పుట:Konangi by Adavi Bapiraju.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెట్టిగారికి కోనంగి, డాక్టరు రెడ్డి విడుదలై వస్తున్నారని తెలిసింది. ఆ రోజున అతని కోపం మిన్ను ముట్టింది. శుద్ద అరవంలో ప్రభుత్వాన్నీ, కమ్యూనిస్టులనూ, రష్యానూ బండబూతులు తిట్టేశాడు. తన అనుయాయు లందరూ చుట్టూ ముగి ఉండగా, ఇటూ అటూ పచార్లు చేస్తూ నిప్పులు కక్కుతూ, ఖడ్గరోముని గొంతెత్తి అరిచేశాడు. “వెధవ రష్యా ఎందుకు జర్మనీతో విరోధం పెట్టుకోవాలి? జర్మనీదాన్ని తగలవేసి, నాశనం చెయ్యాలి! కమ్యూనిస్టులు నాశనం అయిపోవాలి. గుండాలందరూ కమ్యూనిస్టులు. జర్మనీ ఈ కమ్యూనిస్టు రాక్షసుల్ని పిండి పిండి చేస్తుంది. చచ్చు బ్రిటిషు ప్రభుత్వం ఏం చేయగలదు? భాగ్యవంతుల పిల్లల్ని తగుల్కొనే ముండాకొడులంతా కమ్యూనిస్టులా? మళ్ళీ సినిమాలా వీళ్ళకు? పైత్తెకారి పయ్యంగళ్, నాయీగళ్.”

అతడు కోనంగినన్నా జయిలులో యుద్ధం ఆఖరు అయ్యేవరకూ ఉండేటట్లు చేయడానికి ప్రయత్నించాడు. కాని ఎందుకో ప్రభుత్వాధికారులు అది పెడచెవిన పెట్టినారు. అందుకు కారణం ఏమై ఉండునా అని అతడు ఆలోచించాడు. తన స్నేహితుడే, తన డబ్బు రుచి చూచిన ఒక పోలీసు ముఖ్యాధికారి, కొంచెం యెదురు తిరిగి తన్నే సన్నగా చీవాట్లు పెట్టినాడు.

2

ఎగ్మూర్ స్టేషను వస్తోంది అనగానే కోనంగి కూర్చోలేకపోయినాడు, నుంచోలేక పోయినాడు. కంపార్టుమెంటు అంతా కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నారు. యేమీ తోచదు. డాక్టరు చూచాడు, చూచాడు చిరునవ్వు నవ్వుతూ.

“కాస్త కంగారుపడితే ఎగ్మూరు స్టేషన్ త్వరగా వస్తుందనే నీ ఉద్దేశం?” అన్నాడు.

"రైలు కొంచెం వేగంగా వెడుతుందని ఉద్దేశం డాబుదొరా?”

“డాబుదొరంటే ఏడిసినట్లే ఉంది.”

“డాబుగా ఉంటే ఏడిసినట్లా? 'డాక్టరు' తెలుగులో 'డాకటరు” 'డాగతరు’ 'డాగుదొర' అవుతుంది. 'డాడు' అంటే ఇంగ్లీషులో తప్పు అర్థం వస్తుంది కాబట్టి 'డాబుదొర' అయింది.

“ఏమి సైకాలేజీ అండీ?”

“అది లాలీ గోవిందదాసుగారు కాదుగదా పొరపాటున?”

“లాల్టీ గోవిందదాసుగారి పూర్తి చరిత్ర నాకు తెలియదుగాని, తమరు ప్రేమజీ పిచ్చిజీగారులా ఉన్నారు.”

“ఒకరు ప్రేమ్ జీ అవడం మాటలా ఏమిటోయి? నీ బోటి హెూటలు జాతివాళ్ళకు ఏం తెలుస్తుంది?”

“హెూటలు జాతి వాళ్ళేమిటి?”

జీవితం అంతా హెూటళ్ళలో తినేవాళ్ళుంటారు. ఎరుగుదువా? వాళ్ళకు ఇల్లూ, వాకిలీ, భార్య, బిడ్డలు భావం ఉండదు. వాళ్ళు మనుష్యులు వెనక్కిపోవాలి అని వాదించే రకంవాళ్ళు. అంటే పశువులు, సరీసృపాలు, పురుగులు కావాలి అని వాదించే జాతి వాళ్ళు.”

“ఏమిటా కసి నీకు? మనుష్యుని ప్రథమస్థితి ఎలాంటిదో ఉత్తమస్థితీ అలాగే ఉన్నట్లు కనబడుతుంది. పురోగతి వర్తులాకారంగా ఉండి, చుట్టలు చుట్టులుగా పైకి పోతుంది. కోతీ మనుష్యుడూ ఒకటే పోలిక చాలా వాటిల్లో.”