పుట:Konangi by Adavi Bapiraju.pdf/205

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

“అదో వాదన. నా ఉద్దేశం పురోగతి వర్తులాకారం కాదనీ. ఆకాశంలోకి వెడితే తిరిగి తిరిగి మొదటి పోలికలు రావు. ప్రగతి పైకి ఉంటుంది. తమ జీవితం ఒక ప్రపంచగోళం అని అనుకున్ననాడు తిరిగి తిరిగి బయలుదేరిన చోటికే వస్తావు. ఇంక సోషలిజం ఎందుకు? సామ్యవాద మెందుకు? నువ్వు గడిచిన పథం మళ్ళీరాదు అని తెలిసికొని వెళ్ళితే ఎప్పుడూ ముందుకే విశ్వంలో. జీవితం ఒక భూగోళం కాదయ్యా!”

యూరపులో ఇంగ్లీషువారూ, ఇంగ్లండులో జర్మనులూ బాంబులు వేస్తున్నారు. పట్టణాలు నాశనమైపోతున్నాయి. ప్రజలు దూదిపింజలై ఎగిరిపోతున్నారు.

రైలు అతివేగంతో మీనంబాకం దాటింది. ఈ పక్కా ఆ పక్కా చెట్లూ చేమలూ, టెలిగ్రాఫ్ స్థంభాలూ అతివేగంగా వెళ్ళిపోతున్నాయి.

కోనంగి ఒక సిగరెట్టు వెలిగించాడు. లోగొంతుకతో తాను సినిమాలో పాడిన ఓ పాట పాడుకొంటూ చూడని చూపులతో కిటికీలోంచి సర్వప్రపంచమూ చూస్తున్నాడు.

“వెళ్ళుము రా ప్రియమూర్తీ!

వెళ్ళుము రా!

వెళ్ళుము నీవూ వేగపు నడకల

భళ్ళున తూర్పున తెల్లని రేకలు

తోచెను రా ప్రియమూర్తీ!

వెళ్ళుము రా!

కన్య బాలికా కలకంఠములో

గానామృతములు వానలు కురిసెను

అమృతమూర్తిర నీ చేడియ

వెళ్పుము రా!

డాక్టరు: ఆ పాటంటే నాకు కోపం.

కోనంగి: అయితే నా మీదా కోపమేనా?

డాక్టరు: నీమీదెందుకు?

కోనంగి డాక్టరు ఎదురు గుండా నిలుచున్నాడు.

“చూడబ్బాయి, నేనూ నా ప్రియురాలికోసమే తహతహలాడుతూ వెడుతున్నానుగా?”

“అయితే మాత్రం నీమీద కోపం ఎందుకు స్వామీ?”

“ఆ పాట నాకూ వర్తిస్తుందిగా!”

“అందుకనే ఆ పాటమీద కోపం నాకు.”

“నయమే! నీబోటి ఓ పెద్దమనిషి తన మొగంమీద కోపం వచ్చినప్పుడల్లా, ఎదురుగుండా ఉన్న అద్దం బద్దలుకొడుతూ ఉండేవాడట.”

“కాబోలు. అతి తెలివైనవాడే! అలాంటి కవిత్వంమీద కోపం నాకు.”

“ప్రేమకవిత్వం వట్టి ఎస్కేపిస్టు కవిత్వం అంటావు.”

“కాదా మరి?”

“దేశంమీద కవిత్వం? సామ్యవాదంమీద కవిత్వం? కూలీలమీద కవిత్వం?”

“అది నిజమయిన కవిత్వం! పారిపోని కవిత్వం!”

“నీకు దేశ ప్రేమ పారిపోనిదా? స్త్రీపై ప్రేమ పారిపోయేది గదా? గోధుమలు తింటే వేరా? అన్నం తింటే వేరా?”