పుట:Konangi by Adavi Bapiraju.pdf/194

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అనంతలక్ష్మి మహిళా ఖాదీ ప్రచార కార్యాలయానికి పోయి వడికేది, యితరులకు వడకటం నేర్పేది. అక్కడ నుండి రాయపేట హైరోడ్డులో ఉన్న మహిళా ఖాదీ ప్రచారాలయ వస్రవిక్రయశాలకుబోయి, అక్కడ ఖద్దరు అమ్మేది. ఆ బాలిక ఖాదీ ప్రచారక సోదరీమణులతో బాగా స్నేహం చేసుకున్నది.

వారందరితో కలిసి ఎప్పుడయినా సేవాగ్రామం వెళ్ళి అక్కడ మహాత్ముని దగ్గిర కొన్నాళ్ళపాటుండాలని అనంతలక్ష్మి నిశ్చయించుకుంది.

వేసవి కాలంలో సేవాగ్రామం భరింపరాని వేడితో మాడిపోతూ ఉంటుందని, జయలక్ష్మి వాదించినా అనంతలక్ష్మి వినలేదు. తన నిశ్చయం భర్తకు ఉత్తరం వ్రాసి, తల్లితో బయలుదేరి వార్ధా చేరింది. ఇదివరకే సేవాగ్రామాశ్రమ కార్యదర్శితో వారుత్తర ప్రత్యుత్తరాలు సలిపి, ఆ జట్టువారు ఆశ్రమంలో ఒక బస ఏర్పాటు చేసుకున్నారు.

సేవాగ్రామంలో అనంతలక్ష్మి పొందిన ఆనందము ఆకాశపథ మందినది. ప్రతి ప్రార్థనా సభకూ ఆమె హాజరు. ఆ ప్రార్థన సమయంలో మహాత్ముని సమీపంలో ఆమె అనుభవించిన శాంతీ, ఆనందమూ పరమోత్తమస్థితి నందింది.

8

జయిలులో ఉన్న కోనంగికి చెట్టియారుగారి ఉద్దేశాలు 'తెలియక పోతాయా! ఆయన ఉత్తరాలలోని అంతరార్థం అప్పుడే అవగాహన అయిందతనికి. అయితే చెట్టియారు ఈలాంటి ఉత్తరాలు అనంతలక్ష్మికీ పంపించి ఉంటాడు. ఆ బాలిక ఎంత బాధపడుతుందో? యేలాంటి విపరీతాభిప్రాయాలకు వచ్చిందో? ఎంతటి క్రూరుడండీ!

కుక్కకు పిచ్చి ఎక్కితే, ఊరకే కరుచుకుంటూ పోతుంది ప్రతి ప్రాణినీ. అందరికీ పిచ్చి ఎత్తుతుంది. ప్రాణాపాయం వస్తుంది. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నారు కాని, కాటువేసిన కుక్కకే చెప్పు దెబ్బలు తగిలిస్తే కరచినవారికి జబ్బు నిమ్మళిస్తుంది. ఆ చెప్పు పాతది, కుట్లు ఊడిపోయి, మేకులు పైకి వచ్చివున్న చెప్పయితే దెబ్బ తగిలించాలి. కొత్త చెప్పు అయితే దెబ్బలు తిన్నవాడికి గౌరవం. చెట్టిగారికి సరియయిన చెప్పు పెంటకుప్పలో నుంచి వెదకాలి.

కోనంగి ఆలోచించి ఉత్తరం ఒకటి అనంతలక్ష్మికి వ్రాస్తూ తనకు వచ్చిన ఉత్తరాలలో తన్ను దెప్పినవి మాత్రమే మతలబులు వ్రాసి తన ఉత్తరంలో పెట్టి పంపించాడు. ఆ మర్నాడు కోనంగికి అనంతలక్ష్మి కడనుంచి ఉత్తరం వచ్చింది.

రెండు ఉత్తరాలూ ఒకదాని తర్వాత ఒకటి మధ్యదారిలో ఒకదాని ప్రక్కనుండి ఒకటి వెళ్ళి ఉంటాయి.

ఏ ఉద్దేశంతో తాను అనంతలక్ష్మికి ఉత్తరం వ్రాసినాడో ఆ ఉద్దేశం తోనే అనంతలక్ష్మి తనకు ఉత్తరం వ్రాసింది! యిద్దరి ఉత్తరాలూ రహస్య టపాదారినే ప్రయాణాలు సాగించాయి.

ఆమె ఎంత చక్కగా వ్రాసింది! ఎంత ఉత్తమభావాలున్నాయి?

“ప్రాణకాంతా! మీకూ చెట్టిగారి ఉత్తరాలు కొన్ని అంది ఉండాలి. మిమ్మల్ని గూర్చి దూషిస్తూ, వినరాని అబద్దాలు వ్రాస్తూ నాకు వ్రాశాడు. ఇద్దరు తారలచే మీకు వ్రాసినట్లు వ్రాయించి నాకు అందేటట్టు చేశాడు. నన్ను గురించి యెన్ని అబద్దాలో మీకు వ్రాయించి ఉంటాడు, వ్రాసి ఉంటాడు. అవి మనజీవితంలో కలతలు పెట్టవు.