పుట:Konangi by Adavi Bapiraju.pdf/199

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాణేశ్వరీ! ప్రేమా పరమావధి లోక సంగ్రహణము.

ఇరువురమూనూ చేయిచేయి

ఉరుకుదా మటు కార్యరంగము

వెరపులేనీ బ్రతుకుదారిని

విజయమే మనకున్.

“ఆత్మేశ్వరీ! ఈ మాట అన్నిటి వెనకా నీకై నా వాంఛ అవిచ్ఛిన్నమై, అద్భుతమై లోకాలనే స్పందింప చేస్తున్నది.

నీ గాఢ ప్రేమాభిలాషి

ప్రియ పతి

కోనంగి.

ఈ ఉత్తరం అనంతానికే అందింది.

10

ఈ ఉత్తరం వ్రాసిన మర్నాడే కోనంగి ఇంకో ఉత్తరం వ్రాశాడు.

కడలూరు జైలు

“ప్రియతమా!

ఇంతలో మనం ఏ జాతక ప్రభావంచేత విడిపోయాము? ప్రేమించిన వస్తువు నుండి బలవంతంగా విడిపోవడం హృదయాన్ని పిండివేసినట్లే ఆత్మేశ్వరీ! నేను నిన్ను విడిచి రాత్రింబవళ్ళు బాధపడుతున్నాను. ఈ ఆవేదన మహెూత్తమ స్థితికి పోవాలి. లేక మనుష్యుణ్ణి అధోగతిపాలు చేస్తుంది. నా ప్రేమను నేను పవిత్ర గంగాప్రవాహంలా ఎంచుకుంటాను. నా ప్రేమ విధానము నాలో హత్తుకుపోయి నేనూ ఆమే ఒకటైపోయాము. నేను వేరు, నా అనంతలక్ష్మి వేరు అన్న భావం ఏనాడు మనం మన ప్రథమ సంశ్లేషతలో పెదవులు చుంబించుకున్నామో ఆనాడే పోయింది. నాలో లయమై పోయావు. ఆ వీరత్వం నాకు వేయి ఏనుగుల బలం ఇచ్చింది. ఆ బలం వట్టి ప్రాపంచిక స్వార్థంకోసం ఉపయోగించడం అల్పత్వమే అవుతుంది. ఆ బలం ప్రపంచంకోసం ఉపయోగించాలి.

“ప్రేమబలము అనంతం అనంతలక్ష్మీ! ఆ బలాన్ని ఉత్తమంగా ఉపయోగించాలి అని నేనంటే దాని అర్థం బ్రహ్మచర్యం ఆవలంబించాలి మనుష్యులంతా అని కాదు. బ్రహ్మచర్యం అంటే మన ఋషుల అభిప్రాయం భగవంతుని మార్గం అని. భగవంతుని మార్గం అంటే సర్వశక్తులు మానవ లోకానికి అభ్యుదయం చేకూర్చేటట్లు చేయాలని.

“భార్యాభర్తలు బిడ్డలు కనాలి వివాహం అనే సంస్థ ఉద్భవించడానికి కారణం బ్రహ్మచర్యమే. బిడ్డలు కనడం బ్రహ్మచర్యము భర్తగాని భార్యగాని మితిమీరి రతికోరడం, నూతన పురుషశక్తి స్త్రీ శక్తి విచ్చలవిడిగా ఉపయోగించడమే. అది బ్రహ్మచర్యంకాదు. ఆ విచ్చలవిడితనంలో లోక ద్రోహం ఉంది. భార్యాభర్తలు తమ జీవితం ఆనందమయం చేసుకొని తమ ప్రేమను తమ జీవిత పరమావధి చేసుకొని, ఆ ప్రేమ ఉత్తమపథ సంచారితము చేసి ఆకాశగంగా శక్తివంతంగా చేసిన నాడు స్త్రీ పురుషులు ఎలాంటి మహత్తర కార్యమయినా సులభంగా, ఉత్తమంగా నెరవేర్చగలరు.

ప్రాణపత్నీ! నువ్వు నా దేవతవు. నా అభయ భూమికవు. నేను కలలుగన్న దేవివి. చిన్ననాడు నాతో ఆటలాడుకొన్నావు. నిన్ను నాతో చదువుకున్న బాలురలో చూచాను.