పుట:Konangi by Adavi Bapiraju.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“అనంతం! నేను డాక్టరుగారితో ఎప్పుడూ వాదిస్తూ అన్ని విషయాలూ గ్రహిస్తున్నాను. ఒంటిగా ఉన్నప్పుడల్లా వివిధాలోచనలలో వివిధ విషయాలు చర్చించు కుంటున్నాను. ఈ ప్రపంచంలో బీదవాడూ, బాధపడేవాడూ ఉండకూడదు. మనుష్యుడు, మనుష్యునికీ మనుష్యునికీ కల్పించిన తేడాలు అంతమయిపోవాలి. ప్రకృతో, భగవంతుడో, లేకపోతే యిద్దరో యిచ్చిన తేడాలు కూడా తగ్గించి, అనేక రీతుల నాశనంచేసి సమన్వయం చేయడానికి మనుష్యుడు ప్రయత్నం చేయాలి. అక్కడ స్త్రీ పురుషులకు మహదానందం వరమై వస్తుంది. కమ్యూనిస్టువాదనా, గాంధీవాదనా నమన్వయం చేసుకొని మనుష్యుడు తన నిత్యజీవితం దిద్దుకొన్ననాడు, లోకంలో అనేకమయిన హీనాసంతృపులు పోయి, ఉత్తమ సంతృప్తులు ఉద్భవిస్తాయి. అప్పుడే మానవజాతి పురోగమిస్తుంది.

ఏమిటీ వేదాంతమంతా అని నువ్వు అనుకోవచ్చును. నేను వేదాంతిని కాను. వట్టి కార్మికుణ్ణి. ఈ కార్మికవాదనే భగవద్గీతలో కర్మవాదన కాబోలు. నాకు తెలియదుసుమా!

ఇంక కమ్యూనిస్టు సిద్ధాంత ప్రకారం నన్ను గడబిడచేసేవి చాలా ఉన్నవి. డాక్టరుగారి వాదనలో ముఖ్యసూత్రాలు కొన్ని ఏమిటంటే: 1. మనుష్యుడే మనుష్యునికి అధికారి. ఇంక దేవుడనిగాని దెయ్యమనిగానికాదు. 2. యేది మనుష్యునికి ఉత్తమమో అదే నైతికము. 3. మనుష్యుని ఉత్తమస్థితికి ఏ మార్గము తక్కువ కర్చుతో, వేగంతో, విజయ నిశ్చయంతో, సరిగా తీసుకొని వెడుతుందో అదే సరియయిన మార్గం. అది హింసాత్మకంకానీ, అహింసాత్మకం కానీ!

ఈ మూడు సూత్రాలూ ముఖ్యంగా ప్రతి మనుష్యుడూ ఆచరణలో పెట్టవలసిన విధి అంటారు. ఈ మూడు సూత్రాలూ నేను ఒప్పుకొన్నాను. ఇవన్నీ గాంధీజీ లోకానికి ఉపదేశించిన సూత్రాలే!

ప్రపంచంలో కమ్యూనిస్టులూ, గాంధీవాదులూ, మధ్యనున్న అనేక వేల యితర వాదులూ యెవరి దారిని వారు వెడుతూ ఉంటే, ఏ మార్గం మంచిదో అదే తోస్తుంది అనే పద్ధతి ఒకటీ, మంచి మార్గం ఏదో నిర్ణయించిదాన్ని గురించి ప్రచారం చెయ్యాలనే మార్గం ఒకటీ ఉన్నాయి.

ఇవన్నీ ఆలోచిస్తూ నిన్న రాత్రి నా ఖయదులో పండుకొని ఉన్నాను. ఆ సమయంలో ఈ రోజున కళలను గూర్చిన వాదనలన్నీ ఎదుట ప్రత్యక్షం అయ్యాయి ప్రాణదేవీ!

“కళకోసం కళ” అని ఒకరు అంటారు. ఇంకోవాదన చతుర్విథ పురుషార్థ ప్రయోజనం కళ అని. మరొకరు కళ నైతికము అని. వేరొకరు కళ దేశాభ్యుదయదాయకంగా ఉండి తీరాలి అని. ఇంకా ఒకరు ఒక్కదేశాభ్యుదయమే కాదు, సకల మానవాభ్యుదయ పూర్వకంగా ఉండాలి అని. మరి వేరే వాదన ఉంది. కళ అనేందుకు కొన్ని గుణాలు ఉండాలి. ఆ గుణాలుంటే తర్వాత ఆ కళకు ప్రయోజనం ఉన్నా సరే, లేకపోయినా సరే అంటారు.

ఆలోచించిన కొలదీ నాకు ఈ వాదనలవల్ల కొంత మతిపోయింది. ఈ విషయాలన్నీ పరిశీలనగా మనస్సుకు హత్తింప చేసుకొందామని, ఆయా వాదనలకు సంబంధించిన పుస్తకాలన్నీ తెప్పించాము నేనూ డాక్టరూను చదివాము. మేము ఇద్దరం హెూరాహెరీ వాదించాము.

నా రాణీ! మా యిద్దరి వాదనలూ ఈ క్రింది సంభాణ రూపంగా ఇస్తాను. నువ్వు పూర్తిగా అర్థం చేసుకో.