పుట:Konangi by Adavi Bapiraju.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

168 గంటలంటే 10,080 నిమిషాలు. 10,080 నిమిషాలంటే 6,04,800 సెకండులు. ప్రతి సెకండూ ఒక యుగమయితే ఎన్ని ప్రళయాలు నా జీవితంలో వస్తాయో?

క్రిందటి సారి నన్ను ముట్టుకోడానికి యెంత చక్కని ఎత్తు వేశారండీ! ఈపట్టు నేనే మిమ్మల్ని ముట్టుకుంటాను చూస్తూ ఉండండి.

ఒక్కదాన్నే ఇంటినంటీ,

ఒక్కదాన్నే దారివెంటా,

ఒక్కదాన్నే జగమునంతకురా

ఓ ప్రాణరాయా!

ఏడపోతివి ప్రథమయామానే?

ఒంటితీగా వీణమీటీ

ఒక్కరాగమె ఆలపించీ

ఒక్కపాటే పాడుతున్నారా

ఓ ప్రాణరాయా!

గానమంటే కలలు రావేరా?

ఈ పాట వ్రాస్తున్నా ప్రాణపతీ! నేను రోజుకో పాట వ్రాస్తున్నా! అన్నీ మీ మీదే నా పాటలు. ఇవన్నీ అచ్చు వేయిద్దాము అనుకుంటున్నది అమ్మ. అలాని నాచేత యెన్నో పాటలు వ్రాయించాలని ఆలస్యంగా వస్తారా? మీరు వచ్చినా నా ఆనందంలో ఇంకా అద్భుతమైన పాటలు వ్రాయగలనండీ!

నిన్న రాత్రి వ్రాసిన పాట అది. ఇవాళ ఉదయం వ్రాసిన క్రింది పాట వినండి.

ఈడూ ప్రాణము ఆత్మా

వేడుతున్నవి నాథా,

తోడితేవటే, కా

పాడవే దివ్యాంగినీ,

తోడి రాగిణీదేవీ!

మీరు నా పాటలమీద మీ అభిప్రాయం ఇవ్వరూ?

ప్రేమతో

గాఢచుంబనాలతో

కౌగలింతలతో

అనంత.

9

అవును అనంతం! నువ్వు చెప్పింది. నిజం. ఉత్తమభావాల సంచరించే ప్రేమకు ప్రపంచంలో ఏదీ అడ్డంరాదు. అడ్డం వచ్చినా నాశనమయి పోతుంది, ఆ ప్రేమకు ప్రపంచానికి అభ్యుదయ పూర్వకమయిన మార్గం ఏదీ ఉందో అదే కనబడుతుంది. స్త్రీ పురుషుల సమ్యక్ స్థితి వారిద్దరినీ ఒక సంపూర్ణ వ్యక్తిని చేస్తుంది. అలాంటి సంపూర్ణ వ్యక్తులుగాని లోకసేవ చేయలేరు.