పుట:Konangi by Adavi Bapiraju.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదిగూడపంచెకట్టి, బనీనుతో కోనంగి వరండాలో పడుకుని చంటిపిల్లవాడిలా నిద్రపోయాడు. మరునాడు స్నానాదికాలు కానిచ్చి, భోజనంచేసి ముస్తాబై రౌండుతానా దగ్గిర దిగాడు. (అది ఇప్పుడు లేదు. పేరు మాత్రం మిగిలింది.)

అక్కడ నుంచి ఉద్యోగానికి ప్రయత్నం ప్రారంభించాడు కోనంగి. స్త్రీవల్ల ధనలాభం ఏమిటి? తనకు ఉద్యోగం ఎలా వస్తుంది? అని అనుకున్నాడు. ఏదో వెట్టివాడు తన స్నేహితుడు 'చెయిరో' 'బెర్గసన్' వగైరా పుస్తకాలు చదివి, చేతికి ఇంత తారుపూసి, ఓ కాయితం పాడుచేసి, మూడు గంటలు తబ్బిబ్బై నాలుగుముక్కలు చెప్తాడు. అయినా ఎన్ని సరి అవుతున్నాయి? ఏ శాస్త్రంలో ఏముందో! దేవతలు నడవడానికి భయపడే ప్రదేశాలలో తానా నాట్యం ఆడడం!

“ఏం ఉద్యోగం?... యుద్ధంలో చేరరాదూ?” అని ప్రతి కంపెనీ మేనేజరూ అనడమే. చీకటి బజారులలో లక్షలు లాభాలుకొట్తు తనొక్కడికి ఉద్యోగం ఇవ్వలేరు కాబోలు?

ఒకచోట మాత్రం అతనితో ఒకాయన కొంచెం శాంతంగా మాట్లాడాడు.

“మీ దేవూరండి?”

“బందరండి!”

“ఎంతవరకు చదివారు.”

“బి.ఏ. మొదటి తరగతిలో నెగ్గాను”

“సంగీతం పాడగలరా?”

“సై గలంత బాగా పాడలేనండి. మాష్టర్ క్రిష్టకు ఒక్కశ్రుతి తక్కువగా ఉంటాను. పంకజమల్లికూ నేనూ బావమరదులులా ఉంటాం సంగీతములో!”

“కాస్త పాడండి?”

“ఎందుకండి??

“మాకో సినిమా కంపెనీ ఉంది. హరిశ్చంద్ర తీయదలచుకున్నాం. అందులో లోహితాస్యుడు కావాలి.”

“నేనా లోహితాస్యుణ్ణి!”

“ఎందుకు కాకూడదు? నాగయ్యగారు ఇరవైఏళ్ళ బాలా కుమారుడు కావటంలేదా? ఆయనకు ముప్పదిఅయిదు పైన వుంటాయి. పదిహేను ఏళ్ళ తేడాఉన్నా భయం లేదన్నమాటేగా?”

“అవునండి. దేవికారాణికి ముప్పదిఏళ్ళు. పన్నెండేళ్ళ బిడ్డగా దుర్గలో వేషం వేసింది. పద్దెనిమిదేళ్ళ తేడా ఉంది. నేను అయిదేళ్ళ బిడ్డగాకాని రెండేళ్ళ శిశువుగా గాని వేషం వెయ్యవచ్చును!”

“అయితే పాడండి.”

“ఏం పాట?”

“పియా మిలనకో జానా."

“మీ బొమ్మ ఎందులో తీస్తారు?”

“అరవంలో.”

“నేను తెలుగువాణ్ణే ?”

“కన్నాంబ, నాగయ్య తెలుగువాళ్ళు కారూ? జయమ్మ కన్నడిగమ్మ కాదూ?”