పుట:Konangi by Adavi Bapiraju.pdf/191

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మెహర్: నాకు మాత్రం మంచిదిగాదు. మా యిద్దరి రాజకీయాభిప్రాయాలు, అంత తేడాగా ఉంటే, మేం యిద్దరం నిమిష నిమిషానికి కొట్టాడుకొంటోంటే మా ప్రేమ మట్టిగలిసిపోదూ?

అనంత: అంత గట్టిదా మీ ప్రేమా? రాజకీయాలు, వ్యక్తిగతాభిప్రాయాలు ప్రేమకు అడ్డంపడతాయా? ప్రేమ మతాలనూ, రాజకీయాలనూ, వ్యక్తి భావాలనూ మించి మహెూత్తమ వేగంతో ప్రసరిస్తూ ఉంటుంది.

మెహర్: ఏమి చక్కనిమాట చెప్పావు? ఓహెూహెూ! నీకేం నువ్వు చెప్తావు అడుగులకు మడుగులొత్తే భర్తను చేసుకొని!

అనంత: నేను గాంధీతత్వవాదిని, ఖద్దరు కట్టకపోవచ్చుగాక, వడకక పోవచ్చుగాక! కాని మావారు జస్టిస్ పార్టీ అయినా లేక ప్రభుత్వ పక్షపాతీయులయినా నాకు లెక్క లేకుండా ఉండును.

మెహర్: నువ్వు అసలు గాంధీవాదివనుకో. నువ్వు ఖద్దర్ తప్ప ఇతర వస్త్రాలు కట్టుకోవనుకో. నువ్వు ఎప్పుడూ వడుకుతూ ఉంటావు అనుకో! అలాంటప్పుడు మీ ఆయన నిన్ను ఖద్దరు మానివేయమనీ, వడకడం పనికిరాదనీ, గాంధీతో సంబంధం ఏ మాత్రమూ పనికిరాదనీ పట్టుబట్టాడనుకో, అప్పుడేం చేస్తావు?

అనంత: నీకు నిజమయిన ప్రేమ ఉంటే, ఇలాంటి వాటికి భయపడవు, నేనే ఐతే నా ప్రేమ విధానము ఎల్లాంటిదయినా వారినే పెళ్ళి చేసుకుంటాను.

మెహర్ తలవంచి ఆలోచనలో పడింది. అనంతలక్ష్మి కాఫీ, ఉపహారాలు తీసుకురమ్మని చెప్పడానికి వెళ్ళింది. మెహరున్నీసా అనేకవిధాల ఆలోచించుకొంది. రియాసత్ ఆలీ మంచి క్రికెట్టు ఆటగాడు. ఎన్నిసారులో మదరాసు జట్టులో ఆడి వందలకొలదీ పరుగులుచేస్తూ ఉండేవాడు. రియాసత్ హృదయం యెంతో మంచిది. అతడు తానేమన్నా, ఎంత వాదించినా, చివాట్లు పెట్టినా నవ్వుతూ ఊరకుంటాడు. అతడు వాదం చేయడంలో కూడా యెంతో నెమ్మది ఉంది. అలా అని సమర్థత లేకపోలేదు.

ఈలా ఆలోచించుకుంటూ ఉంటే, అనంతలక్ష్మి అక్కడకు చక్కా వచ్చింది.

“ఒసే మెహర్! రా ఇంట్లోకి. కాస్త ఫలహారం చేసి కాఫీ తాగుదాము?"

“యింటి దగ్గర ఉపాహారాలు చేసి వచ్చానే!”

“చేశావులే! మా యింటిదగ్గర కాస్త తినవోయ్”

మెహరున్నీసాకు తెలుగు బాగా వచ్చును. ఆమె తండ్రి ఆంధ్రదేశవాసి. ఆంధ్ర దేశానికి పూర్వము ఎప్పుడో వలస వచ్చిన అరబ్ ముస్లిం సర్దారుల వంశంవాడు. అందుచేత వారింటి వారందరికీ తెలుగు బాగా వచ్చును.

ఇద్దరూ వెళ్ళి ఉపాహారాలు సేవించి కాఫీ త్రాగినారు. మెహర్ పారశీక రాకుమార్తెల అందం అంతా పుణికిపుచ్చుకుంది. వారిద్దరూ అనంతలక్ష్మి చదువుకొనే గదికి వచ్చారు. అక్కడ మెహర్ తన ప్రేమ విషయం అంతా తెల్సింది.

“చిన్నతనాన్నుంచీ మేం ఇద్దరం యెంతో స్నేహంగా పెరిగాం. చిన్నతనంలో మా బావ నన్ను చేసుకుంటాడు అని అల్లరిచేసేవారు. నాకూ మా బావ అంటే చాలా యిష్టమే! అయినా ఇద్దరం కలిసి పెరగడంవల్ల మా బావ నాకు అతిచనువయిపోయారు.”

“ఇంతకూ నీ అభిప్రాయం ఏమిటే?”