పుట:Konangi by Adavi Bapiraju.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీ వంటే ఉండే అభిమానం, గౌరవం, ప్రేమా సంగతి మరచిపోయాడు. మేము ఎవరమో అన్న విషయమే అతని స్మృతిపథాన్నుంచి పోయినట్లుగా ఉంది. నువ్వేమీ బెంగపెట్టుకోకు తల్లీ! మేము ముగ్గురమూ కోనంగిరావుగారిని గూర్చి విచారించడం అల్లా ఉంచు. మా హృదయాల్లో కోనంగిరావుగారంటే ఈషణ్మాత్రం అనుమానంలేదు. నీ పేరగాని, మీ ఆయన పేరగాని వచ్చిన ఉత్తరాలన్నీ మా కిచ్చివేయి. తర్వాత సంగతి మేము చూస్తాము.

“వాడు ఏ దురుద్దేశంతో వ్రాస్తున్నాడో ఆ ఉద్దేశం నెరవేరడమే అవుతుంది, నువ్వు దుఃఖిస్తే. లే; నీ మామూలు ప్రకారంగా నువ్వుండు. నీ స్నేహితురాండ్ర సహాయంతో కోనంగి విషయం. పోలీసువారికి పూర్తిగా తెలిసేటట్టు చేస్తాము. నువ్వు సంతోషంగా వుండు” అని బ్రతిమాలాడు.

గంభీరమైనవీ, చల్లనివీ, శాంతిపూరితమయినవీ అయిన అతని మాటలు అనంతలక్ష్మికి ఎంతో ఉపశమనం కలుగజేశాయి.

అనంతలక్ష్మి ధైర్యంగా లేచింది. వినాయగం కాళ్ళకు నమస్కారం చేసింది. ఇంతలో మెహరున్నీసా అనే స్నేహితురాలు తన పరదాకారులో యెక్కి అనంతలక్ష్మిని చూడడానికి వచ్చింది.

అనంతలక్ష్మి వెంటనే తన స్నానాల గదిలోనికి వెళ్ళి తన మొగము కడుక్కొని యధాప్రకారం చిరునవ్వుతో హాలులోకి వచ్చి మెహరున్నీసాను బిగియార కౌగలించుకున్నది.

మెహరున్నీసా చెన్ననగరం ముస్లింలీగు నాయకులలో నొకరయిన మొహమ్మద్ ఫైజుల్ హుస్సేన్ గారి కొమరిత. ఫైజుల్ హుస్సేన్ గారు చాలా మంచి వకీలు, ఆయనకు ఎంతమందో హిందూ స్నేహితులున్నారు. ఆయనకు హిందువులంటే కోపం లేదు. మతావేశము కలవాడు కాదు. ముస్లింలీగు చాలా గట్టిపడితే, ముస్లింలందరూ ఒకటైతే, కాంగ్రెస్ తో సమాధానంపడి సంధి షరతులు నిర్మాణం అయితే దేశానికి. అభ్యుదయం కలుగుతుందని ఆయన వాదన.

ఫైజుల్ హుస్సేన్ గారికి మేనల్లుడంటే ఎంతో ప్రేమ. కాని అతడు లీగును పూర్తిగా అర్థం చేసుకోలేదని వాదిస్తాడు.

మెహరున్నీసా రియాసత్ ఆలీని ప్రేమిస్తున్నది. రియాసత్ ఆలీ తన మేనమామ కూతుర్ని ప్రేమిస్తున్నాడు. వారిద్దరికీ వివాహం జరుగుతుందని నిశ్చయమే! కాని రాజకీయంగా భావాలు తేడాలయి కొంచెం తీవ్రత పొందాయి. ముస్లిం లెవ్వరూ కాంగ్రెసులో ఉండకూడదంటుంది ఆమె. అల్లా అందని లీగుస్థితి అధ్వాన్నమని వాదిస్తాడు.

పైజుల్ హుస్సేన్ గారిలో లేని తీవ్రత వీరిద్దరికీ వచ్చింది. మెహరున్నీసా క్వీన్ మేరీస్ కళాశాలలో అనంతలక్ష్మి తరగతే. ఇద్దరూ ఇంటరు చదివారు; ఇద్దరూ బి.ఏ. చదువుతున్నారు.

మెహరున్నీసాకుగాని, అనంతలక్ష్మికిగాని రాజకీయాలేవీ తెలియవు. అయినా ఉన్నీసాకు ముస్లింలీగు అంటే వెర్రి అభిమానం. అనంతలక్ష్మికి కాంగ్రెసంటే ఆభిమానం. అనంతలక్ష్మి స్నేహితురాండ్రలో కొందరు జస్టిసుపార్టీ వారున్నారు, కొందరు ఏ రాజకీయ భావాలూ లేని వారున్నారు.

మేహరున్నీసాకూ అనంతలక్ష్మికీ గాఢ స్నేహం. ఆమెకు ఇంకా పరదా ఉంది. తెరలు కట్టిన కారులో కాలేజీకి వెడుతుంది. బైటికి వెళ్ళదు. ఇంగ్లీషు సినీమాలకు వెళ్ళినా, బొమ్మలు మొదలుపెట్టిన తర్వాత హాలులోకి వెళ్ళేది. మధ్య విశ్రాంతిలో మేలిముసుగు