పుట:Konangi by Adavi Bapiraju.pdf/202

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పెట్ట సంకల్పించారు. ప్రపంచాని కంతకూ ముప్పుతెచ్చే జర్మనీ ముందు నాశనమై పోవాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి సర్వసహాయం చేస్తామన్నారు.

ఆ వెంటనే భారతీయ కేంద్ర ప్రభుత్వంవారు కమ్యూనిస్టులను విడుదలచేయ తీర్మానించుకొన్నారు. కడలూరు జిల్లా జైలు సూపరింటెండెంటు డాక్టరు రెడ్డిగారినీ, కోనంగిరావుగారి జూలై 14-వ తారీకు ఉదయం తన ఆఫీసులోకి పిలిచి, “మీరు ఇద్దరూ, మీ కమ్యూనిస్టుపార్టీ వారితో ఏకీభవించి యుద్ధ విషయంలో ప్రభుత్వంవారికి సర్వ సహాయాలూ చేస్తారా?” అని అడిగాడు. ఆయన కమ్యూనిస్టుపార్టీ నాయకుల ఉత్తరాలు రెడ్డిగారికీ, కోనంగిరావుగారికీ చూపించారు. అందుపై రెడ్డిగారు తమ మాట్లాడుతూ తామెప్పుడూ ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేదనీ, తమకా ఉద్దేశమే లేదనీ, ప్రభుత్వం ఒప్పుకుంటే తాను ప్రభుత్వానికి సహాయం చేయడానికి సిద్దంగా ఉన్నాననీ, కోనంగిరావుగారు అసలు రాజకీయాలలో లేరనీ, ఉద్యోగార్థమైవచ్చి అందుకే ఎదురు చూస్తున్న యువకుడనీ, అతని వివాహంనాడే అరెస్టు చేసి తీసుకువచ్చారనీ చెప్పినాడు.

జయిలు సూపరింటెండెంటుకు వీరిద్దరినీ, వీరితోపాటు ఖయదులో ఉన్న ఇంకా కొందరు దక్షిణాది కమ్యూనిస్టులను విడుదల చేయవలసిందనీ, విడుదలయ్యే వారితో మాట్లాడి వారి భాషలు కనుక్కొని, వారిలో పైకి ఒక రకంగా, లోన ఒక రకంగా మాట్లాడేవారిని కని పెట్టి వారి విషయం ఇన స్పెక్టరు జనరల్ ఆఫ్ ప్రిజన్స్గారికి తెలియజేయవలసిందని ప్రభుత్వపు తాఖీదులు వచ్చాయి.

అందుచేతనే విడుదల ముందు అధికారి ఈ రకంగా మాట్లాడినాడు.

వెంటనే వారిని తమ తమ సామానులు సర్దుకోమన్నారు. కోనంగిరావుగారూ, డాక్టరు రెడ్డిగారూ జయిలులో స్నేహం చేసిన వారందరి సెలవు పుచ్చుకొని ఈవలికి వచ్చారు.

కోనంగికి కన్నుల నీరు తిరిగింది.

డాక్టరుగారూ, కోనంగిరావుగారూ, ఆ ఊళ్ళో భోజనం చేసి రాత్రి రైలెక్కి ఉదయానికి మదరాసు చేరారు. అదివరకే ఫలానా బండిలో వస్తున్నామని జయలక్ష్మికి, అర్జంటు టెలిగ్రాం యివ్వడంవల్ల అది రాత్రే అందింది. ఇంక జయలక్ష్మికీ, అనంతలక్ష్మికీ కలిగిన ఆనందం ఇంతింతని కాదు. కన్నీళ్ళు కన్నీళ్ళలో నవ్వులు, అనంతలక్ష్మి నాట్యం చేస్తూ లోపల “వస్తాడే మా బావ!” అనే పాట పాడుకుంది. ఇద్దరూ ఏదో ఇల్లంతా సర్దడం. ఊరకే ఆటూ తిరగడం.

అందరూ చేరి కబుర్లు చెప్పుకుంటూ అతిసంతోషంగా కాలం వెళ్ళబుచ్చుతున్నారు. అనంతలక్ష్మికి ఏమీ తోచలేదు. కాలం జరగదు. కారు వేసుకొని ఇద్దరు ముగ్గురు స్నేహితురాండ్ర ఇండ్లకుపోయి. వాళ్ళను గట్టిగా కౌగలించుకొని “వస్తున్నారు! వారు వస్తున్నారు! కోనంగిరావుగారు వస్తున్నారు! నిన్ననే విడుదలై వస్తున్నారు. యుద్దము మూలాన రైళ్ళు లేక రాత్రి రైలుకు బయలుదేరి వస్తున్నారు. ప్రొద్దునకే వస్తారు!” అని చెప్పింది. వాళ్ళు ముగ్గురూ అంబుజం, పార్వతీ, అలమేలూ అందరూ ఆ రాత్రికే అనంతం ఇంటికి వచ్చారు.

ఎవ్వరికీ నిద్రపట్టదు. అందరూ అనంతలక్ష్మిని వేశాకోళాలతో వేపేశారు.