పుట:Konangi by Adavi Bapiraju.pdf/206

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

“స్త్రీ ప్రేమ స్వార్థం. దేశప్రేమ పరమార్థం.”

“దేశ ప్రేమలో తాను ఉండడు? తనకు మాత్రం స్వరాజ్యం రాదు? ఓహెూ హెూ!”

రైలు గిండీ దాటింది. సైదాపేట దాటింది. త్యాగరాజనగరం దాటింది.

కోనంగి పకపక నవ్వుతూ డాక్టరు భుజంతట్టి “నువ్వు వట్టి ఉండు కవిత్వం వ్రాయి. నేను పారిపోయే కవిత్వం వ్రాస్తా.”

రైలు కోడంబాకం దాటింది.

చెట్ పట్ దాటింది.

మాట లేకుండా ప్లాట్ ఫారం వచ్చేవైపు కిటికీలోంచి కోనంగి తొంగి చూస్తున్నాడు.

3

రైలు ప్లాటుఫారంమీద జయలక్ష్మి. అనంతలక్ష్మి, ఆమె స్నేహితురాండ్రు, సేవకురాండ్రు, వినాయగంపిళ్ళె, అతని ఇద్దరి స్నేహితులు, ఆనందంనాయుడు, అతని కుటుంబం, అందరూ తిరువనంతశయనం ఎక్స్ ప్రెస్ బండికి సిద్దంగా ఉన్నారు. బండి ఆగింది. కోనంగి బండిలో నుంచి ఉరికాడు. రెండు ఆంగలలో కోనంగి. అనంతలక్ష్మి దగ్గరకు వెళ్ళాడు.

“అనంతా!”

“గురువుగారూ!” అస్పష్టంగా దగ్గుత్తికతో అనంతలక్ష్మి అన్నది.

ఇద్దరి కళ్ళూ మిలమిలలాడిపోయాయి. మోములలో ఏదో పరమ పవిత్రకాంతులు చంద్రికలై ప్రసరించినవి. ఒకరి నొకరు సర్వలోకమూ మరచి చూచుకొన్నారు. అందరూ కోనంగివయిపే చూపులు.

అయిదు నిమిషాలు వారిద్దరూ ఒకటిగా!

కోనంగి. అనంతలక్ష్మి స్నేహితురాండ్రను అందరినీ అతి సంతోషంతో పలుకరించాడు. అత్తగారి దగ్గరకు వెళ్ళి అత్తగారికి సమస్కరించి “అత్తయ్యగారూ!” అన్నాడు. జయలక్ష్మి కన్నుల ఆనందంతో రంగరించిన కన్నీళ్ళు తిరిగినవి. కోనంగి. వెంటనే వినాయగంపిళ్ళ వాళ్ళ దగ్గరకి పోయి అందరినీ చేతులు పట్టుకొని గట్టిగా నొక్కినాడు. ఆనందంనాయుడు దగ్గరకు వెళ్ళి కోనంగి “ఏమండీ బావగారూ, అంతా క్షేమమా?” అన్నాడు. పనివాళ్ళ నందరినీ పలుకరించాడు. ఇలా మాట్లాడుతూ కారు దగ్గరకు వెడదామని బయలుదేరే ముందు సారా ప్లాట్ ఫారం దగ్గరకు గబగబా పరుగెత్తుకొని వచ్చింది.

“హలో కోనంగిరావ్” ఆమె పలుకరిస్తూ కోనంగి దగ్గరకు వచ్చేటప్పటికి కోనంగి “హలో, సారా! బాగున్నవా?” అని ఆమెకు కరస్పర్శ చేశాడు, సారా పకపక నవ్వుతూ, యిదిగో మీ ఆవిడ ముఖం ఏం ప్రపుల్లమైపోయిందో చూసుకో. ఏమి నీలో చూచి మీ ఆవిడ యింత ముచ్చటపడి పోతోంది?” అన్నది.

“నేను లోకైక సుందరుణనిన్నీ, ఒక చిన్న గొప్ప నెపోలియన్ లాంటివాణ్ణనిన్నీ అనుకొని యీ వెర్రిబాగుల పిల్ల ఆనందంచేత ఆకాశం అంటుతోంది” అని అన్నాడు కోనంగి.

అవతల డాక్టర్ రెడ్డికోసం కమ్యూనిస్టు నాయకులు కొందరు, ఆయన చుట్టాలు కొందరు స్టేషనులోనికి వచ్చి ఉన్నారు. వారంతా డాక్టరుగారితో అనేక విషయాలు