పుట:Konangi by Adavi Bapiraju.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోనీయండి ఆ చెట్టిని. వాడి పాపాన వాడేపోతాడు. నా స్నేహితురాండ్రందరూ మిమ్ము మరీ మరీ అడిగామని ఉత్తరాలు. నేను ఆంధ్రమహిళా ఖాదీసంఘంలో చేరాను. రోజూ ఖద్దరు నూలు వడుకుతున్నాను. ఖద్దరు బట్టలే కట్టుకుంటున్నాను.

మీరు యెప్పుడు వస్తారో నాకు తెలియదు. ఆర్డినెన్సు క్రింద వెళ్ళినారు. యుద్ధం ఆఖరువరకూ ఉంటారు కాబోలు. కమ్యూనిస్టులలో కొందరు ప్రభుత్వానికి దొరక్కుండగా పారిపోయారు. కొందరు జయిలులోంచి తప్పుకుపోయారు. ఇది వేళాకోళయుద్దమా అని కొందరనుకొంటున్నారు. పోలండు పని అయింది. హాలెండు పతనం, బెల్జియం శరణు. చివరకు ఫ్రాంసు పూర్తిగా లోబడిపోయింది. క్రిందటి సంవత్సరం యివన్నీ జరిగాయి. డంకర్కు తరువాత ఇంగ్లండులో దిగుతాడేమోనని మనం భయపడ్డాము. ఇటలీ వెనుక దెబ్బకొట్టింది అని మీరు వాదించారు.

జర్మనీవారు ఇంగ్లండులో దిగలేరు అని మీరు వాదించారు జ్ఞాపకం ఉందా ఆత్మేశ్వరా! కాని ఆ సమయంలో భారతగాథ ఒకటి నాకు చెప్పారు. జ్ఞాపకం ఉందా? ఒకనాడు ద్రోణుడు దుర్యోధనునకు పరమాద్బుతమయిన మంత్రకవచం యిచ్చాడనీ, ఆ కవచం ధరించి దుర్యోధనుడు అర్జునునిపై తనరథం తోలించాడనీ, అప్పుడు అర్జునుడు యెన్ని బాణాలో దుర్యోధనునిపై వేశాడనీ, అవన్నీ వృధా అయిపోవడం చూసి, పార్థసారధి హేళన చేశాడనీ, అందుపై అర్జునుడు మంత్రకవచ ప్రభావమని తెలుపుతూ సర్వ కవచభేదిని అను అస్త్రం ప్రయోగించాడనీ, ఆ అస్త్రాన్ని శక్తివైచి అశ్వద్ధామ దారిలోనే నరికివేశాడనీ, అప్పుడు అర్జునుడు కోపించి దుర్యోధనుని సూతునీ, గుఱ్ఱలనూ చంపి, రథం చూర్ణంచేసి, పట్టిన విల్లల్లా ముక్కలుచేసి, నిరాయుధుణ్ణిచేసి వదలినాడనీ, అలా హిట్లరు ఇంగ్లీషువారిని జయించాలంటే, ఈజిప్టు, సుడాను, ఎరిట్రియా, సౌమలీలాండు, పాలస్తీనా, ఇరాక్, ఇండియాలు పట్టుకోవాలనీ, కాని హిట్లరు వెనుక నెపోలియను చేసిన తెలివితక్కువే చేసి, రష్యామీద పడి నాశనం అవుతాడనీ అన్నారు.

మీ మాటలే అక్షరాలా నిజం అయ్యాయి. మొన్న జూన్ 23వ తేదీని జర్మనీ రష్యామీద విరుచుకుపడ్డాడు. ఇటలీ రుమేనియాలు యుద్ధం ప్రకటించాయి. ఇక ఇంగ్లీషువారి ఆనందం చూడండి. ఇంగ్లండులో దిగడం తప్పిపోయిందని అనుకుంటున్నారు. ఈ రోజు 24 ఈ నాటికే వేయిమైళ్ళ యుద్ధముఖంలో జర్మనీ రష్యాపైకి చొచ్చుకుపోతున్నాడు. పదిరోజులలో మాస్కోను పడతానంటున్నాడు హిట్లరు. ఈ విషయాలకు మీ డాక్టరుగారు ఏమంటారు?

ఇక్కడ పైన ఉన్న కమ్యూనిస్టులు జర్మనీపై మండిపోతున్నారు. కొందరు ప్రభుత్వం వారిని కలుసుకొని ఏదో రాయబారాలు సాగిస్తున్నారు.

ఇంక రాజకీయాలు అలా ఉంచండి. ఆత్మేశ్వరా! జూలై వస్తోంది. కాలేజీలో చేరనా వద్దా? మీరు దగ్గరలేక నాకు చదువుమీద ఇష్టం పోయింది. మీరు వచ్చునంతవరకు చదువు మానేసి కూర్చుంటాను. మదరాసు ఇల్లు మూసి, మన్నారుగుడి వెళ్ళమన్నారా? కడలూరులో ఒక యిల్లు అద్దెకు తీసుకొని అక్కడ కాపురం పెట్టమని మా అమ్మతో పోరుపెడుతున్నాను.

ప్రాణపతీ! మీరు కటకటాల వెనకాల ఉంటారా? సాయంకాలమే తాళాలు వేస్తారా? ఒక్కరూ ఉంటున్నారు? నేను వినాయగం ద్వారా పంపిన పరుపు మీకు జయిలు అధికారులు ఇచ్చారా? మళ్ళీ మాకు మీ దర్శనం వారం రోజులలో, వారం రోజులంటే 168 గంటలు.