....” అంది.

డాక్టరు: (నవ్వుతూ) మనం యివతల ఉంటే అనవసరంగా తిని కొవ్వులు పెంచుకుంటాం. జైల్లో అవసరమయిన తిండీ, ఒళ్ళు దిట్టంగా గట్టిపడడం, మంచి ఆరోగ్యం.

కోనంగి: ఇక యిక్కడ నుంచి ఎవరికైనా జబ్బుచేస్తే, మా డాక్టరు మూడు మోతాదులు జైలునివాసం మందిస్తాడు గావలెను?

సారా: ఓయి భగవంతుడా. అంత చేదుమందు నాకు మాత్రం చీటీ వ్రాసివ్వకండి డాక్టరుగారూ. నేను మాత్రం కొవ్వు జబ్బు తెప్పించుకోదలచలేదు.

అనంతలక్ష్మి, ఆమె స్నేహితురాండ్రు అంతా నవ్వారు. కబుర్లు చెప్పుకుంటూ అందరూ, టిక్కెట్టు కలెక్టరుకు టిక్కెట్లు యిచ్చి వంతెనమీద నుండి కారుల దగ్గరకు వచ్చారు. డాక్టరు రెడ్డిగారు అందరి దగ్గర సెలవు తీసుకొని, తన స్నేహితులతో కలసి కారుమీద యింటికి వెళ్ళి పోయాడు.

కోనంగి, అనంతలక్ష్మి, జయలక్ష్మి మొదలయినవారంతా వాళ్ళకార్లలోనూ, వాళ్ళ టాక్సీలలోనూ యింటికి వచ్చారు. రాగానే జయలక్ష్మి లోపలికి పరుగెత్తుకు వెళ్ళి తాను సిద్ధంచేసి వుంచిన దృష్టిదోష పరిహారపు వస్తువులు తీసుకువచ్చి అనంతలక్ష్మికి, కోనంగికి దృష్టితీసి లోపలికి వెళ్ళి పోయింది.

8 సారా, పార్వతి, అంబుజమూ, అలమేలూ అందరూ హాలులో సోఫాలమీద కూర్చొని కబుర్లు సాగించారు. కోనంగి, అనంతలక్ష్ములు వారిగదిలోకి వెళ్ళారు.

గదిలోకి వెళ్ళడమేమిటి, కోనంగి అనంతలక్ష్మిని తన హృదయానికి అదుముకొని తన సర్వస్వము పొదివికొన్న గాఢ చుంబనములో కరగి పోయినాడు.

“అనంతా!”

అనంతలక్ష్మి ఏమీ మాటలాడలేకపోయింది. ఆమె నవ్వూ, కన్నీళ్ళూ, ఆనందమూ, ఏదో పరమశృతి రూపమై అతని జీవితము ఆణువు అణువునా నిండిపోయినాయి.

అతని కన్నుల ఆనంద బిందువులు తిరిగి అతని చెక్కుల ప్రవహించినవి. అతడు మాటాడలేక అలాగే మళ్ళీ మళ్ళీ అనంతలక్ష్మిని హృదయానికి అదుముకొన్నాడు. అతడక్కడ వున్న సోఫాకుర్చీలో కూర్చుండి, అనంతలక్ష్మిని తన ఒళ్ళో కూర్చుండబెట్టుకొని హృదయాని కదుముకొన్నాడు. ఆమె అతని మెడచుట్టు చేతులు పెనవేసి అతనిలో ఒదిగి పోయింది.

అయిదు నిమిషాలు, పది నిమిషాలు, ఇరవై నిమిషాలు వారు మాట్లాడలేక పోయినారు. ఒక్క హృదయమై, ఒక్క మనస్పై, ఒక్క ఆనందమై, ఒకరై అతి వియోగానంతర సమయోత్తమ పునస్సమాగమ ప్రపంచాద్భుత సంఘటన ప్రేమీ ప్రేమిక చరిత్రలో కలిసిపోయినారు.

అనంతలక్ష్మి చెలులందరూ చల్లగా ఎవరి యిండ్లకు వారు వెళ్ళి పోయినారు. జయలక్ష్మి అల్లునికి రకరకాల వంటలు అన్నీ సిద్ధంచేస్తున్నది. ఆ మరునాడు కూతురూ,